ఎస్కేఎస్ ముంబైకి తరలుతోంది..
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎస్కేఎస్ మైక్రోఫైనాన్స్ నమోదిత కార్యాలయాన్ని ఆంధ్రప్రదేశ్ నుంచి మహారాష్ట్రలోని ముంబైకి తరలించేందుకు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ అనుమతిచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మూడేళ్ల క్రితం సూక్ష్మ రుణ సంస్థల కార్యకలాపాల విషయంలో నిబంధనలను కఠినతరం చేసిన సంగతి తెలిసిందే.
దీంతో కంపెనీకి ఇక్కడ వ్యాపారం పూర్తిగా దెబ్బతింది. దాదాపు 14 ఏళ్ల క్రితం రాష్ట్రంలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన కంపెనీ అంచెలంచెలుగా ఎదిగి 15 రాష్ట్రాలకు విస్తరించింది. వ్యాపార పరంగా చూస్తే మూడేళ్ల క్రితం వరకూ కంపెనీకి సింహ భాగం ఆంధ్రప్రదేశ్ నుంచే సమకూరేది. ప్రస్తుతం ఇక్కడ పరిస్థితులు తారుమారయ్యాయి. ఈ కారణంగానే ఎస్కేఎస్ మహారాష్ట్రకు తరలుతున్నట్టుగా తెలుస్తోంది. నూతన కార్యాలయాన్ని ముంబైలో ఎక్కడ ఏర్పాటు చేసేది ఇంకా నిర్ణయించలేదని కంపెనీ ప్రతినిధి సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. కాగా, కార్యాలయాన్ని తరలిస్తున్నందున 10వ ఏజీఎంను డిసెంబరు 31లోగా నిర్వహించుకునేందుకు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ అనుమతిచ్చింది.