అందుకే నా నోరు కట్టేసుకున్నాను!
శివనాగేశ్వరరావు ‘ఫొటో’ సినిమాలో తొలిసారి దర్శనమిచ్చింది అంజలి. ఎవరూ పట్టించుకోలేదు. తర్వాత ‘ప్రేమలేఖ రాశా’ అని మరో సినిమా చేసింది. అమ్మాయి బాగుంది అన్నవాళ్లే కానీ అవకాశాలిచ్చినవాళ్లు మాత్రం లేరు. కోలీవుడ్‌ని నమ్ముకుంది. ఏకబిగిన స్టారై కూర్చుంది. ఇప్పుడు తెలుగులో అగ్ర హీరోల పక్కన కథానాయిక అంటే దర్శక, నిర్మాతల ఫస్ట్ ఆప్షన్ అంజలే.
ఇప్పటికే వెంకటేశ్‌తో రెండు సినిమాల్లో నటించేసింది తను. బాలయ్య, నాగ్‌లతో జతకట్టడమే తరువాయి. సీనియర్ హీరోల సరసన సరిగ్గా సరిపోవడానికి కారణం అంజలి బొద్దుతనమే అని పలువురు అభిప్రాయం. ఈ విషయంపైనే ఇటీవల అంజలి మాట్లాడుతూ -‘‘చిన్నప్పట్నుంచీ నేనూ బొద్దే. అమ్మ, పిన్నీ చాలా గారాబంగా పెంచారు. ఓ విధంగా ఈ బొద్దుతనానికి కారణం అదే.
పైగా మంచి భోజన ప్రియురాలిని. ‘తెలుగమ్మాయిలకు శరీరంపై కంట్రోల్ ఉండదు. తిండి విషయంలో నిగ్రహంగా ఉండలేరు’ అనే వాళ్ల నోరు మూయించడానికే నా నోరు కట్టేసుకున్నాను. ఇప్పుడు చాలామంది నన్ను సౌందర్యతో పోలుస్తున్నారు. అలా పోలుస్తుంటే... ఆనందం, భయం రెండూ కలుగుతుంటాయి. స్టార్‌గా కంటే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే నా ముందున్న లక్ష్యం’’అని చెప్పుకొచ్చారు.