స్కల్.. 'కలర్' ఫుల్!
గచ్చిబౌలి/మాదాపూర్: ప్రపంచ వ్యాప్తంగా పర్యాటక రంగాన్ని ప్రోత్సహించడంతోపాటు...ఈ రంగంలోని సాధకబాధకాల గురించి చర్చించే లక్ష్యంతో ప్రతిఏటా స్కల్(ఎస్‌కేఏఎల్) సంస్థ నిర్వహించే వరల్డ్ కాంగ్రెస్ మీట్‌కు ఈసారి భాగ్యనగరం వేదికైంది. 1934లో ఏర్పడిన స్కల్ సంస్థ ప్రతి ఏటా ఏదో ఒక దేశంలో సదస్సు నిర్వహిస్తుంది. ఈ ఏడాది మన దేశంలోని హైదరాబాద్‌ను వేదికగా చేసుకుని 78 వ ప్రపంచ సదస్సు నిర్వహిస్తోంది. ఈమేరకు శుక్రవారం మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో నాలుగు రోజుల స్కల్ వరల్డ్ సమ్మిట్ కలర్ఫుల్గా ప్రారంభమైంది. దాదాపు 600 మంది విదేశీ ప్రతినిధులు పాల్గొంటున్నారు.
స్కల్ చరిత్ర ఇదీ...
పర్యాటక రంగంతోపాటు దాని అనుబంధ రంగాలతో కలిసి 1934వ సంవత్సరంలో స్కల్(ఎస్‌కేఏఎల్) ఏర్పడింది. దీని ప్రధాన కార్యాలయం స్పెయిన్‌లో ఉంది. పర్యాటక రంగంలో స్కల్‌ను అత్యంత పురాతనమైన సంస్థగా పేర్కొంటారు. 85 దేశాలలో ఇది పనిచేస్తోంది. దీనిలో 17000 మంది సభ్యులుండగా, 382 క్లబ్‌లు ఉన్నాయి. ‘స్కల్’ సదస్సు నిర్వహించిన చోట పర్యాటకరంగం పదిశాతం వృద్ధి చెందుతుంది. మనదేశంలో 2003లో చెన్నైలో మొట్ట మొదటిసారిగా స్కల్ సదస్సు జరిగింది. 78వ స్కల్ వరల్డ్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్‌ను ఈ ఏడాది నిర్వహించేందుకు ప్రపంచంలోని నాలుగైదు పట్టణాలు పోటీ పడ్డాయి. అయితే 136 ఓట్ల మెజారిటీతో హైదరాబాద్‌కు ఆ అవకాశం దక్కింది. ఆయా దేశాల ప్రతినిధులు పర్యాటక రంగం, దాని అనుబంధ రంగాలు, సమస్యలు, సవాళ్లు, అభివృద్ధి తదితర అంశాలపై ఈ నాలుగురోజుల పాటు సుదీర్ఘంగా చర్చించనున్నారు.
సముద్రంలోనే ఆటాపాటా...
పర్యాటక ప్రియులు సముద్రంలోనే విహరిస్తూ ఎంజాయ్ చేసే అవకాశాన్ని తాము కల్పిస్తున్నామని ఆర్క్ ట్రావెల్స్ ప్రతినిధులు చెబుతున్నారు. షిప్‌లోనే స్టార్ హోటల్ ఉంటుంది. ఎంచక్కా మినీ గోల్ఫ్, గోకార్టింగ్, రాక్ క్లైంబింగ్, టేబుల్ టెన్నిస్, బాస్కెట్‌బాల్ ఆడుకోవచ్చు. సదస్సులు కూడా నిర్వహించుకునే వీలుంటుంది. సింగపూర్, థాయ్‌లాండ్, మలేసియా, అలస్కాతో పాటు యూరప్ దేశాలకు ఆర్క్ ట్రావెల్స్ ‘స్టార్ క్రూజెస్’ ప్రత్యేక ప్యాకేజీని అందిస్తోంది. షిప్లో 1500 మంది నుంచి 6 వేల వరకు ఉండవచ్చు. సింగపూర్‌కు రెండు రాత్రులు రెండు పగళ్లకు రూ.20 వేలు చెల్లించాల్సి ఉంటుంది. అలెస్కాకు ఏడు రాత్రులు, ఏడు రోజులకు లక్ష రూపాయలు.
నేచురల్ అడ్వెంచర్ టూరిజం...
