కృష్ణా నదిలో ఆరుగురి గల్లంతు
అందరూ ఒకే కుటుంబ సభ్యులు
పెళ్లికి వెళ్లి వస్తుంటే తెప్ప బోల్తా
బాగల్కోటే జిల్లా హునగుంద
తాలూకాలో ఘోరం
బెంగళూరు: శుభకార్యానికి వెళ్లి సొంత గ్రామానికి వస్తున్న సమయంలో తెప్ప బోల్తా పడి ఆరుగురు గల్లంతైన సంఘటన బాగల్కోటే జిల్లా హునగుంద తాలుకాలో జరిగింది. హునగుంద సమీపంలోని ఆమరవాడగి గ్రామంలో బుధవారం వివాహం జరిగింది. ఈ శుభకార్యానికి ఇందవార గ్రామానికి చెందిన మల్లమ్మ (35), హులిగమ్మ (18), కరియప్ప (38), సావిత్రి (6), సచిన్ (5), మంజవ్వ (12)తో సహ బంధువులు వెళ్లారు. శుభకార్యం ముగించుకుని ఈ ఆరుగురితో సహా ఎనిమిది మంది తెప్పలో కృష్ణ నదిపై సొంత గ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో నీటి అలలకు తెప్ప బోల్తా కొట్టింది.
ఈ ప్రమాదంలో ఆరుగురు నదిలో గల్లంతయ్యారు. ఇద్దరు మాత్రం ప్రాణాలతో బయటపడ్డారు. విషయం తెలుసుకున్న తహసిల్దార్ సంపవాగి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది కృష్ణ్ణా నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడ్డా.. ఏ ఒక్కరి ఆచూకీ లభించలేదు.