హైదరాబాద్,వరంగల్ స్మార్ట్ | know smart cities are warangal and hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్,వరంగల్ స్మార్ట్

Published Fri, Aug 28 2015 1:25 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

హైదరాబాద్,వరంగల్ స్మార్ట్

హైదరాబాద్,వరంగల్ స్మార్ట్

ఏపీలోని తిరుపతి, కాకినాడ, విశాఖ కూడా....
* దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీల జాబితా వెల్లడించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
* మొత్తం 98 సిటీలకు రూ. 48 వేల కోట్లు!

సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌సిటీస్ మిషన్ ద్వారా మూడు విడతల్లో 98 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు రానున్న ఐదేళ్లలో దాదాపు రూ.48 వేల కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయనున్న నగరాల జాబితాను వెల్లడించారు.

ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, కాకినాడకు, తెలంగాణ నుంచి గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలకు చోటు దక్కింది. నగరాల జనాభా, నోటిఫై చేసిన నగరాల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు స్మార్ట్‌సిటీలను కేటాయించారు. దీని ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు గరిష్టంగా 13, తమిళనాడు 12, మహారాష్ట్ర 10, మధ్యప్రదేశ్ 7, గుజరాత్, కర్ణాటక 6 చొప్పున, ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు 3 చొప్పున కేటాయించారు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకట్రెండు స్మార్ట్‌సిటీలను పొందాయి.

ఎంపిక చేసిన 98 నగరాల్లో 8 నగరాలు (పనాజీ, డయ్యూ, శిలవస్సా, కవరట్టి, ధర్మశాల, న్యూటౌన్ కోల్‌కతా, పాసిఘాట్, నామ్చి) లక్ష లోపు జనాభా ఉన్నవే కావడం గమనార్హం! అలాగే 35 నగరాల్లో లక్ష నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉంది. వీటిలో తిరుపతి, కాకినాడ ఉన్నాయి. 5-10 లక్షల మధ్య జనాభా కలిగిన 21 నగరాలు కూడా జాబితాలో ఉన్నాయి. ఇందులో వరంగల్ ఉంది. 10 నుంచి 25 లక్షల మధ్య జనాభా కలిగిన 25 నగరాల్లో విశాఖపట్నం ఉంది. 25 నుంచి 50 లక్షల జనాభా కలిగినవి 5 నగరాలున్నాయి. ఇక 50 లక్షల జనాభా కలిగిన వాటిలో 4 నగరాలు ఉన్నాయి. వాటిలో హైదరాబాద్ ఒకటి. స్మార్ట్‌సిటీలుగా ఎంపికైన 24 నగరాలు ఆయా రాష్ట్రాలకు రాజధానులుగా ఉన్నాయి.

తొమ్మిది రాజధాని నగరాలు (ఈటానగర్, పట్నా, సిమ్లా, బెంగళూరు, డామన్, తిరువనంతపురం, పుదుచ్చేరి, గ్యాంగ్‌టక్, కోల్‌కతా) స్మార్ట్‌సిటీ జాబితాలో లేవు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నగరాలను కాకుండా ఇతర ముఖ్య నగరాలను ప్రతిపాదించాయి. ఈ 98 నగరాల్లో 90 సిటీలు.. ‘అమృత్’ నగరాల జాబితాలో ఉన్నవే! ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల నుంచి ఇంకా చెరో నగరాన్ని స్మార్ట్‌సిటీలుగా ఎంపిక చేయాల్సి ఉంది. తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌ను కూడా స్మార్ట్‌సిటీకి ప్రతిపాదించగా.. కేంద్రం పక్కనపెట్టింది.
 
రాష్ట్రాలు కూడా అంతే మొత్తంలో..
కేంద్రం వెచ్చించే రూ.48 వేల కోట్లకు సమానంగా రాష్ట్రాలు, పురపాలక సంఘాలు కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ఈ మొత్తం నిధులు రూ.96 వేల కోట్లు అవుతాయి. ఈ 98 నగరాల ఎంపిక ప్రక్రియలోని రెండో దశలో పోటీపడతాయి. అందులో తొలి 20 స్థానాల్లో ఉన్న నగరాలకు ఈ ఏడాది ఆర్థికసాయం అందుతుంది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో మరో 40 నగరాలు, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో మరో 40 నగరాలకు ఆర్థిక సాయం అందుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు.

తొలి సంవత్సరం ఒక్కో నగరానికి రూ.200 కోట్ల చొప్పున తదుపరి నాలుగేళ్లపాటు రూ.100 కోట్ల చొప్పున వెచ్చిస్తారు. స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ స్పెషల్ పర్పస్ వెహికిల్ ఒక కంపెనీగా ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక సంస్థ భాగస్వాములుగా ఉంటాయి. స్మార్ట్‌సిటీస్ మిషన్ ద్వారా నగరాలు అభివృద్ధి చెందడానికి కనీసం 5 నుంచి పదేళ్లు పడుతుందని మంత్రి వివరించారు.
 
స్మార్ట్‌సిటీల జాబితా ఇదీ..
అండమాన్ నికోబార్-1 (పోర్టుబెయ్లిర్), ఆంధ్రప్రదేశ్-3(విశాఖ, తిరుపతి, కాకినాడ), అరుణాచల్ ప్రదేశ్-1(పాసీఘాట్), అస్సాం-1(గువాహటి), బీహార్-3(ముజఫర్‌పూర్, భాగల్‌పూర్, బీహార్‌షరీఫ్), చండీగఢ్-1(చండీగఢ్), ఛత్తీస్‌గఢ్-2(రాయ్‌పూర్, బిలాస్‌పూర్), డామన్ అండ్ డయ్యూ-1(డయ్యూ), దాద్రానగర్ హవేలీ-1(సిలవస్సా), ఢిల్లీ-1(న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సి ల్), గోవా-1(పనాజీ), గుజరాత్-6(గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్, వదోదరా, రాజ్‌కోట్, దాహోద్), హర్యానా-2(కర్నాల్, ఫరీదాబాద్), హిమాచల్‌ప్రదేశ్-1(ధర్మశా ల), జార్ఖండ్-1(రాంచీ), కర్ణాటక-6(మంగళూరు, బెలగావి, శివమొగ్గ, హుబ్బల్లి-దర్వాద్, తూమకూరు, దావనేగెరే), కేరళ-1(కోచి), లక్షద్వీప్-1(కవరత్తి), మధ్యప్రదేశ్-7(భోపాల్, ఇండోర్, జబల్‌పూర్, గ్వాలి యర్, సాగర్, సాత్నా, ఉజ్జయిని).

మహారాష్ట్ర-10(నవీ ముంబై, నాసిక్, థానే, గ్రేటర్ ముంబై, అమరావతి, షోలాపూర్, నాగ్‌పూర్, కల్యాణ్ -డాంబివాలీ, ఔరంగాబాద్, పుణె), మణిపూర్-1(ఇంఫాల్), మేఘాలయ-1(షిల్లాంగ్), మిజోరాం-1(ఐజ్వాల్), నాగాలాండ్-1(కోహిమా), ఒడిశా-2(భువనేశ్వ ర్, రూర్కేలా), పుదుచ్చేరి-1(ఔల్‌గరేట్), పంజాబ్-3(లుథియానా, జలందర్, అమృత్‌సర్), రాజస్తాన్-4(జైపూర్, ఉదయ్‌పూర్, కోటా, అజ్మీర్), సిక్కిం-1(నామ్చి), తమిళనాడు-12(తిరుచిరాపల్లి, తిరునల్వేలీ, దిండిగల్, తంజావూర్, తిరుప్పూర్, సేలం, వెల్లూ రు, కోయంబత్తూరు, మధురై, ఈరోడ్, తూతుకూడి, చెన్నై), తెలంగాణ-2(హైదరాబాద్, గ్రేటర్ వరంగల్), త్రిపుర-1(అగర్తలా), యూపీ-12(మొరాదాబాద్, అలీగ ఢ్, సహరన్‌పూర్, బరేలీ, ఝాన్సీ, కాన్పూ ర్, అలహాబాద్, లక్నో, వారణాసి, ఘాజి యాబాద్, ఆగ్రా, రాంపూర్), ఉత్తరాఖండ్-1(డెహ్రాడూన్), వెస్ట్‌బెంగాల్-4(న్యూటౌన్ కోల్‌కతా, బీధన్‌నగర్, దుర్గాపూర్, హల్దియా).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement