సమాజ స్రవంతిలోకి శివపుత్రులు
శ్మశానం జీవితానికి చివరి వేదిక. అయితే కొందరికది చివరి మజిలీ కాదు, కొన్ని జీవితాలక్కడే మొగ్గ విచ్చుకుంటున్నాయి. కావాలంటే, నెల్లూరు వెళ్లండి. అక్కడ మరు భూమిలోని శివపుత్రులను మార్చిన ఆశయాన్ని చూడండి.
ెల్లూరులోని బోడిగారి తోట శ్మశానం... తలదాచుకోవడానికి నీడ, గూడు లేని అనేక జీవితాలకు ఈ శ్మశానమే ఆవాసం. తిండి, నిద్ర ఈ మరుభూమిలోనే. ఈ రుద్రభూమి వందల మంది బిడ్డలకు జన్మభూమిగా మారింది. ఇక్కడి పిల్లలకు నిత్యం శవాలతోనే సావాసం, ఎముకలు, పుర్రెలతో ఆటలు. పుట్టుకతోనే భయం చచ్చిన ఆ చిన్నారులు.. సభ్యసమాజానికి దూరంగా అసాంఘిక కార్యక్రమాలు, రుగ్మతలతో కొట్టుమిట్టాడారు. ఇది ఒకప్పటి సంగతి. ఇప్పుడు వసంతలక్ష్మి రూపంలో అక్కడ మానవత్వం చిగురించింది. దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న చిన్నారుల భవిష్యత్తుకు క్యాప్ (సిఎపిపి- చైల్డ్ అండ్ పోలీస్ ప్రాజెక్ట్) రూపంలో బంగారు బాట ఏర్పడింది.
వసంతలక్ష్మి సంప్రదాయ కుటుంబానికి చెందిన మహిళ. ఈ ప్రయత్నం చేయడానికి దారి తీసిన పరిస్థితులను ఆమె వివరిస్తూ... ‘‘మా అమ్మ మరణం నన్ను తీవ్రంగా కలచి వేసింది. సంప్రదాయానికి విరుద్ధంగా అమ్మ పార్థివదేహంతోపాటు అంతిమయాత్రలో పాల్గొన్నాను. అప్పుడు శ్మశానంలో కనిపించిన దృశ్యాలు నన్ను కదిలించాయి. ఇంటికి వచ్చినా కూడా అమ్మ మరణం కన్నా ఎక్కువగా ఆ సన్నివేశాలే గుర్తుకురాసాగాయి. దుర్భర దారిద్య్రాన్ని అనుభవిస్తూ చదువు, సంస్కారాలకు దూరంగా శవాల మధ్య బతుకు వెళ్లదీస్తున్న వారి జీవితాలు కలచివేశాయి. దీనికి తోడు మద్యం, మత్తు పదార్థాల సేవనం లాంటి దురలవాట్లు కూడా. వాళ్లను అలాగే వదిలేస్తే పసిమొగ్గలు అసాంఘిక శక్తులుగా మారే ప్రమాదం ఉందని భయం వేసింది’’ అన్నారామె.
క్యాప్ ప్రారంభమైందిలా..
ఆ సంఘటన తర్వాత తరచూ శ్మశానానికి వెళ్లి అక్కడ పిల్లలతో మాట్లాడడం ప్రారంభించారు వసంతలక్ష్మి. ఆ పిల్లలు ఆమెను గ్రహాంతర వాసులను చూసినట్లు వింతగా చూసి పరుగులు తీసేవారు. వారిని మంచి చేసుకోవడం కోసం ఆమె చాక్లెట్లు, బొమ్మలు ఇచ్చేవారు. వారి కోసం వైద్యశిబిరాలు ప్రారంభించారు. మంచి మాటలు చెప్పడం, మెడికల్ క్యాంప్‌లు నిర్వహించడంతో పిల్లలు, వారి తల్లిదండ్రులకు వసంతలక్ష్మిపై నమ్మకం కలిగింది. అక్కడి మహిళలకు పొదుపు చేయడం నేర్పించారు. బృందాలను ఏర్పాటు చేసి సంఘటితంగా పొదుపు పథకాన్ని కొనసాగించేటట్లు తర్ఫీదునిచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తయితే అక్కడి అసాంఘిక వాతావరణాన్ని అదుపు చేయడం వసంతలక్ష్మికి శక్తికి మించిన పనైంది. తరుణోపాయం సూచించవలసిందిగా ఆమె పోలీసులను సంప్రదించారు. ఆమె ప్రయత్నానికి అప్పటి ఎస్పీ రమణకుమార్ స్పందించారు. స్వచ్ఛందసేవా సంస్థలు, పోలీసు శాఖ సంయుక్తంగా పని ప్రారంభించాయి. వంద మందికిపైగా ఉన్న బడి ఈడు పిల్లల్లో మార్పు తెచ్చేందుకు వివిధ కార్యక్రమాలను రూపొందించారు. 2011 అక్టోబర్ 3న చైల్డ్ అండ్ పోలీసు ప్రాజెక్టు(క్యాప్) ఆవిర్భవించింది.
సాధారణ బాల్యానికై అసాధారణ సాధన...
‘‘క్యాప్ ప్రారంభమైన తర్వాత జిల్లా పోలీసు యంత్రాంగం, మా చారిటబుల్ ట్రస్ట్ సిబ్బంది ఆ పిల్లలను రోజూ బస్సుల్లో తిప్పడం, సినిమాలకు తీసుకెళ్లడం, కలసి ఆటలాడడంతో పిల్లల్లో మార్పు వచ్చింది. ఈ క్రమంలో పిల్లలకు వ్యక్తిగత పరిశుభ్రత, గోళ్లు కత్తిరించడం, పళ్లు తోముకోవడం, శుభ్రమైన బట్టలు ధరించడం, జుట్టు కత్తిరించుకోవడం లాంటి పనులు నేర్చుకున్నారు’’ అన్నారు వసంతలక్ష్మి.
పరిసరాల మార్పు!
స్థానిక పోలీసు హాస్టల్లో ఈ పిల్లలకు ఉచిత వసతి, భోజనం, పోలీసుశాఖ నిర్వహిస్తున్న వ్యాస్ పోలీసు వెల్ఫేర్ స్కూల్లో ఇంగ్లిష్ మీడియంలో బోధన ప్రారంభించారు. ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు జిల్లా పోలీసులు ఒక నెల వేతనాన్ని క్యాప్‌కు విరాళంగా అందజేశారు. ఆ తర్వాత కూడా అవసరమైన సందర్భాలలో చేయూతనిస్తున్నారు. అప్పటి డీజీపీ ప్రోత్సాహంతో పలువురు దాతలు ముందుకొచ్చారు.
ఈ చిన్నారులకు చదువుతోపాటు ఆటలు, నాట్యం వంటి వాటిల్లోనూ శిక్షణనిస్తున్నారు. వయసుతో నిమిత్తం లేకుండా ప్రతిభకు తగ్గ తరగతులు చదువుతున్నారు. ‘బాగా చదువు కుని పోలీసు అధికారులు, కలెక్టర్, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతామ’ని చెబుతున్నారీ పిల్లలు. ఈ ‘శివపుత్రులు’ ఆరోగ్యకర వాతావరణంలో పెరిగిన సాధారణ పిల్లల్లా మారిన తీరు చాలామందికి ఒ నమూనా అంటే అతిశయోక్తి కాదు.
- బిజువేముల రమణారెడ్డి, సాక్షి ప్రతినిధి, నెల్లూరు
అంతకంటే ఆనందమేముంది!
‘‘మొదట బూతులు తిట్టిన పిల్లలు నన్ను ‘అమ్మా’ అని పిలుస్తున్నారు. చిత్తు కాగితాలు ఏరుకుంటూ, పాచి పనులు చేసుకునే వారి తల్లితండ్రుల్లో నమ్మకం కలిగించడానికి నానా తంటాలు పడాల్సి వచ్చింది. పోలీసుల సహకారం తో ఈ పిల్లల జీవితాలను మార్చగలిగాను. పిల్లల్లో పరివర్తన రావడం సంతోషంగా ఉంది. వీళ్లను చూస్తూ నా కష్టాన్ని మర్చిపోతున్నాను. వీళ్లను ప్రయోజకులుగా చేయడమే ఇప్పుడు నా కర్తవ్యం.’’
- వసంతలక్ష్మి, చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకురాలు