రుతుపవనాలు వచ్చేస్తున్నాయి!
► తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు
► ఈ నెల 30న కేరళను తాకుతాయి: ఐఎండీ
► ఈ నెల 29కే.. స్కైమెట్ అంచనా
సాక్షి నాలెడ్జ్ సెంటర్: మాడు పగిలే ఎండలతో సతమతమవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి కబురు. వేడెక్కిన వాతావరణాన్ని చల్లబరిచేందుకు రుతుపవనాలు సిద్ధమవుతున్నాయి. ఈ ఏడాది రుతుపవనాలు సకాలంలో.. అంటే ఈ నెల 30వ తేదీల్లోనే కేరళ తీరాన్ని తాకనున్నాయని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) తెలిపింది. అయితే అంతకంటే ఒక రోజు ముందే రుతుపవనాలు తాకుతాయని వాతావరణ అధ్యయన సంస్థ స్కైమెట్ ప్రకటించింది. గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది రుతుపవనాల విస్తరణ, ప్రభావం కొంచెం మెరుగ్గా ఉంటుందని స్కైమెట్ శాస్త్రవేత్త ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. నాలుగు నెలల రుతుపవనాల సీజన్ మొత్తమ్మీద వర్షపాతం దీర్ఘకాలిక సగటులో 95 శాతం వరకూ ఉండవచ్చని స్కైమెట్ అంచనా వేస్తోంది.
నైరుతి రుతుపవనాలు జూన్ 1న కేరళను తాకి.. ఆ తర్వాత దశలవారీగా జూలై 15 నాటికి దేశమంతా విస్తరిస్తాయి. అయితే గత ఏడాది ఎల్నినో కారణంగా రుతుపవనాల రాక, విస్తరణలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయి. వారం ఆలస్యంగా తీరాన్ని తాకిన మేఘాలు ఆ తర్వాత కొంతకాలం స్తబ్దుగా ఉండిపోయాయి. అయితే ఈ ఏడాది అందుకు భిన్నంగా ఉండబోతోందని స్కైమెట్ అంచనా వేస్తోంది. కొన్నిరోజులుగా కేరళతోపాటు, తమిళనాడు అంతర్భాగాల్లో ముందస్తు వానలు కురుస్తుండగా.. ఈ నెల 25 నుంచి ఈ ప్రక్రియ మరింత వేగం పుంజుకోనుంది. విదర్భ, తెలంగాణ వంటి దేశ మధ్య ప్రాంతాల్లో భూమి ఉపరితలం బాగా వేడెక్కి ఉండటం బంగాళాఖాతంలో అల్పపీడన పరిస్థితులు ఏర్పడేందుకు, తద్వారా రుతుపవనాల రాకకు తోడ్పడతాయని స్కైమెట్ అంచనా వేస్తోంది. రెండు నెలల క్రితం ఉన్న ఎల్నినో పరిస్థితుల స్థానంలో బలహీనమైన లానినా పరిస్థితులు ఏర్పడటం కూడా రుతుపవనాలపై ప్రభావం చూపుతోంది. మే చివరికల్లా కేరళ తీరాన్ని తాకే సమయానికే దీని ప్రభావంతో కేరళ, కర్ణాటకలతోపాటు తెలంగాణ, ఏపీలోని రాయలసీమ ప్రాంతాల్లో చెదురు మదురు వర్షాలు కురుస్తాయని.. స్కైమెట్ అంటోంది. అలాగే జూన్ నెలలో తెలంగాణ, ఏపీలో తగినన్ని వర్షాలు కురుస్తాయని.. సగటు వర్షపాతానికి ఒకట్రెండు శాతం ఎక్కువ వానలు కురిసినా కురవవచ్చని అంచనా వేస్తోంది.