Smart City project
-
తిరుపతిలో సౌరకాంతులు
స్మార్ట్‌సిటీగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి సౌర విద్యుత్ ఉత్పత్తిలోనూ దూసుకుపోతోంది. ఆధునికతను అందిపుచ్చుకుని సరికొత్త పద్ధతుల్లో ప్రాజెక్ట్‌లను చేపట్టి దేశంలోనే తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేకతను చాటుకుంటోంది. రాష్ట్రంలో మరెక్కడాలేని విధంగా 4 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్‌ను నిర్మించింది. ఈ ప్లాంట్ దేశంలోనే రెండో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌గా నిలిచింది. – తిరుపతి తుడా ఇటీవల స్మార్ట్‌సిటీ పోటీల్లో తిరుపతి అర్బన్ ఎన్విరాన్మెంట్ విభాగంలో ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్ 3వ ర్యాంక్‌ను సాధించింది. అలానే మరో 6.746 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కాలుష్య నియంత్రణకు కట్టుబడి నెలవారీ విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గించుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్లను వివిధ రూపాల్లో నిర్మించారు. గత 6 నెలల నుంచి 4.74 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందుబాటులోకి రాగా.. గతనెల నుంచి మరో 6 మెగావాట్ల సోలార్ విద్యుత్ వినియోగంలోకి వచ్చింది. దీనిద్వారా నగరపాలక సంస్థ విద్యుత్ వాడక ఖర్చులు భారీగా తగ్గాయి. నెలకు రూ.2.8 కోట్ల విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఇందులో రూ.1.75 కోట్ల మేర సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ప్రతినెల ఆ మేరకు ఆదా అవుతుండటంతో మరిన్ని సోలార్ ప్లాంట్లు నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రూ.18 కోట్లతో కైలాసగిరి రిజర్వాయర్‌లో.. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.18 కోట్లు వెచ్చించి శ్రీకాళహస్తి సమీపంలోని కైలాసగిరి రిజర్వాయర్‌లో 4 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు. నీటిపై నిర్మించిన ఈ సోలార్ ప్లాంట్ దేశంలో రెండో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా రికార్డుల్లో నిలిచింది. తూకివాకం గ్రీన్‌సిటీలో రూ.24 కోట్లతో 6 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్‌ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయం, పాఠశాలలపై రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్యానళ్ల ద్వారా 0.746 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లు సత్ఫలితాలు ఇవ్వడంతో మరిన్ని సోలార్ ప్రాజెక్ట్‌లను నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీష తెలిపారు. సోలార్ ఉత్పత్తిలో ఇప్పటికే తిరుపతి మేటిగా నిలిచిందని చెప్పారు. -
స్మార్ట్ నగరంగా రూపుదిద్దుకోనున్న నెల్లూరు
నెల్లూరు స్మార్ట్ నగరంగా రూపుదిద్దుకోనుంది. నగరానికే ఐకాన్‌గా ఉండే విధంగా ప్రధాన మార్గాల్లో ఫ్లై ఓవర్ వంతెనలు, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పార్క్‌ల నిర్మాణాలతో సుందర నగరంగా తీర్చిదిద్దనున్నారు. వివిధ శాఖల నుంచి రూ.100 కోట్లతో నగరాన్ని నవీకరించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి నేతలు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ పైప్లైన్ల నిర్మాణం పేరుతో నగరాన్ని ధ్వంసం చేశారు. ఎన్నికలకు ముందు హడావుడిగా నిధులు దిగమింగేసి పనులు పూర్తికాకుండానే అరకొరగా సీసీ రోడ్లు వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికీ నగర ప్రజలు అస్తవ్యస్తమైన రహదారులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నెల్లూరు నగరాన్ని స్మార్ట్‌గా తయారు చేసేందుకు పాలకులు శ్రీకారం చుట్టారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరపాలక సంస్థ ఖజానాను పూర్తిగా ఖాళీ చేసింది. ఈ పరిస్థితుల్లో నగరంలో అవసరాలు, ప్రాధాన్యతాంశాలపై అధికారులు, పాలకులు సమీక్షలు నిర్వహించి ప్రధాన పనులు నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా జనరల్ ఫండ్ నిధులతో పాటు వివిధ ప్రత్యేక నిధులు మొత్తం కలిపి రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అది కూడా ప్రతి పనికి టెండర్ పిలిచి పూర్తి పారదర్శకంగా కేటాయించనున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ హడావుడిగా పనులు నిర్వహించడానికి వీలుగా నిబంధనలు పట్టించుకోకుండా అన్ని అనుమతులు మంజూరు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే క్రమంలో నారాయణ హడావుడిగా వివిధ ప్రత్యేక నిధులను నగరపాలక సంస్థకు మళ్లించారు. నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూరేలా పనులు కట్టబెట్టారు. పర్యావసానంగా అసలే ఇబ్బందుల్లో నగరపాలక సంస్థ ఖజానా పూర్తిగా ఖాళీ కావడంతో పాటు గతంలో పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేక చేతులెత్తేశారు. కానీ నగరంలో అభివృద్ధి పనులు మాత్రం శిలాఫలకాలపై కనిపిస్తున్నాయి. 80 శాతానికే ఆగిపోయిన పనులు కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ పైప్‌లైన్ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయాయి. అయితే పూర్తి చేసిన 80 శాతం పనులు పూర్తిగా నాసిరకంగా నాణ్యత ప్రమాణాలకు దూరంగా ఉన్నాయి. పైప్‌లైన్ నిర్మించి వెంటనే దానిపై వేసిన సిమెంట్ రోడ్డు ఆరు నెలలకే స్వరూపం పూర్తి కోల్పోయి దారుణంగా తయారైంది. విజిలెన్స్ నివేదికలు రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహలో జరిగిన పనులపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దృష్టి సారించారు. దీనిపై ప్రస్తుత విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ క్రమంలో అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పటి వరకు నగరంలో ఏం పనులు జరిగాయి, ప్రజల అవసరాలను ఎంత మేరకు తీర్చగలుగుతున్నాయి, వాటి నాణ్యత ప్రమాణాలు ఏ మేరకు ఉన్నాయని పరిశీలించి నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులు అవసరమైన పనులు నివేదిక సిద్ధం చేశారు. నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ మంత్రి కావడంతో సొంత నియోజకవర్గ అవసరాల పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైన అభివృద్ధి పనులకు అన్ని నివేదికలు సిద్ధం చేయించారు. ఇటీవలే మంత్రి అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సమన్వయంతో తక్కువ ఖర్చుతో రొట్టెల పండగ ఉత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించారు. 14వ ఆర్థిక సంస్థ నిధులతో నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం సుమారు రూ.100 కోట్లతో పనులు నిర్వహించనున్నారు. నగరంలో కాలువలు, కల్వర్టులు, సీసీ రోడ్లు, రోడ్డు మరమ్మతులు చేపట్టనున్నారు. ఇప్పటికే రూ.25 కోట్లతో పలు ప్రాంతాల్లో కాలువలు, రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. రోడ్లు, కాలువలు, కల్వర్టులు, పార్కులు, సీసీ రోడ్లు, గుంతల రోడ్లుకు మరమ్మతులు ఇతర పనులు చేయనున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 కోట్లు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు రూ.10 కోట్లు, స్మార్ట్ సిటీ నిధులు రూ.10 కోట్లు, నుడా నిధులు రూ.15 కోట్లతో పార్కుల నిర్మాణం, జనరల్ ఫండ్ నిధులు రూ.6 కోట్లు, మొత్తం రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నారు. పారదర్శకంగా టెండర్లు నిర్వహణ టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రూ.50 లక్షలు పనులను సైతం రూ.4.90 లక్షలు లెక్కన విభజించి టీడీపీ నేతలు పంచుకున్నారు. ఇలా నగర పాలక సంస్థ నిధులు టీడీపీ నేతలు స్వాహా చేశారు. అయితే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేషన్లో ప్రతి పనిని పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. రూ.లక్ష పనికి సైతం టెండర్లు పిలవడం ద్వారా పాలకవర్గం, అధికారుల పనితీరుకు నిదర్శనంగా ఉంది. టెండర్ నిర్వహణలో అధికారులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛను పాలకవర్గం ఇచ్చారు. దీంతో అధికారులు నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించి తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్ దక్కించుకునేలా చర్యలు తీసుకున్నారు. -
స్మార్ట్ సిటీ ఏదీ బాబు ?
సాక్షి, శ్రీకాకుళం : ‘రాజాం పట్టణాన్ని స్మార్ట్‌సిటీగా మారుస్తాం. పట్టణంలో నివాసముంటున్న ఇల్లులేని పేదవాడి సొంతింటి కలను నిజం చేస్తాం. ఏడాది లోగా ప్రతి ఒక్క అర్హుడికి ఇల్లు ఇస్తాం. ఈ స్మార్ట్ సిటీ ఎలా ఉంటుందంటే ఈ భవనాలపై హెలికాప్టర్ కూడా అవలీలగా దిగుతుంది.’ 2017 జనవరి–6వ తేదీన రాజాంలోని జన్మభూమి మా ఊరులో సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఇది. ఇలా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన స్మార్ట్ సిటీ హామీ లబ్ధిదారులను ఊహాలోకంలో విహరించేలా చేసింది. రాజాం పట్టణంలో సొంతింటి కోసం దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు ఇప్పటికీ ఇల్లు నిర్మించి అధికారులు ఇవ్వలేదు. రాజాం పట్టణ కేంద్రంలో ఇల్లు వస్తుందనుకుంటే పట్టణానికి 8 కిలోమీటర్ల దూరంలో నిర్మాణాలు ప్రారంభించారు. అక్కడ ఫ్లాట్ల నిర్మాణం కూడా నత్తనడకన సాగుతుండడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 నెలల క్రితం స్మార్ట్ సిటీలో ఫ్లాట్ల నిమిత్తం డీడీలు తీసి లబ్ధిదారులు దరఖాస్తు పెట్టుకున్నారు. వీటికి సంబంధించి లబ్ధిదారులకు తొలివిడత ఫ్లాట్స్ కేటాయింపు మూడునెలల క్రితం చేపట్టారు. మొత్తం 893 మంది లబ్ధిదారులు తొలివిడతలో డీడీలు తీయగా, వారిలో 90 మందికి లాటరీ ద్వారా ఫ్లాట్లు కేటాయించారు. అయితే వారికి ఇంతవరకూ ఫ్లాట్లు అప్పగించలేదు. మొత్తం 1104 ఫ్లాట్లు నిర్మించాల్సి ఉంది. ఇంతవరకూ ఒక్కటి కూడా పూర్తికాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నత్తనడకన నిర్మాణాలు ఈ ఫ్లాట్ల నిమిత్తం సింగిల్ బెడ్ రూమ్‌కు ముందుగా రూ.500, డబుల్ బెడ్రూంతో పాటు పెద్ద సైజు సింగిల్ బెడ్ రూం నిమిత్తం ముందస్తుగా లబ్ధిదారుడు రూ.50 వేలు నుంచి రూ.ఒక లక్ష డీడీలు తీసి నగరపంచాయతీకి చెల్లించారు. వీరికి ప్రభుత్వం నుంచి రూ.3 లక్షలు రాయితీ వస్తుండగా, మరో రూ.3 లక్షలు బ్యాంకు లోన్ కూడా మంజూరు చేశారు. ఈమొత్తం నిధులను టెండర్ల రూపంలో ఫ్లాట్ల నిర్మాణానికి టెండర్ పిలవగా విశాఖపట్నానికి చెందిన ఓ సంస్థ ఆ టెండర్‌ను దక్కించుకుంది. పనులు మాత్రం సకాలంలో పూర్తీచేయకపోవడంతో పలువురు లబ్ధిదారులు విమర్శలు గుప్పిస్తున్నారు. సీఎం ఇచ్చిన హామీనే ఇలా ఉంటే సాధారణ నాయకులు ఇచ్చే హామీ పరిస్థితి ఏమిటని? నమ్మించి మోసం చేసిన ప్రభుత్వానికి ఇప్పుడెలా ఓటు వేయాలని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. -
స్మార్ట్ సిటీ పనులు వేగవంతం చేయండి
తిరుపతి మంగళం : తిరుపతి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ పిఎస్.ప్రద్యుమ్న ఆదేశించా రు. తిరుపతి సబ్‌కలెక్టర్ కార్యాలయంలో బుధవారం కార్పొరేషన్ కమిషనర్ హరికిరణ్, అధికారులతో ఆయన సమీక్షించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కొన్ని వీధులలో పనులను పూర్తి అధికారులకు సూచిం చారు. ఒకినోవా బ్యాటరీ ఆపరేటెడ్ చెత్త సేకరణ వాహనాలు 30 రోజుల్లో నగరానికి చేరుకోవాలని, ఏఇకమ్–డెలాయిట్ ప్రాజె క్ట్ అధికారులకు సూచించారు. వినాయకసాగర్, పార్కుల అభివృద్ధి, అండర్ గ్రౌండ్ ఎలక్ట్రికల్ లైన్ల పనులకు వెంటనే పూనుకోవాలన్నారు. అమృత్ పథకం కింద తిరుపతిలో రూ.252 కోట్లకు సంబంధించిన టెండర్ ప్రక్రియ పూర్తి చేసి పనులను ప్రారంభించాలన్నారు. తాగునీటి సరఫరా, పార్కింగ్, ట్రాన్స్పోర్ట్ హబ్ వంటి అత్యవసరాన్ని గుర్తించి పనులను ప్రారంభించాలన్నారు. జేసీ గిరీషా, తిరుపతి సబ్ కలెక్టర్ నిషాంత్‌కుమార్, ప్రాజెక్టు అధికారులు పాల్గొన్నారు. అందరికీ న్యాయం చేస్తాం శెట్టిపల్లి భూములలో ఇళ్ల స్థలాలు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్న ప్రతిఒక్కరికీ న్యాయం చేస్తామని జేసీ గిరీ షా హామీ ఇచ్చారు. తన కార్యాలయంలో బుధవారం శెట్టిపల్లి భూముల కొనుగోలు దారులతో ఆయన సమావేశమయ్యారు. శెట్టిపల్లి లెక్క దాఖలాల్లో పేదలు కొనుగోలు చేసిన 140 ఎకరాలలో 12 నుంచి 18వ తేదీ వరకు సర్వే చేస్తామన్నారు. -
ఇదీ.. స్మార్ట్ సిటీ
ఐటీ రాజధానిగా కీర్తి సంపాదించినా, అవే గుంతల రోడ్లు, డ్రైనేజీలు. ట్రాఫిక్ పద్మవ్యూహం, పార్కింగ్ సమస్య. ఇంకా చెప్పుకుంటూపోతే పెద్ద జాబితానే అవుతుంది. ఈ తలరాతను స్మార్ట్ సిటీ పథకమైనా తీరుస్తుందని నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు. కాగితాల మీద అనుకున్నట్లుగా ఆచరణలోనూ సాగితే సిటీ సౌందర్యమే మారిపోతుంది. సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్‌సిటీ మూడో జాబితాలో బెంగళూరుకు స్థానం దక్కడం తెలిసిందే. స్మార్ట్స్‌సిటీ రూపురేఖలు ఏ విధంగా ఉండాలన్నదానిపై నేడు (శుక్రవారం) 15 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం బెంగళూరులో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. నగర పాలికె ప్రత్యేక కమిషనర్ ఆర్. విజయ్‌శంకర్ ఈ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. స్మార్ట్ పథకంతో ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.2,219 వేల కోట్లతో బెంగళూరుకు అత్యాధునిక వసతులు లభించబోతున్నాయి. ఈ నిధుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలా రూ.500 కోట్లను, మిగిలిన మొత్తాన్ని బీబీఎంపీ, బీఎంటీసీ, బీఎంఆర్‌సీఎల్‌తో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా భరించనున్నాయి. ఏడు ఉప ప్రాజెక్టులుగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టును విభజించి ఆ మేరకు పనులను చేపడతారు. స్మార్ట్ రహదారులు, ఈ–వాహనాలు ♦ స్మార్ట్ సిటీ లో రూ.1,166 కోట్ల భారీ నిధులతో టెండర్‌షూర్ రోడ్లు, ఈ–బస్సులు, ఈ–ఆటో రిక్షాలు, స్మార్ట్ బస్‌షెల్టర్స్, స్మార్ట్ డస్ట్‌బిన్స్, పర్యావరణ సెన్సార్స్ తదితరాలను ఏర్పాటు చేశారు. సమగ్ర రవాణా వ్యవస్థ ఇందు కోసం రూ.233.13 కోట్లను ఖర్చు చేస్తారు. రస్సెల్ మార్కెట్, శివాజీనగర బస్టాండును కలిపి మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్‌గా మారుస్తారు. ఈ వాహనాలకు చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ మార్కెట్లు... మినీ కంపోస్ట్ ఎరువుల తయరీ కేంద్రాలు చారిత్రక నేపథ్యం కలిగిన కే.ఆర్ మార్కెట్, మల్లేశ్వరం మార్కెట్లను రూ.130 కోట్లతో బహుళ అంతస్తుల ఆటోమేటిక్ పార్కింగ్ సదుపాయాలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు కానున్నాయి. 24 గంటలూ పనిచేసే సీసీ కెమెరాలు, స్మార్ట్, మినీ కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రాలు అందుబాటులోకి రానున్నారు. చెరువుల వద్ద సోలార్ ట్రీ హలసూరు, స్యాంకీట్యాంక్ చెరువులకు కొత్త కళ. వీటిలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చేరే నీటిని ఎక్కడికక్కడ శుద్దిచేసి చేస్తారు. ఈ చెరువుల వద్ద బైస్కిల్‌షేర్ పాయింట్లు, సోలార్ ట్రీ ఉంటాయి. సోలార్ ట్రీ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. కబ్బన్‌పార్క్‌కు హంగులు కబ్బన్‌పార్క్‌లో పర్యాటకానికి సంబంధించిన కియోస్కులు, మ్యూజిక్ ఫౌంటెన్లు, ఈ– టాయిలెట్లు, తాగునీరు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు ఏర్పడతాయి. స్లమ్స్ టు స్మార్ట్ గాంధీనగరలోని స్వతంత్రపాళ్యలో భూగర్భ, స్మార్ట్ డ్రైనేజ్ సిస్టం అందుబాటులోకి వస్తుంది. ఇందులో సెన్సార్స్ ఉండటం వల్ల పూడిక ఏర్పాడితే వెంటనే సంబంధిత అధికారుల ఫోన్లకు సమాచారం అందుతుంది. ఇక స్మార్ట్ వీధి లైట్లు, కమ్యూనిటీ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. కే.సీ జనరల్ ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణం, అత్యాధునిక వైద్య సేవలు, టెలీ మెడిసిన్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. -
‘స్మార్ట్’ కోసం వరంగల్ ప్రణాళికలు
సవరించిన ప్రణాళికలను కేంద్రానికి సమర్పించిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీల ప్రాజెక్టుకు ఎంపిక కోసం వరంగల్ నగరానికి సంబంధించిన సవరించిన ప్రణాళికలను రాష్ట్ర ప్రభుత్వం గురువారం కేంద్ర పట్టణాభివృద్ధిశాఖకు అందజేసింది. వరంగల్ నగరానికి సంబంధించిన ప్రతిపాదనలను గతంలోనే అందజేశారు. కానీ తొలిదశ స్మార్ట్ సిటీల జాబితాలో వరంగల్‌కు చోటు దక్కలేదు. తొలిదశలో దేశవ్యాప్తంగా 97 నగరాల నుంచి ప్రతిపాదనలురాగా... 20 నగరాలను ఎంపిక చేశారు. అందులో వరంగల్ 23వ ర్యాంకు సాధించి అవకాశం కోల్పోయింది. తొలిదశలో అవకాశం రాని 23 రాష్ట్రాలకు చెందిన నగరాలకు మరో అవకాశాన్ని కల్పించాలని కేంద్రం నిర్ణయించింది. ఏప్రిల్ 21వ తేదీలోగా సవరించిన ప్రణాళికలను అందించాలని సూచించింది. ఈ మేరకు వరంగల్ ప్రణాళికలను అందజేశారు. వీటిపై మే 15కల్లా నిర్ణయం తీసుకునే అవకాశముందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ వర్గాలు తెలిపాయి. -
స్మార్ట్ సిటీలన్నిటా అమెరికా భాగస్వామ్యం!
న్యూఢిల్లీ: కేంద్రం చేపట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టులో భాగస్వామిగా ఉండేందుకు అమెరికా ఆసక్తి వ్యక్తం చేసింది. మూడు స్మార్ట్ సిటీల అభివృద్ధిలో భాగస్వామిగా ఉంటామని అమెరికా ఇప్పటికే ప్రకటించింది. ఇపుడు మొత్తం 100 స్మార్ట్సిటీలకూ విస్తరించనున్నట్లు అమెరికా వాణిజ్య ఉప మంత్రి బ్రూస్ ఆండ్రూస్ చెప్పారు.ఈ సిటీల్లో మౌలిక వసతుల అభివృద్ధికి పెట్టుబడి పెట్టడానికి, టెక్నాలజీ అందించటానికి వచ్చిన 18 అమెరికన్ కంపెనీల ప్రతినిధి బృందానికి ఆయన సారథి. విశాఖపట్నం మాస్టర్‌ప్లాన్‌కు సహకరించటంతో పాటు అలహాబాద్, అజ్మీర్‌లకు టెక్నాలజీ అందిస్తున్నట్లు యూఎస్ ట్రేడ్ డెవలప్మెంట్ ఏజెన్సీ(యూఎస్టీడీఏ) డెరైక్టర్ జాక్ చెప్పారు. -
‘స్మార్ట్’ సేవలకు యూజర్ చార్జీలు!
సాక్షి, హైదరాబాద్: ప్రజల భాగస్వామ్యంతోనే స్మార్ట్ సిటీల నిర్మాణం సాధ్యమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. స్మార్ట్ సిటీల్లో పౌర సేవలకు కనీస యూజర్ చార్జీలు ఉండాల్సిందేనని, సేవలను ఉచితంగా అందిస్తే విలువతో పాటు ప్రజల భాగస్వామ్యం ఉండదని అభిప్రాయపడ్డారు. దక్షిణ, మధ్య భారత్ నుంచి స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద ఎంపికైన 40 నగరాలకు చెందిన మేయర్లు, మునిసిపల్ చైర్మన్లు, మునిసిపల్ కమిషనర్లతో సోమవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో స్మార్ట్ట్ సిటీలపై ప్రాంతీయ సదస్సు జరిగింది. ఇందులో కేంద్ర మంత్రి వెంకయ్య మాట్లాడుతూ.. నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయడం కష్టమే కాని, అసాధ్యం కాదన్నారు. ఈ విషయంలో మేయర్లు, మునిసిపల్ కమిషనర్ల పాత్ర కీలకమన్నారు. నగరాల అభివృద్ధి కోసం కావాల్సిన నిధులను పన్నులు, ఇతర మార్గాల్లో స్థానికంగానే సమీకరించుకోవాలని సూచించారు. బ్యాంకుల నుంచి రుణాలు పొందే విధంగా మున్సిపాలిటీలు తమ రుణ చెల్లింపుల రికార్డును మెరుగుపరుచుకోవాలన్నారు. సమాచార సాంకేతిక పరిజ్ఞానం అనుసంధానం ద్వారా సులువైన పద్ధతుల్లో పౌర సేవలను అందుబాటులోకి తెస్తున్నామని పేర్కొన్నారు. స్మార్ట్ సిటీ యజ్ఞంలో నగరాలకు కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ సహాయ, సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. రాష్ట్రాలకు వచ్చే కేంద్రం పన్నుల వాటాను 32 శాతం నుంచి 42 శాతానికి పెంచామని గుర్తు చేశారు. గడిచిన ఐదేళ్లలో పట్టణ స్థానిక సంస్థలకు రూ.23,111 కోట్లు మాత్రమే కేటాయించారని, రానున్న ఐదేళ్లలో రూ.87,143 కోట్లను మంజూరు చేస్తామని వెల్లడించారు. స్మార్ట్ సిటీల్లో 10 శాతం సౌర విద్యుత్ వినియోగం వుండాలని, భవనాలపై సౌర విద్యుత్ పలకల ఏర్పాటును ప్రోత్సహించాలన్నారు. సదస్సులో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఏపీ మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ, తెలంగాణ పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి ఎం.జి. గోపాల్, కమిషనర్ జనార్దన్‌రెడ్డి, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి సమీర్ శర్మ, ఆసియా అభివృద్ధి బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, యూరోపియన్ యూనియన్ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్మార్ట్ సిటీగా బార్సిలోనా అభివృద్ధి పరిణామక్రమాన్ని వివరిస్తూ సమీర్ శర్మ పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. -
కాకినాడకు కొత్త యోగం!
- స్మార్ట్సిటీపై నగరవాసుల ఆశలు - ఎంపికైతే కార్పొరేషన్‌కు నిధుల వరద - ఏటా రూ.500 కోట్ల కేంద్ర గ్రాంటు కాకినాడ : రేవు కార్యకలాపాలు, పారిశ్రామికాభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని జిల్లా కేంద్రం కాకినాడను ‘స్మార్ట్‌సిటీ’ ప్రాజెక్టు పరిధిలోకి తేవాలన్న ప్రభుత్వ నిర్ణయం నగరవాసుల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. రానున్న రోజుల్లో గణనీయమైన అభివృద్ధిని సాధించేందుకు అవకాశం ఉన్న కాకినాడకు ఈ ప్రాజెక్టు దక్కితే నిధుల వరద పారనుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సహా ఎలాంటి పథకానికైనా నేరుగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థిక తోడ్పాటు అందే అవకాశం ఉందని, అన్నీ కలిసి వస్తే ఏటా రూ.500 కోట్ల వరకు ఐదేళ్ళపాటు నిధులు మంజూరయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని అంటున్నారు. దేశంలోని 100 నగరాలను స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కోసం ఎంపిక చేయాలని కేంద్రం నిర్ణయించింది. తొలిదశలో ఆంధ్రప్రదేశ్‌నుంచి మూడు నగరాలకు ప్రతిపాదనలను పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఆ మేరకు విశాఖ, తిరుపతితోపాటు కాకినాడ నగరాన్ని కూడా ఈ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. దాదాపు 15 అంశాలను కొలమానంగా తీసుకుని ఈ మూడు నగరాలను ఎంపిక చేసినప్పటికీ కేంద్రస్థాయిలో తుది నిర్ణయం తీసుకునేందుకు గురువారం ప్రతిపాదనలు పంపారు. ఎంపికకు ఇదీ కొలమానం.. స్మార్ట్‌సిటీ ఎంపికకు సంబంధించి సుమారు 15 అంశాలను కొలమానంగా తీసుకున్నారు. విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పన్నుల వసూలు, ఇ-గవర్నెన్స్, గ్రీవెన్స్ పరిష్కారం, ఆదాయవ్యయాలు, ఖర్చుకు తగ్గ ఆదాయం వంటి అంశాలను ఇందులో పొందుపరిచారు. ప్రధానంగా 90 శాతం పైగా పన్నుల వసూళ్ళతోపాటు క్రమం తప్పని ఆడిట్, సకాలంలో జీతాల చెల్లింపు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటారు. ఎంపికైతే ఇవీ లాభాలు.. స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు ఎంపికైతే కాకినాడకు భారీస్థాయిలో వనరులు సమకూరనున్నాయి. ప్రధానంగా ఏడాదికి రూ.500 కోట్ల వరకు కేంద్రంనుంచి నిధులు అందే అవకాశం ఉంటుందంటున్నారు. అయితే అదంతా గ్రాంటా? నగరపాలక సంస్థ భాగస్వామ్యం కూడా ఉండాలా? అనే అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఏది ఏమైనా ఈ ప్రాజెక్టుకు ఎంపికైతే కాకినాడ మరింత ప్రగతిపథంలో పయనిస్తుందంటున్నారు. అయితే కేంద్రస్థాయిలో తుది నిర్ణయం వెలువడేందుకు సమయం పడుతుందని కార్పొరేషన్వర్గాలు చెబుతున్నాయి. టాస్క్‌ఫోర్స్ కమిటీ ఏర్పాటు ప్రతిపాదనల దశల్లో ఉన్న కాకినాడ స్మార్ట్సిటీపై ప్రభుత్వం ప్రత్యేకటాస్క్‌ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేసింది. కలెక్టర్ చైర్మన్‌గా, నగర పాలక సంస్థ కమిషనర్ మెంబర్ క న్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో జిల్లా ఎస్పీ, జాతీయ రహదారుల విభాగం, ట్రాన్స్‌కో, రైల్వే, ఆర్టీసీ, రవాణా, రహదారులు, భవనాలు, వివిధశాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. వీరంతా పథకాన్ని సమర్థంగా అమలు చేసే అంశంపై సమన్వయం చేయనున్నారు. -
పట్టణాలు అభివృద్ధి చోదకాలు
ఢిల్లీలో కొత్త పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ. స్మార్ట్ సిటీ పథకం మోడల్‌ను పరిశీలిస్తున్న మోదీ, వెంకయ్య నగరం ఎలా పెరగాలో ప్రజలే నిర్ణయించాలి: ప్రధాని * పన్ను వసూళ్లలోహైదరాబాద్‌లా ఇతర నగరాలూ చేయాలి సాక్షి, న్యూఢిల్లీ: పట్ణణీకరణను ఒక అవకాశంగా గుర్తించాలని.. పట్టణ కేంద్రాలను అభివృద్ధి చోదకాలుగా పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. నగరం ఎలా పెరగాలనేదానిని ఆ నగర నివాసులు, నగర నాయకత్వం నిర్ణయించాలని.. ప్రయివేటు స్థిరాస్తి డెవలపర్లు కాదని వ్యాఖ్యానించారు. నగరాలను అభివృద్ధి చోదకాలుగా మలచటం లక్ష్యంగా రూపొందించిన మూడు భారీ పథకాలు.. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్, హౌసింగ్ ఫర్ ఆల్ (అర్బన్) కార్యక్రమాలను ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రారంభించారు. ఈ పథకాల అమలుకు సంబంధించి ప్రాజెక్టుల రూపకల్పన, అనుమతి, అమలు తదితరాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ మార్గదర్శకాలనూ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పై మూడు పథకాలూ ప్రపంచ స్థాయి పట్టణ ప్రాంతాల నిర్మాణానికి ప్రజలు కేంద్రంగా ఉండే విధానాన్ని తీసుకొస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 స్మార్ట్ సిటీల నిర్మాణం, అమృత్ పథకం కింద ఐదేళ్లలో 500 నగరాల పునరభివృద్ధి, అందరికీ ఇల్లు పథకం కింద 2022 నాటికి రెండు కోట్ల మంది పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టటం జరుగుతుందని వివరించారు. బిల్డర్ల ప్రతిష్ట చెడ్డగా ఉందని.. ఇంటి కొనుగోలుదారులకు కేంద్రం రక్షణ కల్పిస్తుందని.. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని మోదీ పేర్కొన్నారు. హైదరాబాద్‌లా మీరూ చేయండి.. ‘‘హైదరాబాద్‌లో ఆస్తి పన్ను పెంచకుండానే వసూళ్లలో వృద్ధి కనబరిచారు. అలా ఇతర మునిసిపాలిటీలు ఎందుకు చేయకూడదు? ఒక్కో మునిసిపాలిటీ ఒక్కో అంశంలో ముందంజలో ఉన్నప్పుడు.. ఆయా అంశాలన్నింటీని అన్ని మునిసిపాలిటీలు అమలు చేస్తే నగరాలన్నీ అభివృద్ధి చెందుతాయి...’’ అని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను వసూలు వృద్ధిపై ప్రధానికి ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ‘హైదరాబాద్‌లో ఆస్తి పన్ను రేటు పెంచలేదు. కానీ ఎక్కడెక్కడ రావడం లేదో.. అవన్నీ వచ్చేలా చూశాం. దాదాపు 270 కేసులను కోర్టు బయట పరిష్కరించాం. 2004లో ఆస్తి పన్ను మొత్తం రూ. 156 కోట్లు ఉంటే.. గత ఏడాది అది రూ. 1,125 కోట్లకు పెరిగింది’ అని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నగర ప్రజల అవసరాలు తీరాలంటే ఆయా పురపాలక సంఘాలు సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మెరుగైన సేవలందిస్తే వినియోగ రుసుం చెల్లించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. -
3 ప్రాజెక్టులు.. 4 లక్షల కోట్లు
స్మార్ట్ సిటీలు, అమృత్, అందరికీ ఇళ్ల ప్రాజెక్టులకు నేడు శ్రీకారం ♦ మూడు మెగా ప్రాజెక్టులను లాంఛనంగా ప్రారంభించనున్న మోదీ ♦ హౌసింగ్ మిషన్ లోగోను ఆవిష్కరించనున్న ప్రధాని ♦ ఇది కొత్త పట్టణ శకానికి నాంది: కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ♦ మూడు పథకాలపై రెండు రోజుల వర్క్‌షాపు న్యూఢిల్లీ: నగర భారతాన్ని సమూలంగా మార్చే దిశగా స్మార్ట్ సిటీలు సహా మూడు ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్రమోదీ గురువారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. వంద స్మార్ట్ నగరాలు, అటల్ మిషన్ ఫర్ రిజెనువేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫార్మేషన్(అమృత్), పట్టణ ప్రాంతాల్లో 2022 నాటికి అందరికీ ఇళ్లు పథకాలకు సంబంధించి మార్గదర్శకాలను ప్రధాని విడుదల చేయనున్నారు. అలాగే హౌసింగ్ మిషన్‌కు సంబంధించిన లోగోను కూడా ఆయన ఆవిష్కరించనున్నారు. ఈ మూడు ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వం సుమారు రూ. 4 లక్షల కోట్లను ఖర్చుచేయనుంది. ఈ పథకాల మార్గదర్శకాలను రూపొందించడానికి కేంద్రం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్థానిక సంస్థలతో ఏడాదికిపైగా చర్చలు జరిపింది. వీటిపై ప్రధాని మోదీ పట్టణాభివృద్ధి, పట్టణ పేదరిక నిర్మూలన మంత్రిత్వ శాఖతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతూ.. అవసరమైన సలహాలు, సూచనలు అందజేశారని పట్టణాభివృద్ధి శాఖ వర్గాలు తెలిపాయి. వంద స్మార్ట్ సిటీల ప్రాజెక్టు కోసం రూ. 48 వేల కోట్లు, అమృత్ కోసం రూ.50 వేల కోట్లు కేంద్ర ప్రభుత్వ గ్రాంటుగా ఐదేళ్ల పాటు అందజేయనున్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుకు వచ్చే ఏడేళ్లలో సుమారు రూ.3 లక్షల కోట్ల ఖర్చుతో మురికివాడల్లో నివసించేవారు, ఆర్థికంగా బలహీనవర్గాలవారు, అల్పాదాయ వర్గాల వారికి సుమారు 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. వీరికి ఒక్కొక్కరికీ రూ.2.3 లక్షల చొప్పున సబ్సిడీగా అందించనున్నారు. ఈ మూడు పథకాలు కొత్త పట్టణ శకానికి నాంది అని కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. ఈ పథకాలను అమలు చేయడంలో రాష్ట్రాలు, స్థానిక సంస్థలు కీలక భూమిక పోషించనున్నాయన్నారు. స్మార్ట్ సిటీల పథకంలో భాగంగా ఎంపిక చేసిన వంద నగరాల్లో 24 గంటలు నీరు, విద్యుత్, ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థల ఏర్పాటు, మెరుగైన విద్యా వ్యవస్థ, వినోద సౌకర్యాలు, ఈ గవర్నెన్స్, పర్యావరణహిత వాతావరణ మొదలైన సదుపాయాలు కల్పిస్తామన్నారు. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టును పీపీపీ మోడల్లో చేపడతామన్నారు. అమృత్ పథకం ద్వారా లక్ష జనాభా దాటిన 500 నగరాలు, పట్టణాల్లో మౌలిక వసతులు కల్పిస్తామని చెప్పారు. ప్రతి ఇంటికీ నీటి సౌకర్యం, మెరుగైన వ్యర్థాల నిర్వహణ, మెరుగైన రవాణా సదుపాయం మొదలైన అంశాలపై దృష్టి పెడతామన్నారు. ఈ మూడు పథకాల మార్గదర్శకాల విడుదల అనంతరం రెండు రోజుల పాటు జరిగే వర్క్‌షాప్‌లో సుమారు వెయ్యి మంది వివిధ రాష్ట్రాల మంత్రులు, ప్రధాన కార్యదర్శులు, మేయర్లు, మున్సిపల్ కమిషనర్లు, వివిధ దేశాల ప్రతినిధులు పాలుపంచుకుంటారని చెప్పారు. -
స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కేబినెట్ ఓకే
అటల్ యోజనకూ పచ్చజెండా రెండు ప్రాజెక్టులకు మొత్తం లక్ష కోట్ల బడ్జెట్ చక్కెర దిగుమతి సుంకం పెంపు అవినీతి శిక్షాకాలం ఏడేళ్లకు పెంపు న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఈ మేరకు ఆమోదముద్ర వేసింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుతో పాటు అటల్ పట్టణ నవీకరణ, పునరుద్ధరణ యోజన(అమృత్)కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వంద స్మార్ట్ నగరాలకు రూ. 48 వేల కోట్లు, అమృత్ పథకానికి రూ. 50 వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వంద నగరాలలో ఒక్కో నగరానికి ఏడాదికి 100 కోట్ల చొప్పున అయిదు సంవత్సరాల పాటు కేంద్రం సహాయం చేస్తుంది. ఈ ప్రాజెక్టు కింద కేంద్రం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ప్రతీ రాష్ట్రం స్మార్ట్ సిటీలకు తగిన నగరాలను ఎంపిక చేసి ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది. వాటి నుంచి కేంద్రం తుది జాబితాను ఖరారు చేసి ఆ నగరాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రాలు, ఆయా నగర స్థానిక సంస్థలు ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో మిగతా నిధులను సమకూర్చుకోవలసి ఉంటుంది. అమృత్ పథకం కింద 500 పట్టణాలను అభివృద్ధి చేస్తారు. మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సదుపాయం, మురుగు కాల్వల నిర్వహణ, రవాణా, మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి వంటి వాటికి అమృత్ పథకం కింద కేంద్ర సహాయం లభిస్తుంది. జేఎన్ఎన్యూఆర్ఎం రెండేళ్ల పొడిగింపు యూపీఏ సర్కారు పదేళ్లపాటు కొనసాగించిన జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించటానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది పట్టణ పేదలకు పక్కా ఇళ్లు లభించనున్నాయి. ఇందుకోసం కేంద్రం రాష్ట్రాలకు దాదాపు 350 కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది. చక్కెర దిగుమతి సుంకం పెంపు చక్కెర దిగుమతి సుంకాన్ని 40 శాతం పెంచటానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 25 శాతంగా ఉన్న సుంకాన్ని పెంచటంతో పాటు మొలాసిస్ నుంచి తయారయ్యే ఇథనాల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. దీని ద్వారా చక్కెర మిల్లులు రైతులకు చెల్లించాల్సి ఉన్న 21 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించటం సాధ్యపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎన్డీఆర్ఎఫ్కు రెండు కొత్త బెటాలియన్లు జాతీయ విపత్తు సహాయక దళానికి కొత్తగా రెండు బెటాలియన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న సశస్త్ర సేనాబల్కు చెందిన రెండు బెటాలియన్లను ఎన్డీఆర్ఎఫ్ను బలోపేతం చేయటానికి బదిలీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఎన్డీఆర్ఎఫ్ దళంలో మరో రెండువేల మంది చేరినట్టవుతుంది. కాటన్ కార్పొరేషన్‌కు ఆర్థిక సాయం రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి అమ్మకాల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వచ్చిన నష్టాలను పూడ్చటానికి సాయం అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తికి మద్దతు ధరను రకాలను బట్టి క్వింటల్‌కు రూ.3750, 4050గా నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది. హేయమైన నేరంగా అవినీతి అవినీతికి పాల్పడటాన్ని హేయమైన నేరాల విభాగంలోకి చేర్చాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. దీంతో అవినీతికి పాల్పడ్డ వారికి ప్రస్తుతం అయిదేళ్లుగా ఉన్న శిక్షాకాలం ఇకపై ఏడేళ్లకు పెరుగుతుంది. అంతే కాకుండా, లంచం తీసుకున్న వారితో పాటు లంచం ఇచ్చిన వారికి శిక్షా కాలాన్ని పెంచుతూ 1988 అవినీతి నిరోధక చట్టంలో సవరణలను ప్రతిపాదించారు. . కనీస వెయ్యి పింఛన్ కొనసాగింపు ఉద్యోగ భవిష్యనిధి పథకం అమలుచేస్తున్న వెయ్యి రూపాయల కనీస పింఛను పథకాన్ని కొనసాగించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. 1995 ఉద్యోగుల పింఛను పథకం కింద ఇస్తున్న పింఛన్‌ను ఈపీఎఫ్ఓ రిటైర్మెంట్ ఫండ్ బోర్డు ఎప్రిల్ 1 నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే. -
‘స్మార్ట్ సిటీ ప్రాజెక్టు’కు మెరుగులు
న్యూఢిల్లీ: స్మార్ట్ సిటీ ప్రాజెక్టు పథకాన్ని మరింత ముందుకు తీసెకెళ్లడానికి ఎన్డీఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇప్పుడు ఉన్న ఎలక్ట్రిసిటీ మీటర్ల పద్ధతి-నీటి కనెక్షన్లను ఆధునికీకరించనుంది. ఇందుకోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో రేడియో ఫ్రీక్వెన్సీ అనుసంధానంతో ఎలక్ట్రిసిటీ మీటర్లను ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా మీటర్ రీడింగ్ ప్రతినెలా ఆటోమెటిక్‌గా నవీనీకరించబడుతోంది. ఈ ప్రాజెక్టును మొదట కన్నాట్ ప్రాంతంలో ప్రారంభించాలని నిర్ణయించింది. ఆటోమెటిక్‌గా సమాచార సేకరణ: ప్రస్తుతం నగరపాలక సంస్థ ఎలక్ట్రిసిటీ మీటర్లకు రేడియో ఫ్రీక్వెన్సీని అనుసంధానం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ పద్ధతి ద్వారా మీటర్ రీడింగ్ ఆటోమెటిక్‌గా మారుతోందని సీనియర్ అధికారి తెలిపారు. ‘ తమ సిబ్బంది చేతిలో పట్టుకొనే సదుపాయం ఉన్న పరికరంతో ఓ భవన సముదాయానికి వెళ్తారు. రేడియో ఫ్రీక్వెన్సీ పరికరంలో ఉన్న సమాచారం ఆటోమెటిక్‌గా సిబ్బంది చేతిలో ఉన్న పరికరంలోకి ఎలాంటి అవాంతరం లేకుండానే మారుతోందని తెలిపారు. బిల్లింగ్‌లో తీవ్ర జాప్యానికి చెక్: నగరపాలక సంస్థ పరిధిలో ఇప్పుడు ఉన్న పద్ధతిలో మీటర్ రీడింగ్‌ను పరిశీలించి, సమాచారం సేకరించి బిల్లింగ్ చేయడానికి ఎన్డీఎంసీ సిబ్బందికి సుమారు రెండు మూడు నెలల సమయం పడుతోంది. ఇదే పద్ధతిలో నీటి బిల్లుల వసూళ్లలో కూడా జాప్యం జరుగుతోంది. నగర పాలక సంస్థకు నెలకు సుమారు 50 కోట్ల ఆదాయం విద్యుత్ సరఫరా ద్వారానే వస్తోంది. సమయానికి బిల్లులు అందజేయక ఆదాయానికి గండిపడుతోంది. ఇప్పుడు అందుబాటులోకి తెచ్చే సాంకేతిక పద్ధతిలో ఆదాయ లోటును తగ్గించడంతోపాటు వ్యవస్థను ఆధునికీకరించనుంది. త్వరలోనే టెండర్లను ఆహ్వానించడానికి సంస్థ చర్యలు తీసుకొంటోంది. -
కఠిన నిర్ణయాలతోనే ‘స్మార్ట్’
* స్మార్ట్ సిటీల పథకంపై కేంద్ర మంత్రి వెంకయ్య * పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి * స్మార్ట్ సిటీల జాతీయ సదస్సులో పిలుపు సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన ‘వంద స్మార్ట్ సిటీల’ పథకంలో చోటు ఆశిస్తున్న నగరాలకు అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకోగల సంసిద్ధత ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ‘సౌకర్యవంతమైన జీవనం, మెరుగైన జీవన ప్రమాణాలు, సుపరిపాలన, చక్కటి ఆరోగ్య, విద్యా సేవలు, రోజూ 24 గంటల విద్యుత్, నీరు, నాణ్యమైన రవాణా, పారిశుద్ధ్యం, ఉపాధి, సైబర్ అనుసంధానం అందించడం ఈ సిటీల ఉద్దేశం’ అని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ స్మార్ట్ సీటీల పథకంపై జరిగిన జాతీయ సదస్సులో వెంకయ్య ప్రసంగించారు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన స్మార్ట్ సిటీల ముసాయిదాపై చర్చించారు. వెంకయ్య మాట్లాడుతూ.. ‘ఈ సిటీలకు జాగరూకతగల, సేవలకు డబ్బు చెల్లించగల పౌరులు, సమర్థ నాయకత్వం, జవాబుదారీతనం గల సుపరిపాలన అవసరం. ఇవన్నీ సమకూరితేనే పథకం విజయవంతమవుతుంది. సమర్థవంతమైన పట్టణ పరిపాలనకు.. సేవల ధరలను పెంచగల, సంస్కరణలను అమలు చేయగల, అక్రమ కట్టడాలను నిర్మూలించి, కబ్జాలను అరిక ట్టే నాయకత్వం కావాలి’ అని అన్నారు. దేశంలో ప్రస్తుతం 37 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తున్నారని, వచ్చే 15 ఏళ్లలో వీరి జనాభా మరో 15 కోట్లకు, 2050 నాటికి మరో 50 కోట్లు పెరుగుతుందని వివరించారు. పట్టణ సంస్థల రాజకీయ నాయకత్వం సరైన వనరులు సమకూర్చకపోవడంతో జవహర్లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం విఫలమైందని, స్మార్ట్ సిటీల పథకంలో ఇలాంటి వాటిని సహించబోమని అన్నారు. ఈ సిటీల పథకం ముసాయిదాపై రాష్ట్రాలు వారం రోజుల్లో అభిప్రాయాలను పంపాలన్నారు. ముసాయిదా పత్రంలోని ముఖ్యాంశాలు.. - ఈ నగరాల్లో 20 ఏళ్లపాటు తలసరి పెట్టుబడి వ్యయం రూ. 43,386 గా అత్యున్నతాధికార నిపుణుల కమిటీ(హెచ్‌పీఈసీ) అంచనా వేసింది. నీటి సరఫరా, రవాణా తదితరాల పెట్టుబడులన్నీ ఇందులో ఉన్నాయి. వంద స్మార్ట్ సిటీల్లో 10 లక్షల జనాభాను సగటుగా లెక్కించి మదింపు చేశారు. అంటే 100 నగరాల్లో 20 ఏళ్ల పాటు రూ. 7లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి. - పారిశ్రామిక వాడలు, ఎగుమతుల జోన్లు, వాణిజ్య, సేవల కేంద్రాలు, ఫైనాన్షియల్ కేంద్రాల ద్వారా ఆర్థికవృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు. - పథకం విజయవంతం కావడానికి అభివృద్ధి ప్రాణాళికలు రూపొందిస్తారు. దీనికి రూ. 5 వేల కోట్లు కావాలి. - 13 అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. వీటిలో రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థపదార్థాల నిర్వహణ, మురుగునీటి కాల్వలు, టెలిఫోన్ నెట్వర్క్, వైఫై, ఆరోగ్యం, విద్య, అగ్నిమాపక నిర్వహణ తదితరాలు వీటిలో ఉన్నాయి.