లాస్ఏంజిల్స్లోనే ఎత్తైన భవంతిపై నుంచి..
లాస్ ఏంజిల్స్: కొన్ని సాహసాలు.. చావుతో సెల్ఫీ దిగినంత గగుర్పాటుకు గురిచేస్తాయి. సంకల్పం ఉన్నవాళ్లకేకాక అతిసాధారణ మానవులకు సైతం ఆ మహత్తర అవకాశాన్ని కల్పిస్తోంది లాస్ ఏంజిల్స్ లోని యూఎస్ బ్యాంక్ బిల్డింగ్. కాలిఫోర్నియా రాష్ట్రంలోనే అత్యంత ఎత్తైన భవనంగా రికార్డులకెక్కిన ఆ భారీ భవంతి పై ఫ్లోర్ లో ఓ స్కైస్లైడ్ ను ఏర్పాటుచేశారు. భూమి నుంచి దాదాపు 1,000 అడుగుల ఎత్తులో నిర్మించిన స్కైస్లైడ్ కూర్చుని ఒక ఫ్లోర్ కిందికి దిగే సాహసక్రియ ఉంది చూశారూ.. 'బాబోయ్.. టెర్రిఫిక్' అని వెళ్లొచ్చినవాళ్లంతా అంటున్నారు.
కేవలం 1.25 ఇంచుల మందపాటి గ్లాస్ తప్ప మృత్యువు నుంచి మనల్ని కాపాడే వస్తూవేదీ ఆ స్కైస్లైడ్ లో ఉండదు. 'అదృష్టవశాత్తూ దిగేది ఒక్క అంతస్తే కాబట్టి సరిపోయింది. లేకుంటే అందులో ప్రయాణించినప్పుడే నా గుండె ఆగి ఉండేది' అని ఓ సాహసి స్కైస్లైడ్ లో తన అడ్వెంచర్ ను గుర్తుచేసుకుంటాడు. ప్రతి శనివారం స్కైస్లైడ్ లో డేరింగ్ ఈవెంట్ ను నిర్వహిస్తోన్న యజమానులు ఒక్కో రైడ్ కు 33 డాలర్లు (మన కరెన్సీలో రూ.2,240) వసూలు చేస్తున్నారు. ఏ వీకెండ్ కో లాస్ ఏంజిల్స్ లోని డౌన్ టౌన్ కు వెళితే తప్పక ఈ టెర్రిఫిక్ అడ్వెంచర్ చూస్తారు కదూ!