నేచరల్ అడ్వెంచర్ టూరిజానికి కేరళ పెట్టింది పేరు. కేరళ పర్యాటక శాఖ రెండు రకాలైన స్కీమ్‌లను అందిస్తోంది. నేచురల్ అడ్వెంచర్ టూరిజం పేరిట ప్యాకేజీని రూపొందించింది. టెక్కడి, మున్నార్, వుయనాడులలో విహరించవచ్చు. అంతే కాదు..బ్యాంబు రాఫ్టింగ్, విలేజ్ యాక్టివిటీస్, బోటింగ్, రాక్ క్లైంబింగ్ చేయొచ్చు. ఇవి ఎంతో సాహసంతో కూడుకొని ఉంటాయి. కొచ్చిన్‌లో పికప్ చేసుకొని కాలికట్లో వదిలేస్తారు. మూడు రాత్రులు, నాలుగు రోజులకు ఇద్దరు రూ.43,000 చెల్లించాల్సి ఉంటుంది. స్పైస్ రూట్స్ పేరిట మరో ప్యాకేజీని అందిస్తున్నారు. కొచ్చిన్‌లో పికప్ చేసుకొని పరవూర్, వాస్కోడిగామా ఫోర్ట్ తీసుకెళతారు. పూర్తిగా అరేబియా సముద్రంలోనే ప్రయాణించాల్సి ఉంటుంది. రెండు రాత్రులు, రెండు రోజులకు కలిపి ఇద్దరికి రూ.25,000 చెల్లించాల్సి ఉంటుంది.
30 స్టాళ్లు...
స్కల్ వరల్డ్ ఇంటర్నేషనల్ కాంగ్రెస్ సదస్సులో 30 స్టాళ్లు ఏర్పాటు చేశారు. తెలంగాణ, గుజరాత్, కేరళ టూరిజం విభాగాలతో పాటు ఆర్క్ ట్రావెల్స్, ఇండిగో ఎయిర్ లైన్స్, ఓమన్ ఎయిర్ లైన్స్, ఆక్వా సన్ గ్రూప్, రియా ట్రావెల్స్ తదితర సంస్థలు స్టాళ్లు ఏర్పాటు చేశాయి. పర్యాటకులను ఆకర్షించేందుకు ప్యాకేజీలు, సౌకర్యాలు, విశేషాలను వివరిస్తున్నాయి.
నేపాల్‌లో పర్యాటక స్థలాలు ఇవే ...
టీ గార్డెన్, పశుపతి దేవాలయం, జానకీ దేవాలయం, లుంబిని(బుద్ధుడు జన్మించిన ప్రదేశం), ప్యారడైస్ పోకరా, ఎవరెస్ట్ పర్వతం, ట్రెక్కింగ్, రాప్టింగ్లు నేపాల్‌లో ప్రత్యేకతలుగా చెప్పొచ్చు. ప్యారడైస్ పోకరా విశేషమేమిటంటే...కొండ పర్వతం..దాని కింది భాగంలో ఊరు, దానికి కింద భాగంలో పెద్ద చెరువు ఉంటుంది. పర్వతం నీడ చెరువులో కనిపించడమే ప్రత్యేకంగా సందర్శకులను ఆకట్టుకుంటుంది. ఎత్తయిన కొండ ప్రాంతంపైకి కర్రల సాయంతో ఎక్కేందుకు సందర్శకులు ఎంతో ఇష్టపడుతున్నారు. ప్రతి ఏటా భారతదేశం నుంచి రెండు లక్షల మంది, ప్రపంచ వ్యాప్తంగా 8 నుంచి 10 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు. – అంబిక పోకారెల్, నేపాల్
గుజరాత్లో రాన్ ఉత్సవ్ స్పెషల్..
నవంబర్ 1వ తేదీ నుంచి 2018, ఫిబ్రవరి 20వ తేదీ వరకు గుజరాత్లో రాన్ ఉత్సవాలను ప్రత్యేకంగా నిర్వహిస్తారు. నది ఒడ్డున వివిధ రకాల లైటింగ్‌తో టెంట్లు, డేరాలు ఏర్పాటు చేసి పర్యాటకులకు ప్రత్యేక విడిది కల్పిస్తారు. పర్యాటకులను ఆకట్టుకునేందుకు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. అహ్మదాబాద్‌లోని చారిత్రక కట్టడాలు, రానికీవావ్, పఠాన్లు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందాయి. అదే విధంగా ప్రతి ఏడాది జనవరి 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఇక్కడ అంతర్జాతీయ కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తారు. – అజిత్‌కుమార్ శర్మ, టూరిస్ట్ ఆఫీసర్, గుజరాత్