ఐటీ రాజధానిగా కీర్తి సంపాదించినా, అవే గుంతల రోడ్లు, డ్రైనేజీలు. ట్రాఫిక్ పద్మవ్యూహం, పార్కింగ్ సమస్య. ఇంకా చెప్పుకుంటూపోతే పెద్ద జాబితానే అవుతుంది. ఈ తలరాతను స్మార్ట్ సిటీ పథకమైనా తీరుస్తుందని నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు. కాగితాల మీద అనుకున్నట్లుగా ఆచరణలోనూ సాగితే సిటీ సౌందర్యమే మారిపోతుంది.
సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్‌సిటీ మూడో జాబితాలో బెంగళూరుకు స్థానం దక్కడం తెలిసిందే. స్మార్ట్స్‌సిటీ రూపురేఖలు ఏ విధంగా ఉండాలన్నదానిపై నేడు (శుక్రవారం) 15 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం బెంగళూరులో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. నగర పాలికె ప్రత్యేక కమిషనర్ ఆర్. విజయ్‌శంకర్ ఈ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. స్మార్ట్ పథకంతో ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.2,219 వేల కోట్లతో బెంగళూరుకు అత్యాధునిక వసతులు లభించబోతున్నాయి. ఈ నిధుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలా రూ.500 కోట్లను, మిగిలిన మొత్తాన్ని బీబీఎంపీ, బీఎంటీసీ, బీఎంఆర్‌సీఎల్‌తో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా భరించనున్నాయి. ఏడు ఉప ప్రాజెక్టులుగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టును విభజించి ఆ మేరకు పనులను చేపడతారు.
స్మార్ట్ రహదారులు, ఈ–వాహనాలు
♦ స్మార్ట్ సిటీ లో రూ.1,166 కోట్ల భారీ నిధులతో టెండర్‌షూర్ రోడ్లు, ఈ–బస్సులు, ఈ–ఆటో రిక్షాలు, స్మార్ట్ బస్‌షెల్టర్స్, స్మార్ట్ డస్ట్‌బిన్స్, పర్యావరణ సెన్సార్స్ తదితరాలను ఏర్పాటు చేశారు. సమగ్ర రవాణా వ్యవస్థ ఇందు కోసం రూ.233.13 కోట్లను ఖర్చు చేస్తారు. రస్సెల్ మార్కెట్, శివాజీనగర బస్టాండును కలిపి మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్‌గా మారుస్తారు. ఈ వాహనాలకు చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు.
స్మార్ట్ మార్కెట్లు... మినీ కంపోస్ట్ ఎరువుల తయరీ కేంద్రాలు చారిత్రక నేపథ్యం కలిగిన కే.ఆర్ మార్కెట్, మల్లేశ్వరం మార్కెట్‌లను రూ.130 కోట్లతో బహుళ అంతస్తుల ఆటోమేటిక్ పార్కింగ్ సదుపాయాలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు కానున్నాయి. 24 గంటలూ పనిచేసే సీసీ కెమెరాలు, స్మార్ట్, మినీ కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రాలు అందుబాటులోకి రానున్నారు.
చెరువుల వద్ద సోలార్ ట్రీ
హలసూరు, స్యాంకీట్యాంక్ చెరువులకు కొత్త కళ. వీటిలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చేరే నీటిని ఎక్కడికక్కడ శుద్దిచేసి చేస్తారు. ఈ చెరువుల వద్ద బైస్కిల్‌షేర్ పాయింట్లు, సోలార్ ట్రీ ఉంటాయి. సోలార్ ట్రీ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది.
కబ్బన్‌పార్క్‌కు హంగులు
కబ్బన్‌పార్క్‌లో పర్యాటకానికి సంబంధించిన కియోస్కులు, మ్యూజిక్ ఫౌంటెన్‌లు, ఈ– టాయిలెట్లు, తాగునీరు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు ఏర్పడతాయి.
స్లమ్స్ టు స్మార్ట్
గాంధీనగరలోని స్వతంత్రపాళ్యలో భూగర్భ, స్మార్ట్ డ్రైనేజ్ సిస్టం అందుబాటులోకి వస్తుంది. ఇందులో సెన్సార్స్ ఉండటం వల్ల పూడిక ఏర్పాడితే వెంటనే సంబంధిత అధికారుల ఫోన్‌లకు సమాచారం అందుతుంది. ఇక స్మార్ట్ వీధి లైట్లు, కమ్యూనిటీ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. కే.సీ జనరల్ ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణం, అత్యాధునిక వైద్య సేవలు, టెలీ మెడిసిన్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment