నెల్లూరు స్మార్ట్ నగరంగా రూపుదిద్దుకోనుంది. నగరానికే ఐకాన్‌గా ఉండే విధంగా ప్రధాన మార్గాల్లో ఫ్లై ఓవర్ వంతెనలు, సీసీ రోడ్లు, డ్రెయిన్లు, పార్క్‌ల నిర్మాణాలతో సుందర నగరంగా తీర్చిదిద్దనున్నారు. వివిధ శాఖల నుంచి రూ.100 కోట్లతో నగరాన్ని నవీకరించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి నేతలు అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, వాటర్ పైప్‌లైన్ల నిర్మాణం పేరుతో నగరాన్ని ధ్వంసం చేశారు. ఎన్నికలకు ముందు హడావుడిగా నిధులు దిగమింగేసి పనులు పూర్తికాకుండానే అరకొరగా సీసీ రోడ్లు వేసి చేతులు దులుపుకున్నారు. ఇప్పటికీ నగర ప్రజలు అస్తవ్యస్తమైన రహదారులతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో నెల్లూరు నగరాన్ని స్మార్ట్‌గా తయారు చేసేందుకు పాలకులు శ్రీకారం చుట్టారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. గత ప్రభుత్వం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరపాలక సంస్థ ఖజానాను పూర్తిగా ఖాళీ చేసింది. ఈ పరిస్థితుల్లో నగరంలో అవసరాలు, ప్రాధాన్యతాంశాలపై అధికారులు, పాలకులు సమీక్షలు నిర్వహించి ప్రధాన పనులు నిర్వహణ ప్రణాళిక సిద్ధం చేశారు. అందులో భాగంగా జనరల్ ఫండ్ నిధులతో పాటు వివిధ ప్రత్యేక నిధులు మొత్తం కలిపి రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. అది కూడా ప్రతి పనికి టెండర్ పిలిచి పూర్తి పారదర్శకంగా కేటాయించనున్నారు. నెల్లూరు నగరపాలక సంస్థలో సార్వత్రిక ఎన్నికల ముందు అప్పటి మున్సిపల్ మంత్రి పొంగూరు నారాయణ హడావుడిగా పనులు నిర్వహించడానికి వీలుగా నిబంధనలు పట్టించుకోకుండా అన్ని అనుమతులు మంజూరు చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు నగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసే క్రమంలో నారాయణ హడావుడిగా వివిధ ప్రత్యేక నిధులను నగరపాలక సంస్థకు మళ్లించారు. నిబంధనలకు విరుద్ధంగా పూర్తిగా కాంట్రాక్టర్లకే లబ్ధి చేకూరేలా పనులు కట్టబెట్టారు. పర్యావసానంగా అసలే ఇబ్బందుల్లో నగరపాలక సంస్థ ఖజానా పూర్తిగా ఖాళీ కావడంతో పాటు గతంలో పనులు నిర్వహించిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించలేక చేతులెత్తేశారు. కానీ నగరంలో అభివృద్ధి పనులు మాత్రం శిలాఫలకాలపై కనిపిస్తున్నాయి.
80 శాతానికే ఆగిపోయిన పనులు
కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ సిస్టమ్, డ్రింకింగ్ వాటర్ పైప్‌లైన్ పనులు 80 శాతం మేర పూర్తయ్యాయి. అప్పటికే ఎన్నికల కోడ్ రావడంతో నిలిచిపోయాయి. అయితే పూర్తి చేసిన 80 శాతం పనులు పూర్తిగా నాసిరకంగా నాణ్యత ప్రమాణాలకు దూరంగా ఉన్నాయి. పైప్‌లైన్ నిర్మించి వెంటనే దానిపై వేసిన సిమెంట్ రోడ్డు ఆరు నెలలకే స్వరూపం పూర్తి కోల్పోయి దారుణంగా తయారైంది.
విజిలెన్స్ నివేదికలు
రాష్ట్ర వ్యాప్తంగా ఈ తరహలో జరిగిన పనులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దృష్టి సారించారు. దీనిపై ప్రస్తుత విచారణ నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ క్రమంలో అభివృద్ధి పనుల్లో నాణ్యతకు ప్రాధాన్యత ఇచ్చి ఇప్పటి వరకు నగరంలో ఏం పనులు జరిగాయి, ప్రజల అవసరాలను ఎంత మేరకు తీర్చగలుగుతున్నాయి, వాటి నాణ్యత ప్రమాణాలు ఏ మేరకు ఉన్నాయని పరిశీలించి నగరపాలక సంస్థ ఇంజినీరింగ్ విభాగం అధికారులు అవసరమైన పనులు నివేదిక సిద్ధం చేశారు.
నగరం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన డాక్టర్ పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్ మంత్రి కావడంతో సొంత నియోజకవర్గ అవసరాల పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. అవసరమైన అభివృద్ధి పనులకు అన్ని నివేదికలు సిద్ధం చేయించారు. ఇటీవలే మంత్రి అనిల్ కుమార్, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి సమన్వయంతో తక్కువ ఖర్చుతో రొట్టెల పండగ ఉత్సవాలను గతం కంటే ఘనంగా నిర్వహించారు.
14వ ఆర్థిక సంస్థ నిధులతో
నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం సుమారు రూ.100 కోట్లతో పనులు నిర్వహించనున్నారు. నగరంలో కాలువలు, కల్వర్టులు, సీసీ రోడ్లు, రోడ్డు మరమ్మతులు చేపట్టనున్నారు. ఇప్పటికే రూ.25 కోట్లతో పలు ప్రాంతాల్లో కాలువలు, రోడ్డు నిర్మాణానికి టెండర్లు పిలిచారు. రోడ్లు, కాలువలు, కల్వర్టులు, పార్కులు, సీసీ రోడ్లు, గుంతల రోడ్లుకు మరమ్మతులు ఇతర పనులు చేయనున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.40 కోట్లు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నిధులు రూ.10 కోట్లు, స్మార్ట్ సిటీ నిధులు రూ.10 కోట్లు, నుడా నిధులు రూ.15 కోట్లతో పార్కుల నిర్మాణం, జనరల్ ఫండ్ నిధులు రూ.6 కోట్లు, మొత్తం రూ.100 కోట్లతో అభివృద్ధి పనులు చేయనున్నారు.
పారదర్శకంగా టెండర్‌లు నిర్వహణ
టీడీపీ ప్రభుత్వ హయాంలో అవినీతి, అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. రూ.50 లక్షలు పనులను సైతం రూ.4.90 లక్షలు లెక్కన విభజించి టీడీపీ నేతలు పంచుకున్నారు. ఇలా నగర పాలక సంస్థ నిధులు టీడీపీ నేతలు స్వాహా చేశారు. అయితే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కార్పొరేషన్‌లో ప్రతి పనిని పారదర్శకంగా నిర్వహిస్తున్నారు. రూ.లక్ష పనికి సైతం టెండర్లు పిలవడం ద్వారా పాలకవర్గం, అధికారుల పనితీరుకు నిదర్శనంగా ఉంది. టెండర్ నిర్వహణలో అధికారులకు పూర్తిస్థాయిలో స్వేచ్ఛను పాలకవర్గం ఇచ్చారు. దీంతో అధికారులు నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించి తక్కువ కోట్ చేసిన కాంట్రాక్టర్ దక్కించుకునేలా చర్యలు తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment