పెళ్ళై నాలుగు నెలలు... బయటకు గెంటేశారు
కడప : వివాహం అయిన నాలుగు నెలల తర్వాత తమకు వద్దంటూ ఓ వివాహితను అత్తింటి వారు బయటకు గెంటేశారు. దీంతో బాధితురాలు మౌన పోరాటానికి దిగింది. ఈ ఘటన వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు స్టేట్ బ్యాంకు కాలనీలో శనివారం చోటు చేసుకుంది. బాధితురాలి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి... శివలీల అనే మహిళకు గతేడాది నవంబర్ నెలలో జమ్మలమడుగుకు చెందిన శ్రీహరితో వివాహం అయింది.
శివలీల రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు... అయితే శ్రీహరి మాత్రం ఆచార్యుల కులానికి చెందిన వాడు... అయితే తామ కులాన్ని దాచి పెట్టి... తాము రెడ్డి కులానికి చెందిన వారమే అని చెప్పడంతో శ్రీహరికి శివలీలను ఇచ్చి ఆమె తల్లిదండ్రులు వివాహం జరిపించారు. ఇటీవల శ్రీహరి కులం వేరని శివలీల తల్లిదండ్రులకు తెలిసింది. దీనిపై నిలదీయడంతో కంగుతున్న శ్రీహరి కుటుంబ సభ్యులు... మీ అమ్మాయి మాకు అక్కర్లేదు.
మీ సంబంధం మాకు అక్కర్లేదు అంటూ శ్రీహరి, అతడి తల్లిదండ్రులు శివలీలను శనివారం మధ్యాహ్నం ఇంట్లోంచి బయటకు గెంటేశారు. అనంతరం ఇంటికి తాళం పెట్టి బయటకు వెళ్లిపోయారు. న్యాయం కోసం శివలీల భర్త ఇంటి ముందే బైఠాయించి మౌన పోరాటం మొదలుపెట్టింది.