కైలాసగిరి రిజర్వాయర్‌లో నిర్మించిన ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్
స్మార్ట్‌సిటీగా అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి సౌర విద్యుత్ ఉత్పత్తిలోనూ దూసుకుపోతోంది. ఆధునికతను అందిపుచ్చుకుని సరికొత్త పద్ధతుల్లో ప్రాజెక్ట్‌లను చేపట్టి దేశంలోనే తిరుపతి నగరపాలక సంస్థ ప్రత్యేకతను చాటుకుంటోంది. రాష్ట్రంలో మరెక్కడాలేని విధంగా 4 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్‌ను నిర్మించింది. ఈ ప్లాంట్ దేశంలోనే రెండో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్‌గా నిలిచింది.
– తిరుపతి తుడా
ఇటీవల స్మార్ట్‌సిటీ పోటీల్లో తిరుపతి అర్బన్ ఎన్విరాన్‌మెంట్ విభాగంలో ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్‌ప్లాంట్ 3వ ర్యాంక్‌ను సాధించింది. అలానే మరో 6.746 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తూ కాలుష్య నియంత్రణకు కట్టుబడి నెలవారీ విద్యుత్ బిల్లుల ఖర్చు తగ్గించుకుంటూ ఆదర్శంగా నిలుస్తోంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్‌లను వివిధ రూపాల్లో నిర్మించారు. గత 6 నెలల నుంచి 4.74 మెగావాట్ల సోలార్ విద్యుత్ అందుబాటులోకి రాగా.. గతనెల నుంచి మరో 6 మెగావాట్ల సోలార్ విద్యుత్ వినియోగంలోకి వచ్చింది. దీనిద్వారా నగరపాలక సంస్థ విద్యుత్ వాడక ఖర్చులు భారీగా తగ్గాయి. నెలకు రూ.2.8 కోట్ల విద్యుత్ బిల్లులు వస్తున్నాయి. ఇందులో రూ.1.75 కోట్ల మేర సోలార్ విద్యుత్‌ను వినియోగిస్తున్నారు. ప్రతినెల ఆ మేరకు ఆదా అవుతుండటంతో మరిన్ని సోలార్ ప్లాంట్‌లు నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
రూ.18 కోట్లతో కైలాసగిరి రిజర్వాయర్‌లో..
స్మార్ట్‌సిటీ ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.18 కోట్లు వెచ్చించి శ్రీకాళహస్తి సమీపంలోని కైలాసగిరి రిజర్వాయర్‌లో 4 మెగావాట్ల సామర్థ్యంతో ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించారు. నీటిపై నిర్మించిన ఈ సోలార్ ప్లాంట్ దేశంలో రెండో అతిపెద్ద ప్రాజెక్ట్‌గా రికార్డుల్లో నిలిచింది. తూకివాకం గ్రీన్‌సిటీలో రూ.24 కోట్లతో 6 మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్‌ప్లాంట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. నగరపాలక సంస్థ కార్యాలయం, పాఠశాలలపై రూ.3 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన ప్యానళ్ల ద్వారా 0.746 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఈ ప్రాజెక్ట్‌లు సత్ఫలితాలు ఇవ్వడంతో మరిన్ని సోలార్ ప్రాజెక్ట్‌లను నిర్మించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. మరో 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నట్లు తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పి.ఎస్.గిరీష తెలిపారు. సోలార్ ఉత్పత్తిలో ఇప్పటికే తిరుపతి మేటిగా నిలిచిందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment