మంచికి ఆశీర్వచనం ఉంటుంది!
నేను నా దైవం
గొప్పగుణాల వల్ల దేవుణ్ణి మనం కొలుస్తాం.
గొప్ప స్నేహితుడిగా దేవుణ్ణి తలుస్తాం.
కష్టం వచ్చినా..
సంతోషం వచ్చినా దేవాలయానికి చేరుతాం.
ఆ దైవత్వం మనిషిలోనే ఉంటే..!
మంచితనం సహాయగుణం మనిషే అయితే ..!!
అప్పుడు మనిషే మసీద్ అయిపోతాడు.
అలాంటి మంచితనానికి ఆశీర్వచనం ఉంటుంది.
ఎస్.ఎం. మలిక్‌కు ధార్మిక సమాజంలో మంచి పేరు ఉంది. ఇస్లాం ధార్మిక కార్యకర్తగా, ఇస్లాం ధార్మిక పత్రిక ‘గీటురాయి’కి ముప్పై ఏళ్లుగా సంపాదకునిగా, వీటికంటే విశిష్టంగా ఖురాన్ తెలుగు అనువాదకునిగా సమాజంలో ఆయన గౌరవం, గుర్తింపు పొందారు. జమాతే ఇస్లామీ హింద్ సంస్థతో ఆయనకు సుదీర్ఘ అనుబంధం ఉంది. దైవాన్ని కనుగొనడంలో, ఆరాధన ద్వారా దైవానికి చేరువ కావడంలో మలిక్ స్వీయ అనుభవాలు ఎలా ఉన్నాయి, ఇస్లాం ఒక మతంగా జీవన ధర్మంగా ఎటువంటి దైవమార్గాన్ని బోధిస్తుంది, తదితర సందేహాలకు ఏడు పదుల వయసు దాటిన మాలిక్ కూలంకషంగా జవాబులు చెప్పారు.
మీ జీవితంలో ఇదంతా దైవికం అనుకున్న సందర్భం?
మాది కర్నూలు జిల్లా. నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు. పది వరకు ఉర్దూ, తెలుగు, సంస్కృతం చదువుకున్నాను. కాలేజీ మెట్లు ఎక్కలేదు. పుస్తకాలు ముఖ్యంగా తెలుగుసాహిత్యం బాగా చదివాను. సింగరేణి కాలరీస్‌లో ఎలక్ట్రికల్ విభాగంలో డెయిలీ మజ్దూర్‌గా పనిచేశాను. తర్వాత సదరన్ రైల్వేలో పదేళ్లు డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేశాను. ఆ తర్వాత ధార్మిక సేవ చేయాలనిపంచింది. జాబ్‌కు రిజైన్ చేసి ఇస్లాం అంశాల తెలుగు అనువాదకుడిగా ఉన్నాను. ఇదే నాకు పోషణ అయ్యింది. నేను ఉర్దూ మీడియంలో కాకుండా తెలుగు మీడియంలో చదువుకోవడానికి ఇదే కారణం అయ్యుంటుందని ఆ తర్వాత నాకు అనిపించింది. ఆ తర్వాత గీటురాయి పత్రికను ఆరంభించాను. ఇదంతా దైవికంగా జరిగినదే.
దైవాన్ని తెలుసుకోవాలంటే మతం తప్పనిసరా?
మనిషి సమాజంతో ఎలా నడుచుకోవాలో చెప్పేదే మతం. ప్రపంచంలో ఎలా జీవించాలో, కుటుంబంతో ఎలా ఉండాలో, భాగస్వామితో, పిల్లలతో ఎలా మెలగాలో ఇవన్నీ మతం చెప్పాలి. అలాగే రాజకీయ, ఆర్థిక వ్యవస్థల పనితీరు గురించి కూడా తెలియజెప్పాలి. ఇవేవీ చెప్పని మతం మూఢమైనదని, మత్తుమందు వంటిదని మార్క్స్ వంటి వారు అన్నారు. ఇది నిజం. ఇవేమీ తన ప్రవక్తల ద్వారా సంకేతాల ద్వారా సందేశం ఇవ్వని దైవం ఇక మనకేం ఇస్తాడు. ఇస్లాంలో చూసినట్లయితే మనిషి సమాజంతో ఎలా నడుచుకోవాలో చెప్పేవన్నీ ఖురాన్లో ఉన్నాయి. ఖురాన్లో ఉన్న ప్రకారం మనిషి నడుచుకుంటే చాలు దైవం దృష్టిలో గొప్ప గుణశీలుడే. మనిషికి నిత్య జీవితంలో ఏమేం అవసరమో అవన్నీ చెప్పే దైవాన్ని నేను కొలుస్తాను. అలాంటి దైవం పట్ల ఆరాధన భావం లేకుండా చేసే పూజ పనికిరాదు. అలాంటి బోధనలు ఇవ్వని దైవమూ పనికిరాదు.
దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు?
ఈ భూమ్మీద ఇంత జంతుజాలం ఉంది. అది ప్రకృతికి ఏదో విధంగా ఉపయోగపడుతుంది. మనిషి మాత్రం అలా ఉపయోగపడడు. మరి మనిషి దేనికి ఉపయోగపడతాడు? దైవాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాడు. అందుకే సృష్టించబడ్డాడు. ఈ సృష్టిలో మానవుని సృజన దైవం కోసమే! దైవంలో ఏమున్నాయో అవన్నీ మనిషిలో ఉన్నాయి. ఇక్కడ మినియేచర్ గాడ్ మనిషి. అందుకే అతను కోరుకున్నవి తప్పక అవుతాయి. అయితే దైవంలో ఉన్న శక్తి అనంతం. మనిషిలో అవి పరిమితం. మనిషి తన శక్తులను సద్వియోగం చేస్తున్నాడా? దుర్వినియోగం చేస్తున్నాడా అనేది తెలుసుకోవడానికే మతం.
దైవం గురించి తెలుసుకోవడానికి సమయం, సందర్భం రావాలంటారా?
దైవం తన గురించి తెలుసుకోవడానికి మనకు ఎన్నో అవకాశాలు ఇస్తుంటాడు. వాటిని మనం అందిపుచ్చుకోవాలి. ఇందుకు నా జీవితంలో జరిగిన ఒక సంఘటన చెబుతాను. మద్రాస్‌లో ఉద్యోగం చేసుకుంటున్న రోజులు. అప్పుడు నా వయసు 21. ఓ రోజు మా నాన్న ఉత్తరం రాశాడు... నువ్వేం చేయకపోయినా ఫజర్ నమాజ్ (సూర్యోదయానికి ముందు చేసే నమాజ్) మాత్రం తప్పక చేయమని అందులో ఉంది. మా నాన్న చెప్పినట్టు చేయాలని సంకల్పించుకున్నాను. అప్పుడు లాడ్జ్‌లో ఉండేవాడిని. లాడ్జి మేనేజర్ని కలిసి, ఉదయాన్నే నమాజ్‌కి వెళ్లాలి, గేటు తీస్తారా.. అని అడిగాను. వాళ్లు కుదరదన్నారు. అప్పుడు నా నెల జీతం 110 రూపాయలు. లాడ్జ్‌కి 10 రూపాయలు చెల్లిస్తున్నాను. 20 రూపాయలు అయినా సరే, అలాంటి రూమ్ కావాలని వెతికాను. కానీ, ఎక్కడా దొరకలేదు. ఎవరో దారిలో కలిసి ఆఫీసుకు దగ్గరలోనే మసీదు ఉంది అక్కడ రూమ్‌లు ఉన్నాయి అన్నారు. అక్కడకెళ్లి ఎవర్ని సంప్రదించాలో తెలియక నమాజు చేసుకోవడానికి కాళ్లూ చేతులు కడుక్కుం టున్నాను.
ఇమామ్ పిలిచి ‘వేళకాని వేళలో నమాజ్ చేసుకోవడానికి వచ్చావేంటి?’ అని అడిగాడు. చెప్పాను. ‘‘మా నాన్న నమాజ్ చేయమన్నాడు అందుకు రూమ్ కోసం వెతుకుతున్నాను’’ అన్నాను. అప్పుడు అతను అన్నాడు.. నాన్న చెప్పాడనో.. అన్న చేయమన్నాడనో ... ఇంకెవరో ఆర్డర్ వేశారనో కాదు.. నీకు దైవాన్ని తలవాలనిపిస్తేనే చెయ్యి అన్నాడు. రూమ్ ఇప్పిస్తే చేసుకుంటాను అన్నాను. రూమ్ ఇచ్చాడు. నాకు చాలా నిశ్చింత అనిపించింది. అయితే, తెల్లవారు ఝామున జరిగే ఫజర్ నమాజ్‌కి ఎవరూ నన్ను నిద్ర లేపలేదు. వరుసగా నాలుగురోజులు చూశాను. నాకు దుఃఖం వస్తోంది. ఇమామ్‌ను కలిసి కంప్లైంట్ చేశాను, ఎవరూ నన్ను నిద్రలేపడం లేదని. నీకు నమాజ్ చేయాలనిపిస్తే నువ్వే లేస్తావు ఎవరో వచ్చి ఎందుకు లేపుతారు అన్నాడు. ఆ రోజు నమాజ్‌లో నాకు విపరీతమైన ఏడుపు వచ్చింది. ఏడుస్తూనే ప్రార్థన చేశాను. ‘అల్లా నేను సిన్సియర్‌గా ప్రార్థన చేయాలనుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు’ అని కోరుకున్నాను. ఆశ్చర్యం... ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎవరూ నన్ను నిద్ర లేపలేదు. కానీ, ఫజర్ నమాజ్ టైమ్కన్నా ముందే మెలకువ వచ్చేస్తుంది. స్వామిని కోరితే ఇవ్వలేనిదేముంది?
మనం కోరుకున్నవన్నీ ఇలా విని, అలా ఇచ్చేస్తాడా దేవుడు?
ఖురాన్లో ఒక చోట– ‘ప్రవక్తా.. మానవులు అడిగినప్పుడు ఇలా చెప్పు. నా దాసుల హృదయం కన్నా అత్యంత చేరువలో నేను ఉన్నాను అని చెప్పు. వారు నన్ను ఆర్తిగా పిలిచినప్పుడల్లా నేను వారికి బదులిస్తాను అని చెప్పు’ అని ఉంది. ఆయన ఉన్నాడు కాబట్టే మనం ఈ భూమ్మీద మనగలుగుతున్నాం. మనకు మేలైనది ఏదో అది కోరుకుంటే దానిని ఆయనే పూర్తి చేస్తాడు. ఎదుటివాడికి చెడు చేయాలనే తలంపు ఉంటే మాత్రం దానికి ఆయన అనుగ్రహం ఉండదు. నా విషయమే ఒకటి చెబుతాను. ఇరవై ఏళ్ల క్రితం గుండెకు మూడు స్టంట్లు వేశారు. అప్పటికి నేను మొదలెట్టిన ఖురాన్ అనువాదం పూర్తి కాలేదు. అందుకని ఆ సమయంలో ఆసుపత్రి నుంచే అల్లాను ప్రార్థించాను. ‘అల్లా... దివ్య ఖురాన్ తెలుగు అనువాదం, వ్యాఖ్యానం పూర్తిచేసే బాధ్యతలు ఉన్నాయి. వీటిని పూర్తి చేసే శక్తి, వ్యవధి ఇవ్వు’ అని కోరుకున్నాను. ఆ దైవం నాకు ఆ సమయం ఇచ్చాడు. ఇప్పుడు అనువాదం ప్రింటింగ్ దశలో ఉంది. నా జీవితాన్ని పొడిగించే శక్తిని ఆ అల్లానే ఇచ్చాడు.
దైవం నుంచి సరే... మరి ప్రజలు పాలకుల నుంచి ఏం కోరుకోవాలి?
ప్రజలు ఫలానా వారు మాకు నాయకుడు కావాలని బలంగా కోరుకోవాలి. ఎవరైతే ప్రజలకు సేవ చేస్తాడో అతనే నాయకుడవుతాడు. అంతేకానీ పెత్తనం చెలాయించేవాడు నాయకుడు కాదు. ‘సాటి మనిషి కష్టాన్ని అంత త్వరగా గుర్తించి, చేయూతనివ్వు. అప్పుడే నువ్వు మనిషిగా ఎదుగుతావు’ అంటారు ప్రవక్త. పాలకుడు అలా ఉండాలి. కులం, మతం, ప్రాంతం, భాష, రంగులు.. వీటితో దైవానికి సంబంధం లేదు. అలాగే పాలకుడికీ సంబంధం ఉండకూడదు. దైవం దృష్టిలో ఏ మనిషి ధర్మబద్ధంగా నడుచుకుంటాడో. అతనే గొప్ప గుణశీలుడు.
ఆత్మను ఎలా శుద్ధి చేసుకోవాలి?
మనం చాలా బలహీనులం. ఎన్నో బలహీనతలు ఉంటాయి. అందుకే, ఎన్నో తప్పులు చేస్తాం. నేనూ చేశాను. వాటివల్ల వచ్చే కష్టాలు ఏవైనా అవి శిక్షగా కాదు. పరీక్షగా వస్తాయి. శిక్షలు ఏమైనా పరలోకంలో ఉంటాయి. మనం చేయాల్సింది తప్పు చేశానని దైవం ముందు ఒప్పుకోగలగాలి. ‘దైవమా నేను చాలా బలహీనుడిని, అనుగ్రహించు’ అని కోరుకోవాలి. నేను బాధతో ఎప్పుడు ఏడ్చినా దైవం సమక్షంలోనే ఏడ్చాను. ఎవరి ముందూ కన్నీరు పెట్టుకోలేదు. పశ్చాత్తాపంతో రాల్చే ఒక్క కన్నీటి బిందువు మన ఆత్మను పరిశుద్ధం చేస్తుంది. అలా రాల్చే కన్నీటిబొట్టు నేల రాలకముందే దైవకటాక్షం లభిస్తుంది. ఆత్మపరిశుద్ధత బయట ఎక్కడో వెతకనక్కర్లేదు. మనలోనే ఉంది. ఎవరికి వారే తమ ఆత్మను పరిశుద్ధ పరుచుకోవాలే తప్ప మరొకరి వల్ల కాదు.
దైవం స్త్రీయా, పురుషుడా?
దైవానికి రూపం లేదు. లింగం లేదు. దైవం మహాశక్తి. అయితే, ప్రాచీన కాలం నుంచి ఏ సామ్రాజ్యంలో చూసినా, ఏ భాషలో అయినా దేవుడు పుంలింగంగానే పరిగణించబడుతున్నాడు. మానవ స్త్రీ, పురుషుల్లో లైంగిక పరమైన విభేదాలు ఉన్నాయి. మానసిక, శారీరక రూపాల్లో విభేదాలు ఉన్నాయి. అయితే, దైవం దృష్టిలో ఇద్దరూ సమానమే! ఖురాన్లో పురుషునికి ఉన్నట్టే స్త్రీకీ సమాన హక్కులు ఉన్నాయి. బాధ్యతలు మాత్రమే వేరు. ఆర్థికరంగంలో బాధ్యత పురుషుడిది. కుటుంబపోషణకు ఖర్చుపెట్టే బాధ్యత స్త్రీది. అయితే, ప్రాక్టికల్‌గా వచ్చేసరికి కొన్ని తారతమ్యాలు వచ్చేశాయి. వాటిని సరిదిద్దుకోవాలి.
సమాజ శ్రేయస్సు కోసం దైవాన్ని ఏమని కోరుకోవాలి?
మన కోసం మనం ఎంత చేసుకున్నా కలగని తృప్తి ఎదుటివాడికి సాయపడటంలో కలుగుతుంది. జమాతే ఇస్లామ్ అనే స్వచ్ఛంద సంస్థతో కలిసి సమాజసేవలో పాల్గొంటున్నాను. ఈ సంస్థ మెటర్నిటీ ఆసుపత్రిని నిర్వహిస్తుంది. దాదాపు 50 శాతం మంది ముస్లిం స్త్రీలు ఈ ఆసుపత్రిలో పురుడు పోసుకుంటారు. సేవలో స్వార్థచింతన కూడదు. మేము అనే భావన పోయి, మనం అనే భావన రావాలి. హిందూ, ముస్లిం వైరుధ్యాలు పోవాలంటేæ ఉభయవర్గాలు కష్టపడాలి. త్యాగం చేయాలి. ఓర్పు, సంయమనం పాటించాలి. ప్రార్థనలు చేయాలి. అప్పుడే సమాజంలో మంచి పెరుగుతుంది. ఏది కోరినా ఇచ్చే అల్లా మంచితనాన్ని కోరితే ఇవ్వడా?! ఈ లోకంలో మంచిని నింపు అని వేడుకోవడంతో పాటు మనమూ సాటివారితో మంచిగా ఉండాలి. తారతమ్యాలు లేని ప్రపంచాన్ని చేరువచేయమని కోరుకోవాలి. అప్పుడు దైవం తప్పక కరుణిస్తాడు. మంచిలోనే మనల్ని ఉంచుతాడు. ఎందుకంటే మంచికి ఎప్పుడూ ఆశీర్వచనం ఉంటుంది.
సంతృప్తిగా జీవించాలంటే దైవాన్ని ఏమని కోరుకోవాలి?
దైవంతో మమేకమైతే సంతోషం కలుగుతుంది. ఆ సంతోషానికి మాటలు ఉండవు. దైవాన్ని కోరుకున్నవన్నీ జరుగుతాయని లేదు. కానీ, చిన్న ఆశ, నమ్మకం ఉంటాయి. అది జరిగిందనుకోండి. ఎంతో సంతోషం. అలాంటి ప్రత్యక్ష సాయం అందుతుండగా నేను నా కళ్లారా చూశాను. వాటి గురించి నా పుస్తకాల్లో రాశాను. ఆ సంతోషమే తృప్తి. ఆ సమయంలో దైవం గుర్తుండాలి. ఆ సమయంలో కృతజ్ఞతాభావం ఏదైతే ఉందో అదే దైవానికి మనం ఇచ్చే కానుక.
నిర్మలారెడ్డి చిల్కమర్రి