‘స్మార్ట్’ సేవలకు యూజర్ చార్జీలు! | Centre to Help Cities Which Perform: Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

‘స్మార్ట్’ సేవలకు యూజర్ చార్జీలు!

Published Tue, Sep 8 2015 1:29 AM | Last Updated on Sun, Sep 3 2017 8:56 AM

‘స్మార్ట్’ సేవలకు యూజర్ చార్జీలు!

‘స్మార్ట్’ సేవలకు యూజర్ చార్జీలు!

సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సిటీల నిర్మాణం సాధ్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. స్మార్ట్ సిటీల్లో పౌర సేవలకు కనీస యూజర్ చార్జీలు ఉండాల్సిందేనని, సేవలను ఉచితంగా అందిస్తే విలువతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉండదని అభిప్రాయపడ్డారు. దక్షిణ, మధ్య భారత్ నుంచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపికైన 40 నగరాలకు చెందిన  మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, మునిసిపల్ కమిషనర్లతో సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో స్మార్ట్ట్ సిటీలపై ప్రాంతీయ సదస్సు జరిగింది.

ఇందులో కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం కష్టమే కాని, అసాధ్యం కాదన్నారు. ఈ విషయంలో మేయర్లు, మునిసిపల్ కమిషనర్ల పాత్ర కీలకమన్నారు. నగరాల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను పన్నులు, ఇతర మార్గాల్లో స్థానికంగానే సమీకరించుకోవాలని సూచించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందే విధంగా మున్సిపాలిటీలు తమ రుణ చెల్లింపుల రికార్డును మెరుగుపరుచుకోవాలన్నారు.

సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం ద్వారా సులువైన పద్ధతుల్లో పౌర సేవలను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ యజ్ఞంలో నగరాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాలకు వచ్చే కేంద్రం పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్లలో పట్టణ స్థానిక సంస్థలకు రూ.23,111 కోట్లు మాత్రమే కేటాయించారని, రానున్న ఐదేళ్లలో రూ.87,143 కోట్లను మంజూరు చేస్తామని వెల్లడించారు.

స్మార్ట్ సిటీల్లో 10 శాతం సౌర విద్యుత్ వినియోగం వుండాలని, భవనాలపై సౌర విద్యుత్ పలకల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. సదస్సులో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, తెలంగాణ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి. గోపాల్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సమీర్ శర్మ, ఆసియా అభివృద్ధి బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీగా బార్సిలోనా అభివృద్ధి పరిణామక్రమాన్ని వివరిస్తూ సమీర్ శర్మ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement