‘వాళ్లకి వేతనం ఇవ్వకండి’
ఏలూరు (పశ్చిమగోదావరి): ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడంలో అలసత్వం వహించారనే కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 59 మంది అధికారులకు జీతాలను నిలిపివేస్తూ కలెక్టర్ కె.భాస్కర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు జిల్లా ఖజానా అధికారి సోమవారం ఎస్కేవీ మోహనరావుకు ఆదేశాలిచ్చారు. వివిధ అంశాలకు సంబంధించి గడచిన మూడు నెలల్లో ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలని కలెక్టర్ భాస్కర్ జిల్లాలోని 59 శాఖల అధికారులను ఆదేశించారు.
ఫిర్యాదుల పరిష్కారానికి ఏప్రిల్ 28వ తేదీ వరకు గడువు ఇచ్చారు. గడువు దాటినా ఫిర్యాదులను పరిష్కరించని అధికారులకు జరిమానాలు సైతం విధించారు. వాటిని చెల్లించడంలోనూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వారి జీతాలను నిలుపుదల చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు. దీంతో సోమవారం సాయంత్రానికి 10 మంది అధికారులు జరిమానాలను చెల్లించారు. అలాంటి వారికి జీతాలు ఇబ్బంది లేకుండా చెల్లిస్తామని జిల్లా ఖజానా అధికారి మోహనరావు చెప్పారు.