మోదీ స్లోగన్ మేకర్‌గా మిగిలిపోయారు
అసహనం పెరిగిన కొద్దీ మహిళలపై దాడులు
మహిళలు పోరాటాలలో ముందుండాలి
ఏఐఐఈఏ జాతీయ సహాయ కార్యదర్శి గిరిజ
విజయవాడ : దేశ ప్రధాని నరేంద్ర మోదీ కేవలం స్లోగన్ మేకర్‌గా మిగిలిపోయారని, అభివృద్ధి లేదని ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ జాతీయ సహాయ కార్యదర్శి గిరిజ అన్నారు. దేశంలో పెరుగుతున్న అసహనానికి నిదర్శనమే ఇటీవల జరుగుతున్న సంఘటనలని ఆమె పేర్కొన్నారు. ఆల్ ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు అనుబంధ ఎల్ఐసీ మహిళా ఉద్యోగుల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రెండో సదస్సు ఆదివారం విజయవాడ నగరంలోని ఓ హోటల్లో జరిగింది. ఈ సదస్సులో అతిథిగా పాల్గొన్న గిరిజ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అసంఘటిత రంగంలోని కార్మికులను, మహిళా ఉద్యోగులను చైతన్యపరుస్తూ వారిని పోరాటాల్లో ముందుభాగంలోకి తీసుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. మోదీ కార్పొరేట్లకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు.
కాగా మహిళా ఉద్యోగులందరూ గర్వపడేలా వేతన సవరణ జరిగిందన్నారు. బెంగళూరు డివిజన్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎస్కే గీత మాట్లాడుతూ దేశంలో అసహనం పెరిగేకొద్దీ, మహిళల మీద దాడులు కూడా పెరుగుతున్నాయన్నారు. ఎల్ఐసీ మహిళా ఉద్యోగుల సమన్వయ కమిటీ ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ కామేశ్వరి, కర్నాటక రాష్ట్ర ఎల్ఐసీ మహిళా ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్ హెచ్ఆర్ గాయత్రి, తెలంగాణ రాష్ట్ర ఎల్ఐసీ మహిళా ఉద్యోగుల సమన్వయ కమిటీ కన్వీనర్ అరుణకుమారి, అసోసియేషన్ నాయకులు జి కిషోర్‌కుమార్, బిబి గణేష్, జేవియర్ దాస్‌తో పాటు రెండు రాష్ట్రాల నుంచి విచ్చేసిన ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.