Smart City Construction
-
సానుకూలతను బట్టి పెట్టుబడులు పెట్టాలి
బ్రిటిష్ హైకమిషనర్‌తో భేటీలో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల కోసం దేశాన్ని ఓ యూనిట్‌గా చూడకుండా... ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, సౌకర్యాలు, విధానాలను పరిగణనలోకి తీసుకోవాలని బ్రిటీష్ హైకమిషనర్ (ఇండియా) డొమినిక్ యాష్క్విత్కు మంత్రి కె.తారక రామారావు సూచించారు. వ్యాపారాన్ని సరళం చేయడం (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్)లో ప్రస్తుతం తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. ఐటీ, ఫార్మా, లైఫ్ సెన్సైస్, ఏరోస్పేస్ వంటి వాటిని ప్రాధాన్య రంగాలుగా ఎంచుకున్నామని చెప్పారు. బుధవారం హైదరాబాద్‌లో డొమినిక్ యాష్‌క్విత్ బృందంతో కేటీఆర్ సమావేశమయ్యారు. తెలంగాణలో పారిశ్రామిక, పెట్టుబడి అవకాశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేం దుకు సిద్ధంగా ఉన్నామని.. రాష్ట్రంలో స్మార్ట్‌సిటీల నిర్మాణంలో సహకరిస్తామని ఈ సందర్భంగా బ్రిటీష్ హైకమిషనర్ పేర్కొన్నారు. టీఎస్ఐపాస్ విధానాన్ని అభినందించారు. టీ-హబ్ ద్వారా పరిశోధనలకు ఊతం లభిస్తుందని చెప్పారు. బ్రిటన్‌లోని స్టార్టప్ ఈకో సిస్టంతో భాగస్వామ్యానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ఐటీ, పారిశ్రామిక కార్యక్రమాలు, రూపొందించిన పాలసీలను కేటీఆర్ వివరించారు. ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడుల కోసం ప్రత్యేక విధానాన్ని రూపొందించనున్నామని.. పెట్టుబడి పెట్టే కంపెనీలకు సహకరిస్తున్నామని తెలిపారు. బోయింగ్, టాటా కంపెనీల భాగస్వామ్యంలో హైదరాబాద్‌లో కంపెనీ ఏర్పాటు చేసేందుకు స్వయంగా తాను కృషి చేసినట్లు వివరించారు. ఐటీలో టాప్: ఐటీ రంగంలో పెట్టుబడులకు తెలంగాణ గమ్యస్థానంగా మారిందని కేటీఆర్ పేర్కొన్నారు. ప్రపంచంలోని టాప్-4 కంపెనీలు తమ అతిపెద్ద క్యాంపస్‌లను ఇక్కడ నిర్మిస్తున్నాయన్నారు. త్వరలో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. క్లీన్టెక్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయని బ్రిటిష్ హైకమిషనర్ మంత్రి కేటీఆర్‌కు తెలిపారు. పెట్టుబడులకు అవకాశాలు పెంచేందుకు ఇండో-బ్రిటిష్ బిజి నెస్ కౌన్సిల్‌ను క్రియాశీలం చేస్తామన్నారు. ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్’పై త్వరలో నిర్వహించే ఇండో-బ్రిటిష్ వర్క్‌షాప్‌కు హాజ రవాలని కేటీఆర్‌ను ఆహ్వానించారు. బ్రిట న్లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న స్టేట్ డెస్క్ ఆలోచనను అభినందించారు. దాంతో ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలు పెరుగుతాయన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి అరవింద్ కుమార్ పాల్గొన్నారు. -
‘స్మార్ట్’ సేవలకు యూజర్ చార్జీలు!
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సిటీల నిర్మాణం సాధ్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. స్మార్ట్ సిటీల్లో పౌర సేవలకు కనీస యూజర్ చార్జీలు ఉండాల్సిందేనని, సేవలను ఉచితంగా అందిస్తే విలువతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉండదని అభిప్రాయపడ్డారు. దక్షిణ, మధ్య భారత్ నుంచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపికైన 40 నగరాలకు చెందిన మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, మునిసిపల్ కమిషనర్లతో సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో స్మార్ట్ట్ సిటీలపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఇందులో కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం కష్టమే కాని, అసాధ్యం కాదన్నారు. ఈ విషయంలో మేయర్లు, మునిసిపల్ కమిషనర్ల పాత్ర కీలకమన్నారు. నగరాల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను పన్నులు, ఇతర మార్గాల్లో స్థానికంగానే సమీకరించుకోవాలని సూచించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందే విధంగా మున్సిపాలిటీలు తమ రుణ చెల్లింపుల రికార్డును మెరుగుపరుచుకోవాలన్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం ద్వారా సులువైన పద్ధతుల్లో పౌర సేవలను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ యజ్ఞంలో నగరాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాలకు వచ్చే కేంద్రం పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్లలో పట్టణ స్థానిక సంస్థలకు రూ.23,111 కోట్లు మాత్రమే కేటాయించారని, రానున్న ఐదేళ్లలో రూ.87,143 కోట్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. స్మార్ట్ సిటీల్లో 10 శాతం సౌర విద్యుత్ వినియోగం వుండాలని, భవనాలపై సౌర విద్యుత్ పలకల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. సదస్సులో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, తెలంగాణ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి. గోపాల్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సమీర్ శర్మ, ఆసియా అభివృద్ధి బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీగా బార్సిలోనా అభివృద్ధి పరిణామక్రమాన్ని వివరిస్తూ సమీర్ శర్మ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.