వినోదం కోసం ఇంత క్రూరత్వమా!
టోక్యో: జపాన్‌లోని ఓ అమ్యూజ్మెంట్ పార్క్ నిర్వాహకులు చేసిన వినూత్న ఆలోచన విమర్శలకు దారితీసింది. సోషల్‌మీడియాలో తీవ్ర విమర్శలు చెలరేగడంతో చివరికి ఆదివారం కిటాక్యుషులోని ఆ పార్క్‌ను మూసివేశారు.
ఇంతకు వారికి తట్టిన ఆ ఆలోచన ఏంటంటే.. పార్క్‌లోని స్కేటింగ్ రింక్ పర్యాటకులను ఆకట్టుకునేలా ఉండాలని సుమారు 5000 చేపలను ఐస్‌లో అక్కడక్కడా ఉంచారు. 250 మీటర్ల పొడవున్న ఐస్ సర్క్యూట్లో 25 రకాల చేపలను పర్యాటకులకు కనిపించేలా ఏర్పాటుచేశారు. దీనిని చూసిన వారికి సముద్రంలోని చేపల్లా కనిపించాలని అలా చేశామని పార్కు నిర్వాహకులు తెలిపారు.
‘ఎట్రాక్షన్ నెవర్ హియర్డ్ అబౌట్’ అంటూ నిర్వాహకులు చేసిన ఈ ఘనకార్యం పర్యాటకులను ఆకట్టుకునే మాట అటుంచితే.. చనిపోయిన చేపలను అలా మంచులో చూడటం చాలా అసహజమైన, అభ్యంతరకరమైనరీతిలో ఉందని జంతుప్రేమికులు, నెటీజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అయినా వినోదం కోసం ఇంత క్రూరత్వం అవసరమా అంటూ పెదవి విరిచారు.