పెళ్లి చూపులకెళ్లి పరలోకాలకు..
ధర్మవరం రూరల్ : తన కుమారుడి పెళ్లి చూపుల కోసం తన బంధువులతో కలసి రేగాటిపల్లికి వెళ్లి ద్విచక్ర వాహనంపై ఆదివారం తిరిగి వస్తుండగా వేగంగా వస్తున్న కారు డీకొని చాకలి శివరుద్ర(55) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు, బంధువుల వివరాల మేరకు.. కణేకల్లు మండలం కలేకుర్తికి చెందిన శివరుద్ర తన కుమారుడి పెళ్లి చూపుల కోసం బంధువులతో కలసి ధర్మవరం మండలం రేగాటిపల్లికి వచ్చారు. పెళ్లి చూపుల అనంతరం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాల్లో స్వగ్రామానికి బయలు దేరారు.
మార్గ మధ్యలో శీతారాంపల్లి వద్దకు రాగానే ముందుగా వస్తున్న శివరుద్ర జాతీయ రహదారిపైకి వచ్చి రోడ్డు దాటుతుండగా బెంగళూరు నుంచి వేగంగా వస్తున్న కారు ఢీకొనింది. ద్విచక్ర వాహనాన్ని వేగంగా ఢీకొనడంతో చాలా దూరం ఎగిరిపడ్డాడు. ప్రమాదానికి కారణమైన కారు ఆగకుండా వెళ్లిపోయింది. స్థానికులు మరూరు వద్ద ఉన్న టోల్‌ప్లాజాకు సమాచారం అందించారు. అక్కడ ఉన్న పోలీసులు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.
మృతుడికి భార్య లక్ష్మిదేవి, ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నట్లు బంధువులు తెలిపారు. ఇన్చార్జ్ ఎస్ఐ సురేష్ ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కలుగకుండా చర్యలు తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.