Smart City List
-
21వరంగల్ స్మార్ట్ సిటీ ర్యాంకు
వరంగల్ అర్బన్: ఆకర్షణీయ నగరాల(స్మార్‌సిటీ) ర్యాంకింగ్‌లో వరంగల్ నగరం 21వ స్థానంలో నిలిచింది. 56.95 పాయింట్లతో ఈ స్థానాన్ని కైవసం చేసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 98 స్మార్ట్‌సిటీలలో ప్రాజెక్టుల పురోగతిపై పాయింట్ల ఆధారంగా కేంద్ర అర్బన్ అండ్ హౌసింగ్, అఫైర్స్ మంత్రిత్వ శాఖ ఈ ర్యాంకులను వెల్లడించింది. దేశవ్యాప్తంగా 259.96 పాయింట్లతో మహారాష్ట్రలోని నాగ్‌పూర్ నగరం ప్రథమస్థానంలో నిలి చింది. ఇక పొరుగున ఉన్న తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం 88.28 పాయింట్లతో 13వ స్థానంలో.. కాకినాడ 58.7 పాయింట్లతో 20 స్థానాన్ని దక్కించుకున్నాయి. ఆధునికత, ఆకర్షణల కలబోతగా ప్రపంచస్థాయి సౌకర్యాలతో పట్టణాలు, నగరాల సర్వతోముఖాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ సర్కారు నడుం బిగించిన విషయం తెలిసిందే. ఇందుకోసం 2015 జూన్ రెండో వారంలో స్మార్ట్‌సిటీ, అమృత్, హృదయ్ పథకాలను ప్రవేశపెట్టి్టంది. ఈమేరకు దేశంలోని 98 స్మార్ట్‌సిటీలను ఎంపిక చేసింది. అయితే మొదటి దశ కోసం పోటీలు నిర్వహించగా.. వరంగల్ నగరానికి త్రుటిలో అవకాశం జారిపోయింది. సప్లిమెంటరీలో 2016 జూన్ నెలాఖరులో స్మార్ట్‌సిటీ పథకానికి వరంగల్ ఎంపికైంది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుల కోసం ప్రణాళికలు, అంచనాలు, నిధుల విడుదల, నిర్వహణ, నిర్ణయాల కోసం స్పెషల్ పర్సస్ వెహికిల్(ఎస్పీవీ) ఏర్పాటైంది. స్మార్ట్‌సిటీ పనుల నిర్వహణకు గ్రేటర్ వరంగల్ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ (జీడబ్ల్యూఎస్‌సీసీఎల్) ద్వారా ముందుకు సాగుతోంది. ఇప్పటికే రూ.39 కోట్లతో నాలుగు స్మార్ట్‌రోడ్ల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. కాకతీయ మ్యూజికల్ గార్డెన్, పబ్లిక్ గార్డెన్, ఏకశిల పార్కుల పునరుద్ధరణకు రూ.53 కోట్లు, హన్మకొండ జూ పార్కు, కేఎంజీ పార్కులో మురుగునీరు నీటి శుద్ధీకరణ ప్లాంట్లకు రూ.36.8 కోట్లతో సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారు. భద్రకాళి బండ్‌పై రూప్‌వే నిర్మాణానికి రూ.35 కోట్లు, భద్రకాళి బండ్ అభివృద్ధికి రూ.10.5కోట్లు వెచ్చిస్తున్నారు. రూ.16.8కోట్లతో హన్మకొండ అశోక థియేటర్ ఎదుట మల్టీలెవల్ కాంప్లెక్స్, కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించనున్నారు. గ్రేటర్ పరిధిలో కాకతీయ కెనాల్ వెంట లేదా ప్రభుత్వ భవనాలపై సోలార్ పవర్ జనరేషన్ తదతర ప్రాజెక్టులకు రూపకల్పన చేపట్టారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని స్మార్ట్‌సిటీలలో ప్రాజెక్టులు.. వాటి పురోగతి ఆధారంగా పాయింట్లు కేటాయించి ర్యాంకింగ్‌ను ప్రకటించారు. సప్లిమెంటరీలో స్థానం దక్కించుకున్న వరంగల్ వెనుకబడి పోయిందని కొందరు నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేయగా, గ్రేటర్ పాలక, అధికార వర్గాలు మాత్రం సంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. -
ఇదీ.. స్మార్ట్ సిటీ
ఐటీ రాజధానిగా కీర్తి సంపాదించినా, అవే గుంతల రోడ్లు, డ్రైనేజీలు. ట్రాఫిక్ పద్మవ్యూహం, పార్కింగ్ సమస్య. ఇంకా చెప్పుకుంటూపోతే పెద్ద జాబితానే అవుతుంది. ఈ తలరాతను స్మార్ట్ సిటీ పథకమైనా తీరుస్తుందని నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు. కాగితాల మీద అనుకున్నట్లుగా ఆచరణలోనూ సాగితే సిటీ సౌందర్యమే మారిపోతుంది. సాక్షి, బెంగళూరు: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్మార్ట్‌సిటీ మూడో జాబితాలో బెంగళూరుకు స్థానం దక్కడం తెలిసిందే. స్మార్ట్స్‌సిటీ రూపురేఖలు ఏ విధంగా ఉండాలన్నదానిపై నేడు (శుక్రవారం) 15 మంది అధికారులతో కూడిన ప్రత్యేక బృందం బెంగళూరులో సమావేశమై తుది నిర్ణయం తీసుకోనుంది. నగర పాలికె ప్రత్యేక కమిషనర్ ఆర్. విజయ్‌శంకర్ ఈ ప్రాజెక్టుకు నోడల్ అధికారిగా వ్యవహరిస్తారు. స్మార్ట్ పథకంతో ప్రభుత్వ – ప్రైవేటు భాగస్వామ్యంలో స్మార్ట్ సిటీ ప్రాజెక్టు కింద రూ.2,219 వేల కోట్లతో బెంగళూరుకు అత్యాధునిక వసతులు లభించబోతున్నాయి. ఈ నిధుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తలా రూ.500 కోట్లను, మిగిలిన మొత్తాన్ని బీబీఎంపీ, బీఎంటీసీ, బీఎంఆర్‌సీఎల్‌తో పాటు కొన్ని ప్రైవేటు సంస్థలు కూడా భరించనున్నాయి. ఏడు ఉప ప్రాజెక్టులుగా స్మార్ట్ సిటీ ప్రాజెక్టును విభజించి ఆ మేరకు పనులను చేపడతారు. స్మార్ట్ రహదారులు, ఈ–వాహనాలు ♦ స్మార్ట్ సిటీ లో రూ.1,166 కోట్ల భారీ నిధులతో టెండర్‌షూర్ రోడ్లు, ఈ–బస్సులు, ఈ–ఆటో రిక్షాలు, స్మార్ట్ బస్‌షెల్టర్స్, స్మార్ట్ డస్ట్‌బిన్స్, పర్యావరణ సెన్సార్స్ తదితరాలను ఏర్పాటు చేశారు. సమగ్ర రవాణా వ్యవస్థ ఇందు కోసం రూ.233.13 కోట్లను ఖర్చు చేస్తారు. రస్సెల్ మార్కెట్, శివాజీనగర బస్టాండును కలిపి మల్టీమోడల్ ట్రాన్సిట్ హబ్‌గా మారుస్తారు. ఈ వాహనాలకు చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ మార్కెట్లు... మినీ కంపోస్ట్ ఎరువుల తయరీ కేంద్రాలు చారిత్రక నేపథ్యం కలిగిన కే.ఆర్ మార్కెట్, మల్లేశ్వరం మార్కెట్లను రూ.130 కోట్లతో బహుళ అంతస్తుల ఆటోమేటిక్ పార్కింగ్ సదుపాయాలు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు ఏర్పాటు కానున్నాయి. 24 గంటలూ పనిచేసే సీసీ కెమెరాలు, స్మార్ట్, మినీ కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రాలు అందుబాటులోకి రానున్నారు. చెరువుల వద్ద సోలార్ ట్రీ హలసూరు, స్యాంకీట్యాంక్ చెరువులకు కొత్త కళ. వీటిలోకి వివిధ ప్రాంతాల నుంచి వచ్చే చేరే నీటిని ఎక్కడికక్కడ శుద్దిచేసి చేస్తారు. ఈ చెరువుల వద్ద బైస్కిల్‌షేర్ పాయింట్లు, సోలార్ ట్రీ ఉంటాయి. సోలార్ ట్రీ సౌర విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. కబ్బన్‌పార్క్‌కు హంగులు కబ్బన్‌పార్క్‌లో పర్యాటకానికి సంబంధించిన కియోస్కులు, మ్యూజిక్ ఫౌంటెన్లు, ఈ– టాయిలెట్లు, తాగునీరు, స్మార్ట్ పార్కింగ్ సౌకర్యాలు ఏర్పడతాయి. స్లమ్స్ టు స్మార్ట్ గాంధీనగరలోని స్వతంత్రపాళ్యలో భూగర్భ, స్మార్ట్ డ్రైనేజ్ సిస్టం అందుబాటులోకి వస్తుంది. ఇందులో సెన్సార్స్ ఉండటం వల్ల పూడిక ఏర్పాడితే వెంటనే సంబంధిత అధికారుల ఫోన్లకు సమాచారం అందుతుంది. ఇక స్మార్ట్ వీధి లైట్లు, కమ్యూనిటీ సెంటర్లు అందుబాటులోకి వస్తాయి. కే.సీ జనరల్ ఆసుపత్రిలో నూతన భవన నిర్మాణం, అత్యాధునిక వైద్య సేవలు, టెలీ మెడిసిన్ సదుపాయాలు అందుబాటులోకి వస్తాయి. -
స్మార్ట్‌సిటీల జాబితాలో అమరావతి
విజయవాడ : నవ్యాంధ్ర రాజధాని అమరావతిని స్మార్ట్ సిటీల జాబితాలో చేరుస్తామని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు వెల్లడించారు. రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన తర్వాత తొలిసారిగా వెంకయ్యనాయుడు గురువారం విజయవాడ విచ్చేశారు. అందులోభాగంగా విజయవాడ బీజేపీ కార్యాలయంలో వెంకయ్య నాయుడు మాట్లాడుతూ... తక్కువ ప్రీమియంకే రైతులకు పంటల బీమా చేస్తామన్నారు. రానున్న రోజుల్లో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ... పోలవరం అథారటీ ద్వారానే ప్రాజెక్ట్ పనులు చేపడతామన్నారు. ఏ రాష్ట్రానికి ఇవ్వనంత సాయం ఆంధ్రప్రదేశ్‌కి కేంద్రం ఇస్తుందని హరిబాబు చెప్పారు. -
వరంగల్ ఇక స్మార్ట్
తొలిదశలో అమలు కష్టమే.. గ్రేటర్అధికారులపైనే భారం రూ.500 కోట్లతో అభివృద్ధి స్మార్ట్‌సిటీల జాబితాను వెల్లడించిన కేంద్ర మంత్రి హన్మకొండ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీ జాబితాలో వరంగల్ చోటు సాధించింది. దేశవ్యాప్తంగా 98 నగరాలు స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోగా.. తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు చోటు సంపాదించాయి. ఇక ప్రయోజనాలు చాలా ఉన్నారుు. పట్టణ, నగర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ నగర జీవనంలో నిత్యం తలెత్తే క్లిష్లమైన సమస్యలను సులభతరం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. నగర పరిపాలనను క్రమంగా ఈ గవర్నెన్స్ విధానంలోకి మార్చుతారు. నగరాల్లో 24 గంటలు నాణ్యమైన విద్యుత్, మంచినీటి సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. నగరంలో నిత్యం పోగయ్యే చెత్తతో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఘనపదార్థాల నిర్వహణ (సాలీడ్ వేస్ట్ మేనేజ్మెంట్) పద్ధతిని తప్పనిసరి చేస్తారు. ప్రజలు, నగరపాలక సంస్థలకు మధ్య వారధిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. కార్పొరేషన్లో ఉన్న భూమి రికార్డులు, మ్యాపులు, లే అవుట్లు, పన్నుల వసూళ్లు, బకాయిలు అన్ని వివరాలు డిజిటలైజేషన్ చేస్తే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. నగరంలో పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా ప్రజా, వ్యక్తిగత రవాణాలో మార్పులు తీసుకొస్తారు. ఏకో ఫ్రెండ్లీ భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తారు. రూ.500 కోట్లు స్మార్ట్‌సిటీగా ఎంపికైన నగరాలకు రూ.500 కోట్లు మంజూరవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి తొలిదశలో ఏకమొత్తంలో రూ.200 కోట్లు, ఆ తర్వాత ఏడాదికి రూ.100 కోట్ల వంతున రాబోయే మూడేళ్లలో నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. దేశం 98 నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తొలిదశంలో కనిష్టంగా 5.. గరిష్టంగా 20 నగరాలలో స్మార్ట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం విధించిన నిబంధనలు పాటించే నగరాలకు స్కోర్‌ను కేటాయిస్తారు. ఈ స్కోరు ఆధారంగానే తర్వాత రెండో, మూడో దశలలో స్మార్ట్‌సిటీ పథకాన్ని అమలు చేస్తారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్, లోపాలు లేకుండా అకౌంట్స్ నిర్వాహణ, సమాచార సాంకేతికను ఉపయోగిస్తూ కార్పొరేషన్ ద్వారా అందుతున్న పౌర సేవలు సులభతరం చేయడం, ఈ లెటర్స్, కార్పొరేషన్‌తో సంబంధం ఉండే వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం తదితర అంశాల అమలును బట్టి స్కోరును కేటాయిస్తారు. తొలిదశలో కష్టమే.. స్మార్ట్‌సిటీ జాబితాలో మొదటి, రెండో దశ అమలులో స్థానం దక్కించుకునే నగరాలకే ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. అయితే తొలి రెండు దశల్లో చోటు దక్కించుకోవడం కోసం భారీ కసరత్తే చేయాలి. స్మార్ట్‌సిటీ నిబంధనలకు అనుగుణంగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి సమగ్ర నివేదికను అందివాలి. కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్థలాలు, ఇళ్లు, పన్నులు, మ్యాపులు, లేఅవుట్లు తదితర సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయాలి. పద్దులను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుంది. వరంగల్ నగరం విషయానికి వస్తే గడిచిన నాలుగేళ్లుగా అకౌంట్ ప్రక్రియ పూర్తి కాకపోవడం మొదటి అవరోధంగా మారనుంది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో డబుల్ అకౌంటింగ్ పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తుంది. తొలిదశ నగరాల జాబితాను ప్రకటించేందుకు మరో నాలుగు నెలల సమయం ఉంది. ఈలోగా కార్పొరేష న్ పాలన వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకురావాల్సి ఉంది. -
హైదరాబాద్,వరంగల్ స్మార్ట్
ఏపీలోని తిరుపతి, కాకినాడ, విశాఖ కూడా.... * దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీల జాబితా వెల్లడించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు * మొత్తం 98 సిటీలకు రూ. 48 వేల కోట్లు! సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌సిటీస్ మిషన్ ద్వారా మూడు విడతల్లో 98 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు రానున్న ఐదేళ్లలో దాదాపు రూ.48 వేల కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయనున్న నగరాల జాబితాను వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, కాకినాడకు, తెలంగాణ నుంచి గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలకు చోటు దక్కింది. నగరాల జనాభా, నోటిఫై చేసిన నగరాల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు స్మార్ట్‌సిటీలను కేటాయించారు. దీని ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు గరిష్టంగా 13, తమిళనాడు 12, మహారాష్ట్ర 10, మధ్యప్రదేశ్ 7, గుజరాత్, కర్ణాటక 6 చొప్పున, ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు 3 చొప్పున కేటాయించారు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకట్రెండు స్మార్ట్‌సిటీలను పొందాయి. ఎంపిక చేసిన 98 నగరాల్లో 8 నగరాలు (పనాజీ, డయ్యూ, శిలవస్సా, కవరట్టి, ధర్మశాల, న్యూటౌన్ కోల్‌కతా, పాసిఘాట్, నామ్చి) లక్ష లోపు జనాభా ఉన్నవే కావడం గమనార్హం! అలాగే 35 నగరాల్లో లక్ష నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉంది. వీటిలో తిరుపతి, కాకినాడ ఉన్నాయి. 5-10 లక్షల మధ్య జనాభా కలిగిన 21 నగరాలు కూడా జాబితాలో ఉన్నాయి. ఇందులో వరంగల్ ఉంది. 10 నుంచి 25 లక్షల మధ్య జనాభా కలిగిన 25 నగరాల్లో విశాఖపట్నం ఉంది. 25 నుంచి 50 లక్షల జనాభా కలిగినవి 5 నగరాలున్నాయి. ఇక 50 లక్షల జనాభా కలిగిన వాటిలో 4 నగరాలు ఉన్నాయి. వాటిలో హైదరాబాద్ ఒకటి. స్మార్ట్‌సిటీలుగా ఎంపికైన 24 నగరాలు ఆయా రాష్ట్రాలకు రాజధానులుగా ఉన్నాయి. తొమ్మిది రాజధాని నగరాలు (ఈటానగర్, పట్నా, సిమ్లా, బెంగళూరు, డామన్, తిరువనంతపురం, పుదుచ్చేరి, గ్యాంగ్‌టక్, కోల్‌కతా) స్మార్ట్‌సిటీ జాబితాలో లేవు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నగరాలను కాకుండా ఇతర ముఖ్య నగరాలను ప్రతిపాదించాయి. ఈ 98 నగరాల్లో 90 సిటీలు.. ‘అమృత్’ నగరాల జాబితాలో ఉన్నవే! ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల నుంచి ఇంకా చెరో నగరాన్ని స్మార్ట్‌సిటీలుగా ఎంపిక చేయాల్సి ఉంది. తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌ను కూడా స్మార్ట్‌సిటీకి ప్రతిపాదించగా.. కేంద్రం పక్కనపెట్టింది. రాష్ట్రాలు కూడా అంతే మొత్తంలో.. కేంద్రం వెచ్చించే రూ.48 వేల కోట్లకు సమానంగా రాష్ట్రాలు, పురపాలక సంఘాలు కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ఈ మొత్తం నిధులు రూ.96 వేల కోట్లు అవుతాయి. ఈ 98 నగరాల ఎంపిక ప్రక్రియలోని రెండో దశలో పోటీపడతాయి. అందులో తొలి 20 స్థానాల్లో ఉన్న నగరాలకు ఈ ఏడాది ఆర్థికసాయం అందుతుంది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో మరో 40 నగరాలు, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో మరో 40 నగరాలకు ఆర్థిక సాయం అందుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు. తొలి సంవత్సరం ఒక్కో నగరానికి రూ.200 కోట్ల చొప్పున తదుపరి నాలుగేళ్లపాటు రూ.100 కోట్ల చొప్పున వెచ్చిస్తారు. స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ స్పెషల్ పర్పస్ వెహికిల్ ఒక కంపెనీగా ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక సంస్థ భాగస్వాములుగా ఉంటాయి. స్మార్ట్‌సిటీస్ మిషన్ ద్వారా నగరాలు అభివృద్ధి చెందడానికి కనీసం 5 నుంచి పదేళ్లు పడుతుందని మంత్రి వివరించారు. స్మార్ట్‌సిటీల జాబితా ఇదీ.. అండమాన్ నికోబార్-1 (పోర్టుబెయ్లిర్), ఆంధ్రప్రదేశ్-3(విశాఖ, తిరుపతి, కాకినాడ), అరుణాచల్ ప్రదేశ్-1(పాసీఘాట్), అస్సాం-1(గువాహటి), బీహార్-3(ముజఫర్‌పూర్, భాగల్పూర్, బీహార్షరీఫ్), చండీగఢ్-1(చండీగఢ్), ఛత్తీస్‌గఢ్-2(రాయ్‌పూర్, బిలాస్పూర్), డామన్ అండ్ డయ్యూ-1(డయ్యూ), దాద్రానగర్ హవేలీ-1(సిలవస్సా), ఢిల్లీ-1(న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సి ల్), గోవా-1(పనాజీ), గుజరాత్-6(గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్, వదోదరా, రాజ్‌కోట్, దాహోద్), హర్యానా-2(కర్నాల్, ఫరీదాబాద్), హిమాచల్‌ప్రదేశ్-1(ధర్మశా ల), జార్ఖండ్-1(రాంచీ), కర్ణాటక-6(మంగళూరు, బెలగావి, శివమొగ్గ, హుబ్బల్లి-దర్వాద్, తూమకూరు, దావనేగెరే), కేరళ-1(కోచి), లక్షద్వీప్-1(కవరత్తి), మధ్యప్రదేశ్-7(భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలి యర్, సాగర్, సాత్నా, ఉజ్జయిని). మహారాష్ట్ర-10(నవీ ముంబై, నాసిక్, థానే, గ్రేటర్ ముంబై, అమరావతి, షోలాపూర్, నాగ్‌పూర్, కల్యాణ్ -డాంబివాలీ, ఔరంగాబాద్, పుణె), మణిపూర్-1(ఇంఫాల్), మేఘాలయ-1(షిల్లాంగ్), మిజోరాం-1(ఐజ్వాల్), నాగాలాండ్-1(కోహిమా), ఒడిశా-2(భువనేశ్వ ర్, రూర్కేలా), పుదుచ్చేరి-1(ఔల్గరేట్), పంజాబ్-3(లుథియానా, జలందర్, అమృత్సర్), రాజస్తాన్-4(జైపూర్, ఉదయ్‌పూర్, కోటా, అజ్మీర్), సిక్కిం-1(నామ్చి), తమిళనాడు-12(తిరుచిరాపల్లి, తిరునల్వేలీ, దిండిగల్, తంజావూర్, తిరుప్పూర్, సేలం, వెల్లూ రు, కోయంబత్తూరు, మధురై, ఈరోడ్, తూతుకూడి, చెన్నై), తెలంగాణ-2(హైదరాబాద్, గ్రేటర్ వరంగల్), త్రిపుర-1(అగర్తలా), యూపీ-12(మొరాదాబాద్, అలీగ ఢ్, సహరన్పూర్, బరేలీ, ఝాన్సీ, కాన్పూ ర్, అలహాబాద్, లక్నో, వారణాసి, ఘాజి యాబాద్, ఆగ్రా, రాంపూర్), ఉత్తరాఖండ్-1(డెహ్రాడూన్), వెస్ట్‌బెంగాల్-4(న్యూటౌన్ కోల్‌కతా, బీధన్నగర్, దుర్గాపూర్, హల్దియా). -
ఖమ్మం స్మార్ట్ సిటీకి పొంగులేటి కృషి
సాక్షి, ఖమ్మం: స్మార్ట్ సిటీ జాబితాలో ఖమ్మం కార్పొరేషన్‌కు చోటు కోసం ఎంపీ, వైఎస్ఆర్ సీపీ రాష్ర్ట వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కృషి చేస్తున్నట్టు ఆ పార్టీ జిల్లా అధికార ప్రతినిధులు ఆకుల మూర్తి, ముదిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. ఇందులో భాగంగానే, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని పొంగులేటి కలిశారని అన్నారు. వారు బుధవారం నగరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్మార్ట్ సిటీకి కావాల్సిన అర్హతలన్నీ ఖమ్మం నగరానికి ఉన్నాయన్నారు. ఈ విషయూన్ని ఎంపీ ఇప్పటికే పలుమార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని అన్నారు. నగరంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. దోమల స్వైర విహారం, చెత్తచెదారంతో నగరం కంపు కొడుతోందన్నారు. కార్పొరేషన్‌గా హోదా పెరిగినప్పటికీ ఆ స్థాయిలో ప్రజలకు కనీస వసతులు అందడం లేదని అన్నారు. నగరం త్వరగా అభివృద్ధి కావాలన్నా, కిందిస్థాయి సిబ్బంది విధి నిర్వహణలో బాధ్యతగా ఉండాలన్నా కార్పొరేషన్‌కు ఐఏఎస్ అధికారిని కమిషనర్‌గా నియమించాల్సిన అవసరముందని అన్నారు. కార్పొరేషన్‌కు ఏటా 300 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నప్పటికీ.. వసతుల కల్పనలో మాత్రం అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. నగర ప్రజల దాహార్తి తీర్చేందుకు సమ్మర్ స్టోరేజీకి ట్యాంక్ నిర్మాణం కోసం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వ హయాంలో రామన్నపేట వద్ద భూసేకరణ జరిగిందన్నారు. ఆ తరువాత ప్రతి వేసవిలో నగర ప్రజలు తాగునీటి కోసం తహతహలాడుతున్నా సమ్మర్ స్టోరేజి ట్యాంకు ప్రతిపాదనను మాత్రం అధికారులు మూలన పడేశారని విమర్శించారు. రానున్న వేసవిలో దాహార్తి ఏర్పడకుండా ఇప్పటి నుంచే అధికారులు ప్రణాళికలు సిద్దం చేసుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించకపోతే వైఎస్ఆర్ సీపీ ఉద్యమిస్తుందన్నారు. సమావేశంలో పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఎండి.ముస్తఫా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు కీసర పద్మజారెడ్డి, నగర విభాగం అధ్యక్షురాలు కొత్తకొండ్ల శ్రీలక్ష్మి, జిల్లా నాయకురాలు షర్మిలా సంపత్ పాల్గొన్నారు. -
‘స్మార్ట్’ ఖమ్మంపై ఆశలు
సాక్షి, ఖమ్మం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్మార్ట్ సిటీల జాబితాలో ఖమ్మానికి చోటుదక్కాలని నగర ప్రజలు ఆశతో ఎదురుచూస్తున్నారు. రూ.కోట్ల నిధులతో నగరాల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర తీసుకుంటున్న ఈ కార్యక్రమంలో ఖమ్మంకు అవకాశం వస్తే నగర రూపు రేఖలే మారనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఖమ్మంను కూడా స్మార్ట్ సిటీల జాబితాలోకి చేర్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని ప్రకటించడంతో నగరవాసులు ఆశలు పెట్టుకున్నారు. ఖమ్మంఅర్బన్ మండలంలోని తొమ్మిది గ్రామాలను విలీనం చేయడంతో 2012లో ఖమ్మం కార్పొరేషన్‌గా ఏర్పడింది. మూడు లక్షల పై చిలుకు జనాభాతో 50 డివిజన్లను చేశారు. అయితే కార్పొరేషన్ హోదా పెరిగినా ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఖమ్మానికి నిధులు మాత్రం ఆశించిన స్థాయిలో రాలేదు. నిత్యం పెరగుతున్న జనాభాకు తగిన మంచినీటి సరఫరా లేక, డ్రైనేజీ వ్యవస్థ అస్తవస్థంగా ఉంది. రోడ్ల విస్తరణ లేకపోవడంతో ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోతున్నారు. నగరవాసులకు ఆహ్లాదాన్ని పంచే పార్కులు కూడా తక్కువే. కార్పొరేషన్ స్థాయిలో వసతులు లేకపోవడంతో ‘పేరుగొప్ప ఊరు దిబ్బ’ చందంగా నగరం పరిస్థితి తయారైంది. ఖమ్మాన్ని స్మార్ట్ సిటీల జాబితాలో చేర్చితే నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందనుంది. ఈ ఉద్దేశంతో ఈ జాబితాలో నగరాన్ని చేర్చాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డాక్టర్ కె.ఇలంబరితి ఇప్పటికే ప్రభుత్వానికి లేఖ రాశారు. * ప్రస్తుతం నగరంలో 71 మురికివాడల్లో 66, 918 మంది జనాభా ఉన్నారు. వీరిలో 15 వేల మందికి కూడా మంచినీటి సరఫరా కావడం లేదు. 42 కుటుంబాలు ఉన్నా కేవ లం 24,500 ఇళ్లకే మంచినీటి కనెక్షన్లు ఉన్నా యి. నగర శివారు ప్రాంతాల వాసుల కు ఇప్పటికీ మంచినీటి సమస్య తప్పడం లేదు. * నగరం కార్పొరేషన్ అయినా అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ మాత్రం లేదు. చిన్నపాటి వర్షానికే మామిళ్లగూడెం, బస్టాండ్ సెంటర్, కస్పాబజార్, మార్కెట్ ప్రాంతం చెరువులను తల పిస్తున్నాయి. నగరవ్యాప్తంగా ప్రస్తుతం 397 కి.మీ మేర డ్రైనేజీ వ్యవస్థ ఉంది. మురుగు నీరంతా నగరం నుంచి పంపించాలంటే అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థే శరణ్యం. * నగరం నిత్యం రద్దీ కేంద్రంగా మారింది. ఇటు హైదరాబాద్, అటు విజయవాడ, వరంగల్ వెళ్లేందుకు సెంటర్‌గా ఉండటంతో నిత్యం ప్రయాణీకుల ప్రాంగణంగా నగరం మారింది. దీనికితోడు వాహనాల సంఖ్య పెరగడం.. రోడ్ల విస్తరణ లేకపోవడంతో నగరం అంతా ఎక్కడ చూసినా ట్రాఫిక్. * ఇక నగర వాసులకు ఆహ్లాదం అందనిద్రాక్షే. ఆహ్లాదాన్ని పంచే పార్కులు వెళ్లమీద లెక్కబెట్టవచ్చు. గ్రీన్ బెల్టు స్థలాలు అన్యాక్రాంతం కావడంతో కాలుష్య కోరల్లోకి నగరం వెళ్లుతోంది. స్మార్ట్ సిటీ అయితే ఇలా.. * కేంద్రం నుంచి మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరువుతాయి. * అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంతో పాటు రోడ్ల విస్తరణ జరిగి నగరం సుందరీకరణ సాధ్యమవుతుంది. * సెంట్రల్ లైటింగ్, ప్రధాన కూడళ్లలో విద్యుత్ వెలుగులు విరజిమ్మనున్నాయి. * అర్హులైన నగర వాసులందరికీ ఇళ్ల స్థలాలు రానున్నాయి. * మంచినీటి వ్యవస్థను మెరుగుపరచడంతో పాటు ప్రతి ఒక్కరికీ రక్షిత మంచినీటి సరఫరా కానుంది. * నగరంలో నివసించే పౌరులందరికీ నగర పాలక సంస్థ ద్వారా పూర్తి స్థాయిలో సేవలు అందించడం స్మార్ట్ సిటీ ఉద్దేశం.