Central Minister Venkaiah Naidu
-
రాజకీయాలకు స్వర్ణభారత్ ట్రస్ట్‌లో స్థానం లేదు
-
రాష్ట్రంలో స్వర్ణభారత్ ట్రస్ట్
ప్రారంభించనున్న సీఎం కేసీఆర్ హైదరాబాద్: గ్రామీణ భారత సాధికారతే లక్ష్యంగా 15 ఏళ్లుగా స్వచ్ఛంద సేవా రంగంలో పనిచేస్తున్న ప్రభుత్వేతర సంస్థ స్వర్ణభారత్ ట్రస్ట్ తెలంగాణలో కార్యకలాపాలను ప్రారంభించనుంది. శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ గ్రామంలో ట్రస్ట్ హైదరాబాద్ చాప్టర్‌ను సోమవారం ఉదయం 10 గంటలకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పరీకర్ ముఖ్య అతిథిగా, కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ విశిష్ట అతిథిగా, జీఎంఆర్ గ్రూప్ చైర్మన్ గ్రంథి మల్లికార్జునరావు ఆత్మీయ అతిథిగా హాజరుకానున్నారు. గ్రామీణ ప్రజల జీవన పరిస్థితులను మెరుగుపరిచి విద్య, వైద్య సేవలు కల్పించడంతో పాటు ప్రతిభ, నైపుణ్య, స్వయం ఉపాధి, సాంకేతిక రంగాల్లో శిక్షణ అందించాలనే లక్ష్యంతో దశాబ్దంన్నర కిందట నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం గ్రామంలో స్వర్ణభారత్ ట్రస్ట్ కార్యకలాపాలను ప్రారంభించింది. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్ఫూర్తిగా ఆయన కుమార్తె దీపావెంకట్ నెలకొల్పిన ఈ ట్రస్ట్.. విజయవాడ చాప్టర్‌ను గతేడాది కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రారంభించారు. -
సాక్షాత్తు వెంకయ్యకే ఇలా జరిగితే..
న్యూఢిల్లీ: ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రివర్గంలోని సీనియర్ మంత్రుల్లో ఒకరు. ప్రధాని మోదీకి ఆప్తులు కూడా. ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన సమయాన్ని తగిన రీతిలో సద్వినియోగం చేసుకుంటారు. అలాంటిది ఓ అత్యవసర పని నిమిత్తం బయలుదేరిన ఆయనను ఎయిర్ ఇండియా తిప్పలుపెట్టింది. విమానం కోసం గంటంపావు సేపు ఎయిర్ పోర్టులో ఎదురు చూసిన ఆయన.. ఎంతకీ విమానం రాకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. విలువైన కాలాన్ని వృథా చేశారంటూ ఎయిర్ ఇండియా నిర్వహణా తీరుపై మండిపడ్డారు. వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం వెంకయ్య మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఎయిర్ ఇండియా 544 విమానంలో ఆయనకు సీటు కూడా ఖరారయింది. మధ్యాహ్నం 1:15 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉండగా, వెంకయ్య 12:20కే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. సరిగ్గా విమానం బయలుదేరాల్సిన కొద్ది నిమిషాల ముందు 'పైలట్ ఇంకా రాలేదని, మరి కొద్దిసేపు వేచిచూడాలని' అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చారు. అలా 1:45 వరకు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో వెంకయ్యనాయుడు తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఎయిర్ ఇండియా నిర్వాకాన్ని వివరిస్తూ వరుస ట్వీట్లు చేశారాయన. సర్వీసు ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని ఎయిర్ ఇండియాను డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పోటీకి అనుగుణంగా మారడంతోపాటు పారదర్శకత, జవాబుతారీతనం పెంపొందించుకోవాలని విమానయాన సంస్థకు హితవుపలికారు. విమానం ఆలస్యం కావడంవల్ల ఇంపార్టెంట్ అపాయింట్ మెంట్లు రద్దయ్యాయని చెప్పుకొచ్చారు. సాక్షాత్తు కేంద్ర మంత్రికే ఇలా జరిగితే.. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఏం సమాధానం చెబుతారో చూడాలిమరి! I had to travel to Hyderabad by Air India AI544 which is to depart at 1315 Hrs... was told on time.. reached airport by 1230 Hrs. 1/ — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 28 June 2016 was informed at 1315hrs that flight was delayed as d pilot had not yet come.Waited up to 1345 Hrs, boarding didn’t start.returned 2 home 2/ — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 28 June 2016 Air India should explain how such things are happening. Transparency and accountability are the need of the hour. 3/ — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 28 June 2016 Hope Air India understands that we are in the age of competition. Missed an important appointment.4 — M Venkaiah Naidu (@MVenkaiahNaidu) 28 June 2016 -
ఆక్రమణలతో నగరాలకు ముప్పు
- అప్రమత్తం కాకుంటే అన్ని సిటీలకూ చెన్నై తరహా ప్రమదం - కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హెచ్చరికలు - చెన్నైలోని ముంపు ప్రాంతాల సందర్శన, బాధితులకు పరామర్శ చెన్నై: పట్టణ ప్రాంతాల్లో మురుగు, వరద నీరు పారే నాలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని, అలాంటి ఆక్రమణల తొలగింపుపై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే అన్ని పట్టణాలకు ఇటీవలి చెన్నై విపత్తు తరహా ముప్పు తప్పదని హెచ్చరించారు. ఆదివారం చెన్నైలోని వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ తరపున బాధితులకు బియ్యం తదితర వస్తువులను పంపిణీ చేశారు. వరద ప్రాంతాల సందర్శన అనంతరం వెంకయ్య.. తమిళనాడు సీఎం జయలలితతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆక్రమణ వల్ల ఎంతటి అరిష్టం వాటిల్లుతుందో ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసి వచ్చిందన్నారు. ఈ దారుణ విపత్తు నుంచి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకోవాలని కోరారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు ఇటీవలే ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని, ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు. -
ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు మెరుగుపడాలి : వెంకయ్యనాయుడు
వెంకటాచలం (నెల్లూరు) : దేశంలో ప్రభుత్వ ఆస్పత్రుల పనితీరు ఎంతో మెరుగుపడాల్సి ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో ఎలుకలు కొరకడం వల్ల శిశువు మృతి చెందడం బాధాకరమని వ్యాఖ్యానించారు. ఆదివారం నెల్లూరు జిల్లా వెంకటాచలంలో స్వర్ణ భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశంలో వైద్యం వెనుకబడి ఉందన్నారు. ఆస్పత్రుల అభివృద్ధికి ప్రభుత్వాలు ముందుకు రావాలని కోరారు. కింది నుంచి పై స్థాయి వరకూ సమూలంగా మార్చాల్సి ఉందన్నారు. దేశంలో వైద్యుల కొరతను తీర్చేందుకు వైద్య కళాశాలల ఏర్పాటు నిబంధనలను సడలించినట్టు చెప్పారు. ముఖ్యంగా రైతుల ఆత్మహత్యలకు వైద్యం, విద్యా ఖర్చులు పెరిగిపోవడం కూడా ఒక కారణంగా పేర్కొన్నారు. -
హైదరాబాద్,వరంగల్ స్మార్ట్
ఏపీలోని తిరుపతి, కాకినాడ, విశాఖ కూడా.... * దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీల జాబితా వెల్లడించిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు * మొత్తం 98 సిటీలకు రూ. 48 వేల కోట్లు! సాక్షి, న్యూఢిల్లీ: స్మార్ట్‌సిటీస్ మిషన్ ద్వారా మూడు విడతల్లో 98 నగరాలను స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందుకు రానున్న ఐదేళ్లలో దాదాపు రూ.48 వేల కోట్లను వెచ్చించనున్నట్టు తెలిపింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు గురువారమిక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో.. స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయనున్న నగరాల జాబితాను వెల్లడించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి విశాఖపట్నం, తిరుపతి, కాకినాడకు, తెలంగాణ నుంచి గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ నగరాలకు చోటు దక్కింది. నగరాల జనాభా, నోటిఫై చేసిన నగరాల సంఖ్య ఆధారంగా రాష్ట్రాలకు స్మార్ట్‌సిటీలను కేటాయించారు. దీని ప్రకారం ఉత్తరప్రదేశ్‌కు గరిష్టంగా 13, తమిళనాడు 12, మహారాష్ట్ర 10, మధ్యప్రదేశ్ 7, గుజరాత్, కర్ణాటక 6 చొప్పున, ఆంధ్రప్రదేశ్, బిహార్ రాష్ట్రాలకు 3 చొప్పున కేటాయించారు. మిగిలిన రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఒకట్రెండు స్మార్ట్‌సిటీలను పొందాయి. ఎంపిక చేసిన 98 నగరాల్లో 8 నగరాలు (పనాజీ, డయ్యూ, శిలవస్సా, కవరట్టి, ధర్మశాల, న్యూటౌన్ కోల్‌కతా, పాసిఘాట్, నామ్చి) లక్ష లోపు జనాభా ఉన్నవే కావడం గమనార్హం! అలాగే 35 నగరాల్లో లక్ష నుంచి 5 లక్షల మధ్య జనాభా ఉంది. వీటిలో తిరుపతి, కాకినాడ ఉన్నాయి. 5-10 లక్షల మధ్య జనాభా కలిగిన 21 నగరాలు కూడా జాబితాలో ఉన్నాయి. ఇందులో వరంగల్ ఉంది. 10 నుంచి 25 లక్షల మధ్య జనాభా కలిగిన 25 నగరాల్లో విశాఖపట్నం ఉంది. 25 నుంచి 50 లక్షల జనాభా కలిగినవి 5 నగరాలున్నాయి. ఇక 50 లక్షల జనాభా కలిగిన వాటిలో 4 నగరాలు ఉన్నాయి. వాటిలో హైదరాబాద్ ఒకటి. స్మార్ట్‌సిటీలుగా ఎంపికైన 24 నగరాలు ఆయా రాష్ట్రాలకు రాజధానులుగా ఉన్నాయి. తొమ్మిది రాజధాని నగరాలు (ఈటానగర్, పట్నా, సిమ్లా, బెంగళూరు, డామన్, తిరువనంతపురం, పుదుచ్చేరి, గ్యాంగ్‌టక్, కోల్‌కతా) స్మార్ట్‌సిటీ జాబితాలో లేవు. ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు ఈ నగరాలను కాకుండా ఇతర ముఖ్య నగరాలను ప్రతిపాదించాయి. ఈ 98 నగరాల్లో 90 సిటీలు.. ‘అమృత్’ నగరాల జాబితాలో ఉన్నవే! ఉత్తరప్రదేశ్, జమ్మూకశ్మీర్ రాష్ట్రాల నుంచి ఇంకా చెరో నగరాన్ని స్మార్ట్‌సిటీలుగా ఎంపిక చేయాల్సి ఉంది. తెలంగాణ నుంచి రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌ను కూడా స్మార్ట్‌సిటీకి ప్రతిపాదించగా.. కేంద్రం పక్కనపెట్టింది. రాష్ట్రాలు కూడా అంతే మొత్తంలో.. కేంద్రం వెచ్చించే రూ.48 వేల కోట్లకు సమానంగా రాష్ట్రాలు, పురపాలక సంఘాలు కూడా వెచ్చించాల్సి ఉంటుంది. అంటే ఈ మొత్తం నిధులు రూ.96 వేల కోట్లు అవుతాయి. ఈ 98 నగరాల ఎంపిక ప్రక్రియలోని రెండో దశలో పోటీపడతాయి. అందులో తొలి 20 స్థానాల్లో ఉన్న నగరాలకు ఈ ఏడాది ఆర్థికసాయం అందుతుంది. తదుపరి ఆర్థిక సంవత్సరంలో మరో 40 నగరాలు, ఆ తర్వాతి ఆర్థిక సంవత్సరంలో మరో 40 నగరాలకు ఆర్థిక సాయం అందుతుందని వెంకయ్య నాయుడు తెలిపారు. తొలి సంవత్సరం ఒక్కో నగరానికి రూ.200 కోట్ల చొప్పున తదుపరి నాలుగేళ్లపాటు రూ.100 కోట్ల చొప్పున వెచ్చిస్తారు. స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా ఈ అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఈ స్పెషల్ పర్పస్ వెహికిల్ ఒక కంపెనీగా ఉంటుంది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, పురపాలక సంస్థ భాగస్వాములుగా ఉంటాయి. స్మార్ట్‌సిటీస్ మిషన్ ద్వారా నగరాలు అభివృద్ధి చెందడానికి కనీసం 5 నుంచి పదేళ్లు పడుతుందని మంత్రి వివరించారు. స్మార్ట్‌సిటీల జాబితా ఇదీ.. అండమాన్ నికోబార్-1 (పోర్టుబెయ్లిర్), ఆంధ్రప్రదేశ్-3(విశాఖ, తిరుపతి, కాకినాడ), అరుణాచల్ ప్రదేశ్-1(పాసీఘాట్), అస్సాం-1(గువాహటి), బీహార్-3(ముజఫర్‌పూర్, భాగల్పూర్, బీహార్షరీఫ్), చండీగఢ్-1(చండీగఢ్), ఛత్తీస్‌గఢ్-2(రాయ్‌పూర్, బిలాస్పూర్), డామన్ అండ్ డయ్యూ-1(డయ్యూ), దాద్రానగర్ హవేలీ-1(సిలవస్సా), ఢిల్లీ-1(న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సి ల్), గోవా-1(పనాజీ), గుజరాత్-6(గాంధీనగర్, అహ్మదాబాద్, సూరత్, వదోదరా, రాజ్‌కోట్, దాహోద్), హర్యానా-2(కర్నాల్, ఫరీదాబాద్), హిమాచల్‌ప్రదేశ్-1(ధర్మశా ల), జార్ఖండ్-1(రాంచీ), కర్ణాటక-6(మంగళూరు, బెలగావి, శివమొగ్గ, హుబ్బల్లి-దర్వాద్, తూమకూరు, దావనేగెరే), కేరళ-1(కోచి), లక్షద్వీప్-1(కవరత్తి), మధ్యప్రదేశ్-7(భోపాల్, ఇండోర్, జబల్పూర్, గ్వాలి యర్, సాగర్, సాత్నా, ఉజ్జయిని). మహారాష్ట్ర-10(నవీ ముంబై, నాసిక్, థానే, గ్రేటర్ ముంబై, అమరావతి, షోలాపూర్, నాగ్‌పూర్, కల్యాణ్ -డాంబివాలీ, ఔరంగాబాద్, పుణె), మణిపూర్-1(ఇంఫాల్), మేఘాలయ-1(షిల్లాంగ్), మిజోరాం-1(ఐజ్వాల్), నాగాలాండ్-1(కోహిమా), ఒడిశా-2(భువనేశ్వ ర్, రూర్కేలా), పుదుచ్చేరి-1(ఔల్గరేట్), పంజాబ్-3(లుథియానా, జలందర్, అమృత్సర్), రాజస్తాన్-4(జైపూర్, ఉదయ్‌పూర్, కోటా, అజ్మీర్), సిక్కిం-1(నామ్చి), తమిళనాడు-12(తిరుచిరాపల్లి, తిరునల్వేలీ, దిండిగల్, తంజావూర్, తిరుప్పూర్, సేలం, వెల్లూ రు, కోయంబత్తూరు, మధురై, ఈరోడ్, తూతుకూడి, చెన్నై), తెలంగాణ-2(హైదరాబాద్, గ్రేటర్ వరంగల్), త్రిపుర-1(అగర్తలా), యూపీ-12(మొరాదాబాద్, అలీగ ఢ్, సహరన్పూర్, బరేలీ, ఝాన్సీ, కాన్పూ ర్, అలహాబాద్, లక్నో, వారణాసి, ఘాజి యాబాద్, ఆగ్రా, రాంపూర్), ఉత్తరాఖండ్-1(డెహ్రాడూన్), వెస్ట్‌బెంగాల్-4(న్యూటౌన్ కోల్‌కతా, బీధన్నగర్, దుర్గాపూర్, హల్దియా). -
వెంకయ్యా.. దబాయింపు ఆపు
వామపక్షాలు సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదా హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న ప్రజల్ని, పార్టీల్ని దబాయింపుతో నోరు మూయించాలని చూడొద్దని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుకు వామపక్షాలు హితవు పలికాయి. వెంకయ్యనాయుడును ఈ రాష్ట్రం నుంచి పోటీ చేయమని తాము కోరడంలేదని.. గతంలో ఆయన పోటీకి దిగితే ఏం జరిగిందో ప్రజలకు గుర్తుందని మండిపడ్డాయి. ఈ మేరకు సీపీఐ, సీపీఎం రాష్ట్ర కమిటీలు గురువారం వేర్వేరు ప్రకటనలు చేశాయి. ‘ప్రత్యేక హోదా తెస్తామని, ఇస్తామని ఊరూరా సన్మానాలు చేయించుకున్న వెంకయ్య.. ఇప్పుడు దిష్టిబొమ్మలు దహనం చేస్తామంటే ఆక్రోశం వెల్లగక్కడం సమంజసమేనా’ అని ప్రశ్నించాయి. రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించారన్న ఆగ్రహంతోనే కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేశారని, అదే జాబితాలో చేరాలనుకుంటే బీజేపీ కూడా ఇచ్చిన మాటను విస్మరించవచ్చని హెచ్చరించాయి. -
స్మార్ట్ సిటీ జాబితాలో కర్నూలును చేర్చండి
♦ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేల భేటీ ♦ రెండోదశ జాబితాలో చేరుస్తామన్న కేంద్ర మంత్రి సాక్షి, కర్నూలు : రాజధానిని కోల్పోయి అన్ని విధాలా నష్టపోయి.. అభివృద్ధిలో రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన కర్నూలును కేంద్ర ప్రకటించిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు జాబితాలో చేర్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కర్నూలు ఎంపీ బుట్టారేణుక, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నివాసంలో ఎంపీతోపాటు ఎమ్మెల్యేలు మంగళవారం ఆయనతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా గతంలో ప్రకటించిన విధంగానే కర్నూలును స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చాలని వారు కేంద్రమంత్రి వెంకయ్యను కోరారు. అభివృద్ధిలో వెనుకబడిన కర్నూలు నగరం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుతోనైనా అభివృద్ధికి నోచుకుంటుందని వారు వివరించారు. ► కర్నూలు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని 2013లో రూ. 659 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రతిపాదించిన మంచినీటి పథకం అప్పట్లో వివిధ కారణాలతో ఆగిపోయింది. అదే పథకాన్ని ఇప్పుడు మంజూరు చేయాలని కోరారు. ► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ప్రతిపాదించిన నాలుగులేన్ల రహదారితో కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని.. ట్రాఫిక్ నియంత్రణ కోసం జాతీయ రహదారిని కలుపుతూ కర్నూలులో రూ. 90 కోట్ల అంచనాలతో 18 కిలోమీటర్ల పొడవైన ఇన్నర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు నిర్మాణానికి సాయం చేయాలని కోరారు. ► ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లో, గూడూరు నగర పంచాయతీలో నీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపడంతోపాటు భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టేందుకు కృషి చేయాలని ఎంపీ కోరారు. ► ఎంపీ, ఎమ్మెల్యే వినతిపై స్పందించిన వెంకయ్యనాయుడు రెండోదశలో స్మార్ట్‌సిటీ జాబితాలో కర్నూలు పేరును చేరుస్తామని, ఇక సమ్మర్‌స్టోరేజీ, ఇన్నర్ రింగ్‌రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులు తదితర ప్రతిపాదనలను తప్పుకుండా పరిశీలిస్తామన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో వైఎస్సార్సీపీ కేంద్రమండలి సభ్యులు హఫీజ్‌ఖాన్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ లాలిస్వామి, బుట్టా నీలకంఠం ఉన్నారు. ఆత్మకూరు ప్రజల తాగునీటి కష్టాలు తీర్చండి ఆత్మకూరు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కోరారు. వైఎస్ఆర్ హయాంలో వెలుగోడు రిజర్వాయర్ మంచినీటి ప్రాజెక్టు పథకం పనులు పెండింగ్‌లో ఉన్నందున ప్రజలకు తాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదని వివరించారు. ఆ ఈ పనులకు సుమారు రూ. 1.60 కోట్ల వ్యయం అవుతుందని అందుకు సహకరించాలని కోరారు. కేంద్ర మంత్రి వెంకయ్య స్పందిస్తూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
కదం తొక్కిన జనం
♦ ప్రత్యేక హోదా మన హక్కు అంటూ నినాదాలు ♦ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు ♦ వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు అరెస్ట్ ♦ మద్దతు ప్రకటించిన వైఎస్సార్ సీపీ ♦ జిల్లాలో బంద్ సంపూర్ణం సాక్షి, కడప, కడప అర్బన్ : ‘ప్రత్యేక హోదా కల్పిస్తామని రాష్ట్రం విడిపోయే ముందు నమ్మకంగా చెప్పారు. అధికారంలోకి రాగానే మాట తప్పారు. సాంకేతిక కారణాలు అడ్డు వస్తున్నాయంటూ కుంటి సాకులు చెబుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు చోద్యం చూస్తున్నారు తప్పించి గట్టిగా అడిగిన పాపాన పోలేదు. ప్రత్యేక హోదా మన హక్కు. దాని కోసం పోరాటం ప్రారంభమైంది. ఆ హక్కు సాధించేదాక ఆగము’ అంటూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు నినదించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో మంగళవారం రాష్ట్ర బంద్‌లో భాగంగా జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, పెట్రో బంకులు, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. పట్టణాల్లో దుకాణాలు సైతం స్వచ్ఛందంగా మూసి వేశారు. సీపీఐ నేతలు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలో, నియోజకవర్గం కేంద్రాల్లో ఉదయం నుంచే రోడ్లపైకొచ్చి బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బంద్‌కు వైఎస్ఆర్సీపీ మద్దతు ప్రకటించడంతో ఎక్కడికక్కడ శ్రేణులు ఉత్సాహంతో కదంతొక్కాయి. విద్యార్థులు సైతం స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహించారు. కడప నగరంలో తెల్లవారుజాము నుంచే సీపీఐ నేతలు రోడ్లపైకి వచ్చి బంద్ నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండు వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు, టైర్లను కాల్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. వాహనాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పోలీసులు, సీపీఐ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈశ్వరయ్య, నగర కార్యదర్శి వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్.నాగసుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షఫీ, జిల్లా అధ్యక్షుడు కరీముల్లా, కాంగ్రెస్ నేత జకరయ్య తదితరులతోపాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక పాలెంపల్లె నుంచి ఎద్దుల బండిలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను ఊరేగిస్తూ ఏడురోడ్ల వద్ద దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వన్‌టౌన్ పోలీసులు ప్రయత్నించినా దిష్టిబొమ్మను దగ్దం చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, డబ్ల్యు రాము, బీమరాజు తదితరులు పాల్గొన్నారు. జేకే యూత్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబుల ఫ్లెక్సీలను విచిత్ర వేషధారణలతో తయారు చేసి ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరులో డిపో ఎదుట ఆందోళన ప్రొద్దుటూరు పట్టణంలో ఆర్టీసీ బస్సులు బయటికి వెళ్లకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచే సీపీఐ నాయకులు రామయ్య, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొర్రె శ్రీనివాసులు తదితరుల ఆధ్వర్యంలో డిపో గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. బస్సులు బయటికి రాకుండా అడ్డకున్నారు. పట్టణంలో తిరుగుతూ దుకాణాలను మూసి వేయించారు. మధ్యాహ్న సమయంలో బస్సులను అడ్డుకుంటున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి పరామర్శించారు. బద్వేలులో అఖిలపక్ష నేతలు ర్యాలీ నిర్వహించినంతరం ధర్నా చేపట్టారు. కమలాపురంలో సీపీఐ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. పులివెందులలో బంద్ సంపూర్ణం పులివెందుల పట్టణంలో ఉదయం నుంచి బంద్ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలతోపాటు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. వైఎస్సార్సీపీ నాయకులు కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, రసూల్సాహెబ్, ఎర్రిపల్లె సర్వోత్తమరెడ్డి, విశ్వనాథరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పట్టణంలో బైకులపై తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. ప్రత్యేక హోదా.. ఆంధ్రా హక్కు అంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రాజంపేటలో సీపీఐ, సీఐటీయూ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాసులురెడ్డి మద్దతు తెలిపి వారితోపాటు ఆందోళనలో పాల్గొన్నారు. జమ్మలమడుగులో సీపీఐ నాయకులు, రాయచోటిలలో ఏఐఎస్ఎఫ్ నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. మైదుకూరులో ఉదయమే సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడంతో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు. ఆర్టీసీకి రూ.46 లక్షలు నష్టం బంద్ సందర్భంగా జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో మంగళవారం 666 బస్సులకుగాను 462 బస్సులు మాత్రమే నడిపామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందువల్ల జిల్లాలో రూ.46 లక్షలు నష్టం వచ్చిందన్నారు. నడిచిన బస్సుల్లో ప్రయాణీకుల సంఖ్య పెద్దగా లేదు. అద్దె బస్సులు రోడ్డెక్కలేదు. మధ్యాహ్నం నుంచి ఒకటి, అర బస్సులను నడిపారు. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిత్తూరుకు వెళ్తున్న బస్సు అద్దాలు పగులగొట్టారు. కృష్ణా సర్కిల్లో ఆందోళనకారులు సుమో అద్దాన్ని పగులగొట్టారు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం : ఈశ్వరయ్య ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కడప నగరంలో బంద్‌ను పర్యవేక్షిస్తూ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర పునర్విభజన బిల్లులోని అన్ని అంశాలు అమలు చేసే సత్తా, అనుభవం తమకే ఉందని అటు నరేంద్రమోదీ, ఇటు చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నమ్మించి ఓట్లు దండుకుని అందలం ఎక్కగానే ప్రత్యేక హోదా కుదరదని చెప్పడం దారుణమన్నారు. కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా వచ్చేసిందని చంద్రబాబుతో కలిసి సన్మానాలు కూడా చేయించుకున్నారన్నారు. మరోమంత్రి సుజనాచౌదరి వచ్చే సమావేశాల్లో ప్రత్యేక హోదా సాధించి తీరుతామని పదేపదే పలికి నేడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తుంటే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ తన చుట్టూ ఉన్న వ్యక్తుల వ్యాపార ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు. -
మా విజయాలను కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది
అందుకే పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటోంది: వెంకయ్య సాక్షి, బెంగళూరు: కేంద్రంలోని తమ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు అడిగే అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నా పార్లమెంటు కార్యకలాపాలను జరగనివ్వకూడదనే ఆలోచనతోనే కాంగ్రెస్ నేతలు సమావేశాలను అడ్డుకుంటున్నారని శనివారమిక్కడ విలేకర్లతో అన్నారు. లలిత్‌మోదీ అంశంతోపాటు వ్యాపం తదితర అంశాలపై చర్చకు కాంగ్రెస్ నోటీస్ కూడా ఇచ్చిందని, అయితే సమావేశాలు ప్రారంభమైన తర్వాత మాత్రం చర్చ జరగనివ్వలేదని అన్నారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను కాంగ్రెస్ నేతలు ‘క్రిమినల్’గా పేర్కొనడంపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఒక సెంటు భూమినీ ప్రభుత్వం సేకరించకుండా అడ్డుపడతానన్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై వెంకయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు కనీస పరిహారం ఇవ్వకుండా 10 లక్షల ఎకరాలు సేకరించారన్నారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ బెంగళూరు గుండానే వెళ్లారని, కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు ఆయనకు కనిపించలేదా అని ప్రశ్నించారు. -
ఢిల్లీలో పీవీ స్మారక ఘాట్ సిద్ధం
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు ఆయన చనిపోయిన పదేళ్ల తరువాత దేశరాజధానిలో ఒక స్మారక చిహ్నం సిద్ధమైంది. తన సొంతపార్టీ , సొంత ప్రభుత్వమే ఆయన్ను దూరం చేయడంతో మిగతా రాష్ట్రపతులు, ప్రధానులు దక్కించుకున్న గౌరవానికి నోచుకోని పీవీకి ఏక్తాస్థల్ వద్ద రాష్ట్రీయ స్మృతి ప్రాంగణంలో సమాధి ఆకారంలో ఘాట్ నిర్మాణ పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. దీర్ఘకాలంగా ఈ విషయంలో జరిగిన నిర్లక్ష్యం తరువాత ఇటీవలే కేంద్ర కేబినెట్ పీవీ స్మారక ఘాట్ నిర్మించాలని నిర్ణయించిందని, జూన్ 28, 2015న పీవీ 94వ జయంతి నాటికి సిద్ధమైందని, చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని ఆయన వెల్లడించారు. పీవీ స్మారక ఘాట్ వద్ద పీవీ సేవలను కొనియాడుతూ రాసిన వ్యాఖ్యలను ఆయన ఈ ప్రకటనలో వెల్లడించారు. ‘అపార మేధోసంపన్నుడైన ప్రధానమంత్రిగా సుపరిచితులైన పి.వి.నరసింహారావు జూన్ 28, 1921న తెలంగాణలోని వరంగల్లు జిల్లాలో గల లక్నేపల్లి గ్రామంలో జన్మించారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాడి స్వాతంత్య్ర సమరయోధుడిగా నిలిచారు. ఒక సంస్కర్త, విద్యావేత్త, మేధావి, 15 భాషలు తెలిసిన వ్యక్తిగా సుపరిచితులు. 1962 నుంచి 1971 వరకు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో బృహస్పతి(తెలివైన వ్యక్తి)గా పేరొందినవారు. దేశంలో 1972లోనే భూసంస్కరణలు అమలు చేసిన తొలి ముఖ్యమంత్రి ఈయన. 1980-89 మధ్య కేంద్ర కేబినెట్లో సభ్యుడిగా ఉన్న పీవీ నరసింహారావు పలు శాఖల బాధ్యతలు నిర్వర్తించి చెరగని ముద్ర వేశారు. భారత ప్రధానిగా ఆయన ఆర్థిక సంస్కరణలకు తెర తీసి మెరుగైన ఆర్థిక భారతావనికి పునాదులు వేశారు. పరిపాలనలో చెరగని గురుతులు వేసిన పి.వి.నరసింహారావు 2004 డిసెంబర్ 23న పరమపదించారు. ఆర్కిటెక్ట్ ఆఫ్ వైబ్రంట్ ఇండియాగా ఆయన గుర్తుండిపోతారు..’ అని అక్కడి శిలాఫలకంలో రాశారు.ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన శిలాఫలకం -
మాటలకే పరిమితమైన హామీ
♦ మూడు నెలలు గడుస్తున్నా ఖరారు కాని స్థలసేకరణ ♦ వెద్యశాల ఏర్పాటుపై కేంద్ర మంత్రి, రాష్ర్ట మంత్రి చెరొక మాట ♦ ఉదయగిరికి 50 పడకల ఆస్పత్రి అందని ద్రాక్షేనా? ఉదయగిరి: ‘‘ఉదయగిరి నాకు రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతం.. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోవడమే నా ప్రధాన విధి. ఈ ప్రాంతానికి ఏదో చేయాలని నా తపన. మాటలు చెప్పడం నాకు చేతకాదు.. పనిచేయడానికే ప్రాధాన్యమిస్తా. ఏడాదిలోపు 50 పడకల ఆస్పత్రిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతా’’ అంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఫిబ్రవరి 8న ఆస్పత్రి శంకుస్థాపన సభలో హామీ ఇచ్చారు. నేడు ఈ మాటలు నీటి మూటలేనని తేటతెల్లమైంది. శంకుస్థాపన చేసి మూడు నెలలు గడుస్తున్నా స్థల సేకరణ విషయంలో స్పష్టత రాలేదు. మొదటిగా గండిపాళెం రోడ్డులో వైద్యశాల కోసం శంకుస్థాపన చేశారు.. నెల తర్వాత ఆస్పత్రి ఇక్కడ నిర్మించడం లేదంటూ స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్మిస్తున్నామని స్వయానా వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. ‘ఉదయగిరిలో సరైన వైద్యసదుపాయాలు లేవు. ఏ చిన్న ప్రమాదం జరిగినా మెరుగైన వైద్యసదుపాయాలకు నెల్లూరు, కడపకు వెళ్లాల్సిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉదయగిరిలో వంద పడకల ఆస్పత్రిని నిర్మిస్తాం’ అని ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు హామీ ఇచ్చారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలిసి నాబార్డు ద్వారా ఆస్పత్రికి రూ. 6.3 కోట్లు నిధులు మంజూరు చేయించారు. కానీ అదికాస్తా 50 పడకల ఆస్పత్రిగా మారింది. ఇప్పటి వరకూ స్థల సేకరణపైనే అధికారులు సరైన నిర్ణయం తీసుకోలేదు, టెండర్లనూ ఆలస్యంగా ప్రారంభించారు.. మరి ఏడాదిలోపు ఆస్పత్రిని ఎలా నిర్మిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం స్థల సేకరణలో స్పష్టతనిచ్చి, టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి 50 పడకల ఆస్పత్రిని త్వరగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు. -
మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు విజయవాడ : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఆర్థికంగా సుసంపన్నులు కా వాలని, అందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ గేట్‌వేలో శనివారం ఎమర్జింగ్ గ్లోబల్ బిజినెస్‌లో ఎంటర్ ప్రెనియర్స్‌కు ఉన్న అవకాశాలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్ప్రెనియర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (అలీప్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహిళా పారిశ్రామిక వేత్తలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ మహిళలు వృత్తి నైపుణ్యాలను పెంచుకుని అక్కడే చిన్న పరిశ్రమలను స్థాపించాలని ఆయన సూచించారు. నేడు యువత గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఆగాలంటే గ్రామాల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. అమ్మాయి పుడితే చిరునవ్వుతో స్వాగతించాలని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అబ్బాయిలకంటే అమ్మాయిలే బాగా చూసుకుంటారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన అలీప్ అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ అలీప్ ఆధ్వర్యంలో మహిళలకు చేతివృత్తుల్లో నైపుణ్యాలను పెంపొం దించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఒక పాలసీని రూపొందించాలని కోరారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గద్దే అనురాధ, అలీప్ సెక్రటరీ పద్మజాప్రభాకర్, సీఎస్ రామలక్ష్మి, డాక్టర్ హెచ్.పురుషోత్తం పాల్గొన్నారు. అనంతరం వివిధ అంశాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు. -
నేడు చంద్రబాబు, వెంకయ్య రాక
గుడివాడ : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు శనివారం గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు విచ్చేయనున్నారు. ఈ మేరకు డివిజనల్ పౌర సంబంధాల శాఖ అధికారి శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ప్రముఖ పారిశ్రామికవేత్త, మెయిల్ అధినేత పీపీ రెడ్డి నిర్మించిన శ్రీవెంకటేశ్వరస్వామి దేవస్థానాన్ని వీరు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం 3.55 గంటలకు గన్నవరం చేరుకుంటారని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 4.15 గంటలకు డోకిపర్రుకు చేరుకుంటారని తెలిపారు. 5.15 గంటలకు తిరుగు ప్రయాణమై రాజమండ్రి వెళతారని వివరించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రత్యేక విమానంలో శనివారం ఉదయం 7.45 గంటలకు గన్నవరం చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో 8.15 గంటలకు డోకిపర్రు చేరుకుంటారని తెలిపారు. ఉదయం 10 గంటలకు విజయవాడలోని ఈఎస్ఐసీ సబ్ రీజనల్ నూతన భవనాన్ని ప్రారంభించి 11 గంటల నుంచి 12 వరకు ఆంధ్ర లయోలా కాలేజీలో జరిగే ఎమర్జింగ్ గ్లోబల్ ఆపర్చునిటీస్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కాన్ఫరెన్స్‌లో పాల్గొంటారని వివరించారు. అనంతరం 12 గంటలకు బయలుదేరి నెల్లూరు వెళతారని పేర్కొన్నారు. -
నరేంద్రమోదీ ఆత్మగా వెంకయ్య
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే నారాయణ సూళ్లూరుపేట : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మగా కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే నారాయణ ఆరోపించారు. గురువారం సాయంత్రం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రాకపోవడానికి ఈ ఇద్దరు నాయుళ్లే కారణమన్నారు. వీరిద్దరికీ చిత్తశుద్ధి ఉంటే టీడీపీ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలన్నారు. అదేవిధంగా వెంకయ్యనాయుడు తన మంత్రి పదవిని వదులుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోడీ భిక్షాందేహి అని అడుక్కుంటూ రాష్ట్ర ప్రజలను సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో సుమారు గంటపాటు మాట్లాడిన వెంకయ్య నాయుడుకు పదవి రాగానే నోరు పడిపోయిందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అంటిపెట్టుకుని ఉన్న చంద్రబాబునాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆనాడు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ కాపాడితే ఇప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారన్నారు. అందుకే ప్రత్యేక హోదా కోసం సీపీఐ పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పారు. వీరిద్దరిలో ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే తాము చేసే పోరాటానికి మద్దతివ్వాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మతోన్మాద పరిపాలన చేస్తున్నారని, చివరకు న్యాయవ్యవస్థను సైతం శాసిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు నుంచి బయటకు వస్తే ఆమెను ప్రధానమంత్రి అభినందించడం చూస్తుంటే ఆయన న్యాయవ్యవస్థను ఏ విధంగా శాసిస్తున్నారో అర్థమవుతుందన్నారు. స్థానిక నాయకులు మోదుగుల పార్థసారథి, రమణయ్య, ఆనంద్, సుధాకర్ పాల్గొన్నారు. -
వెంకయ్యనాయుడును కలిసిన తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు
బంజారాహిల్స్ (హైదరాబాద్) : కేంద్రప్రభుత్వం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ప్రత్యేక హైకోర్టులను ఏర్పాటు చేయకపోవడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని తెలంగాణ అడ్వకేట్ జేఏసీ నేతలు శనివారం బంజారాహిల్స్‌లో కేంద్రమంత్రి వెంకయ్యనాయుడును కలసి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని వెంటనే విభజించే విషయంలో సహకరించాలని ఆయనను కోరారు. స్పందించిన వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాలలో ప్రత్యేక న్యాయస్థానాల అంశాలను తాను పార్లమెంట్లో లేవనెత్తనున్నట్లు వివరించారు. ఒక వైపు పార్లమెంట్లో ఈ విషయం చర్చకు వస్తుండగా మళ్లీ తన ఇంటికి రావడమేమిటని ఆయన ప్రశ్నించారు. మంత్రిని కలసిన వారిలో అడ్వకేట్ జేఏసీ నాయకులు గోవర్థన్‌రెడ్డి, బద్దం నరసింహారెడ్డి, సీహెచ్ ఉపేంద్ర, దేవరాజ్, కె.గోవర్ధన్‌రెడ్డి, సదానంద్ ఉన్నారు. -
బీజేపీని సర్వవ్యాప్తం చేయాలి
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు నరసరావుపేటవెస్ట్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ-ఎన్డీఏ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేసి పార్టీని సర్వవ్యాప్తం చేయాలని కేంద్ర పట్టణాభివృద్ది, పార్లమెంటరీ వ్యవహారాలశాఖామంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని జమిందారు ఫంక్షన్‌హాలులో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు పోట్రు పూర్ణచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. గతంలో బీజేపీ ఉత్తరాదిపార్టీగా చెప్పుకునేవారని, ఇప్పుడు దక్షణాది రాష్ట్రాలకు విస్తరించిందని చెప్పారు. కర్ణాటకలో 18 ఎంపీలు, ఏపీలో ఇద్దరు, తెలంగాణాలో ఒకరు ఉన్నారన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నాబార్డు సహాయంతో రాష్ట్రానికి విడుదలైన రూ.384కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16కోట్లు కలిపి మొత్తం రూ.400కోట్లతో రాష్ట్రంలో 139 పాత, కొత్త వైద్యశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 6500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు. ఐఐటీ, ఏఐఎంఎంఎస్ లాంటి అత్యున్నత సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటుచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రాష్ట్ర క్రమశిక్షణ సంఘ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, రాష్ట్ర నాయకులు యడ్లపాటి రఘునాథబాబు, బీజేపీ జోనల్ ఇన్చార్జి ఆల్.లక్ష్మీపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వల్లెపు కృపారావు, అసెంబ్లీ నేత డాక్టర్ నలబోతు వెంకటరావు, కో ఆప్షన్ సభ్యుడు ఇత్తడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిమ్స్ 2 ఏళ్ళల్లో పూర్తి
14న శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి జె.పి.నడ్డా వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు శానిటోరియంలో ఏర్పాట్ల పరిశీలన మంగళగిరి : ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్) ఆస్పత్రి నిర్మాణం మరో రెండేళ్లలో పూర్తవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఎయిమ్స్ నిర్మించనున్న శానిటోరియంలో శంకుస్థాపన కోసం చేపట్టిన ఏర్పాట్లను మంత్రి ప్రత్తిపాటి ఆదివారం పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి హాజరవుతారని పేర్కొన్నారు. వారి రాకకోసం హెలిప్యాడ్, బహిరంగ సభాస్థలం, పార్కింగ్ సౌకర్యాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎయిమ్స్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపాదికన పూర్తి చేసి రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు. ఎయిమ్స్ వంటి సంస్థ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, వైద్య విద్య అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఎయిమ్స్‌కు కేంద్ర ప్రభుత్వం అడిగిన మేరకు 193 ఎకరాల భూమిని అందజేస్తామని, అందుకు శానిటోరియంలో కొనసాగుతున్న ఎన్డీఆర్ఎఫ్ను తరలించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎన్డీఆర్ఎఫ్ను రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు. అన్ని సంస్థలు రాజధాని ప్రాంతంలోనే ఉండాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమతమని, అందుకు అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ వంటి మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ శ్రీధర్,ఆర్డీవో భాస్కరనాయుడు, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్టత్రిపాఠి, ఏపీఎంఎస్ఐడీసీ ఈఈ అశోక్‌కుమార్, డీఎంహెచ్‌వో పద్మజారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ సంతోషరావు, ఆర్ అండ్ బీ డీఈ మహేష్‌రెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మిలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు. -
వైద్యం అందుబాటులోకి తెస్తాం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు మద్దిపాడు : రాష్ట్రంలో ప్రతిపేదవానికి వైద్యం అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. మద్దిపాడు రిమ్స్ రూరల్ హెల్త్ సెంటర్‌ను రిమ్స్ గ్రామీణ వైద్య శిక్షణ కేంద్రంగా మార్చేందుకు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో తాము వైద్యశాఖకు రూ.340 కోట్లు నాబార్డ్ ద్వారా సాధించగలిగామని ఆయన తెలిపారు. అందులో నుంచి రూ.32 కోట్లు ప్రకాశం జిల్లాకే కేటాయించామన్నారు. రాష్ట్రంలో 1400 మంది వైద్యులను ఉద్యోగాలలో తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని, ప్రతి ఉద్యోగం మెరిట్ ద్వారా పారదర్శకంగా భర్తీ చేస్తామన్నారు. వైద్యశాలల పరంగా చూస్తే ప్రస్తుతం రాష్ట్రం చాలా తక్కువ స్థానంలో ఉందని అంతా ప్రక్షాళన చేయటానికి కంకణం కట్టుకున్నామని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మద్దిపాడు హెల్త్‌సెంటర్‌కు 4 కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తమ నియోజకవర్గంలోని చీమకుర్తి పీహెచ్‌సీని సీహెచ్‌సీగా మార్చారు కానీ స్పెషలిస్టు వైద్యులు లేరని స్పెషలిస్టులను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చీమకుర్తి హాస్పటల్లో ఎక్స్‌రే మిషన్ కావాల్సిఉందన్నారు. నాగులుప్పలపాడు మండలం పోతవరంలో పీహెచ్సీ బిల్డింగ్ మంజూరైనా ఇంతవరకూ దానిని ప్రారంభించలేదన్నారు. మద్దిపాడు మండలంలో మొత్తం 9 సబ్‌సెంటర్లు ఉండగా రెండుమాత్రమే భవనాలు ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అన్ని భవనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. గత ఏడాది ఒంగోలు పరిసర ప్రాంతప్రజలు డెంగీతో బాధలు అనుభవించారని, వారందరూ ప్లేట్లెట్లు పడిపోవటంతో గుంటూరు, విజయవాడ, హైదరాబాదులకు పరుగులు తీశారని అన్నారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో ప్లేట్లెట్ మిషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను మంత్రికి వివరించారు. అదేవిధంగా వైద్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని ఆయన మంత్రిని కోరారు. వైద్యశాఖలో 2001 నుంచి దశలవారీగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబధ్ధీకరించాలని రాష్ట్ర పారామెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రత్నాకర్ మంత్రి కామినేనికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో రోడ్డు రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, మద్దిపాడు ఎంపీపీ నారా విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు మొనపాటి చినవీరాంజమ్మ, మద్దిపాడు ఎంపీటీసీ సభ్యుడు పాటిబండ్ల చినరామయ్య, మద్దిపాడు సర్పంచ్ ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరాం, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, రిమ్స్ డైరక్టర్ అంజయ్య, డీయంహెచ్ఓ యాస్మిన్, మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు. -
అందరి సహకారంతో జిల్లా అభివృద్ధి
► పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ► నెల్లూరు నెక్ట్స్ మేధోమథన సదస్సుకు నెల్లూరుకు చెందిన 300మంది ప్రముఖులతోపాటు మంత్రులు హాజరు ► స్వదేశీ దర్శన్ కింద జిల్లాకు రూ.100 కోట్లు మంజూరు చేయిస్తా నెల్లూరు(బారకాసు) : జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పర్యాటక కేంద్రంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు అందరి సహకారం అవసరమని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. స్వర్ణభారత్‌ట్రస్ట్ ఆధ్వర్యంలో శనివారం స్థానిక కనుపర్తిపాడులోని వీపీఆర్ కన్వెన్షన్ హాల్లో ‘నెల్లూరు నెక్ట్స్’ మేధోమథన సదస్సు నిర్వహించారు. ఈసదస్సులో ఆయన ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడారు. నెల్లూరు జిల్లా అంటేనే దేశ వ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. ప్రత్యేక ఆర్థిక మండళ్ల ఏర్పాటుతో నెల్లూరు రూపురేఖలు మారనున్నాయని చెప్పారు. దుగ్గరాజపట్నం పోర్టుకూడా త్వరలో ఏర్పాటు కానుందని ఇందుకు ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నిల్ కూడా వచ్చిందన్నారు. నెల్లూరు నగరంలో నెలకొన్న ప్రధాన సమస్యలైన అండర్‌గ్రౌండ్ డ్రైనేజ్, మంచినీటి సదుపాయాలను ఏర్పాటు చేసేందుకు రూ.వెయ్యికోట్లు హడ్కో నిధులు మంజూరయ్యాయన్నారు. నెల్లూరు చెరువును సుందరీకరణ చేసి ఆప్రాంతంలో ప్రముఖుల విగ్రహాలు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నట్లు చెప్పారు. తూపిలిపాళెంలో సముద్ర అధ్యయన కేంద్ర ఏర్పాటుకు సీఎం చేతుల మీదుగా శనివారం శంఖుస్థాపన చేశామన్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ సహాయక మంత్రి డాక్టర్ మహేష్ శర్మ మాట్లాడుతూ దేశాన్ని పర్యాటక కేంద్రంగా మార్చేందుకు ప్రధానమంత్రి మోదీ, కేంద్ర మంత్రి వెంకయ్య సారధ్యంలో ముందుకు వెళ్తున్నామన్నారు. సహజ పర్యాటక కేంద్రాలకు భారతదేశం నెలవుగా ఉందన్నారు. నెల్లూరు జిల్లాలో పర్యాటకేంద్రాలను తీర్చిదిద్దేందుకు ‘స్వదేశీ దర్శన్’ కింద కేంద్రం నుంచి రూ.100కోట్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రి వైఎస్ చౌదరి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందచేస్తానన్నారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ మాట్లాడుతూ నెల్లూరు అభివృద్ధికి ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం ఉంటే సరిపోదని చిన్న చిన్న ఆలోచనలు కూడా ముఖ్యమన్నారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త జీవీకే మాట్లాడుతూ జిల్లాకు చెందిన ప్రముఖులు ఎందరో ఉన్నారని వారంతా జిల్లా అభివృద్ధికి తగిన సూచనలు, సలహాలు అందజేస్తే నెల్లూరు నెక్ట్స్ కాకుండా ది నెల్లూరు బెస్ట్‌గా నెంబర్‌వన్‌గా ఉంటుందని ఆకాంక్షించారు. ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నియమ నిబంధనలు పాటిస్తే జిల్లా అభివృద్ది చెందేందుకు ఎంతో సమయం పట్టదన్నారు. కలెక్టర్ జానకి మాట్లాడుతూ జిల్లాకు సంబంధించిన అన్ని విషయాలను గణాంకాలతో వివరించారు. కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ జేసీ ఇంతియాజ్ కార్పొరేషన్ పరిధిలోని పలువిషయాలను వివరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాను అభివృద్ధిచేసే విషయంలో సహకారం అందిస్తామన్నారు. ఎంపీ టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి రాజ్యసభ నుంచి ఏడాదికి రూ.2 కోట్లు ఆర్థిక సహాయం అందచేస్తామన్నారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వెలగపల్లి వరప్రసాద్,మంత్రులు కామినేని శ్రీనివాస్, బొజ్జలగోపాలకృష్ణారెడ్డి, దీపావెంకట్ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, మేయర్ అబ్దుల్అజీజ్, డిప్యూటీమేయర్ ద్వారకానాథ్, సెల్కాన్ ఎండీ గురుస్వామి నాయుడు పాల్గొన్నారు. -
సాహసశిఖరమా.. వీడ్కోలు
► అశ్రునయనాల మధ్య మస్తాన్‌బాబు అంతిమయాత్ర ► ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు ► మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు, స్నేహితులు హాజరు ► అభిమానులతో కిక్కిరిసిన ఖనన ప్రాంతం సంగం : అశ్రునయనాల మధ్య, ప్రభుత్వ లాంచనాలతో పర్వతారోహకుడు మల్లి మస్తాన్‌బాబు అంత్యక్రియలు శనివారం మండలంలోని గాంధీజనసంఘంలో ఘనంగా జరిగాయి. భారీగా తరలివచ్చిన అభిమానులు, స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు ఆయనకు తుదివీడ్కోలు పలికారు. ఏడు ఖండాల్లోని ఏడు పర్వతాలెక్కి గిన్నీస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిన మల్లి మస్తాన్‌బాబు ఆండీస్ పర్వతరోహణకు వెళ్లి అదృశ్యమై శుక్రవారం నాటికి నెల రోజులైంది. అదృశ్యమైనా నాటి నుంచి మస్తాన్‌బాబు జాడ కోసం తోటి పర్వతారోహకులతో పాటు అర్జెంటీనా, చిలీ, భారతదేశం తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూసింది. అల్పోష్ణస్థితి కారణంతోనే మస్తాన్‌బాబు శిఖరానికి 800 మీటర్ల ఎత్తులో గుడారంలో మృతిచెందాడన్న వార్తవిని ప్రపంచమంతా ఒక్కసారిగా శోకసంద్రంలోకి మునిగిం ది. గుండెలవిసేలా రోదించిన మస్తాన్‌బాబు త ల్లి సుబ్బమ్మతో పాటు విదేశీయురాలు నాన్సీ, సోదరి, సోదరులను ఓదార్చడం ఎవరితరం కాలేదు. చివరిచూపును చూడాలన్న మస్తాన్‌బాబు తల్లి సుబ్బమ్మ కోరిక మేరకు మృతదేహం శుక్రవారం నాటికి (సరిగ్గా నెల రోజులకు) స్వగ్రామానికి చేరింది. సాహస శిఖరానికి అర్జెంటీనా, చిలీ దేశాలు, తోటి పర్వతారోహకులు తుది వీడ్కోలును పలికి భారతదేశానికి మృతదేహాన్ని తరలించారు. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో పాటు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, రాష్ట్రమంత్రులు పొంగూరు నారాయణ, రావెల కిషోర్‌బాబు, పల్లె రఘునాథ్‌రెడ్డి, కామినేని శ్రీనివాసరావు, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, ఎమ్మెల్యేలు మేకపాటి గౌతంరెడ్డి, కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, కిలివేటి సంజీవయ్య చేరుకుని మస్తాన్ బాబు మృతదేహానికి నివాళులర్పించారు. కలెక్టర్ జానకితో పాటు ఎస్పీ గజరావు భూపాల్ మస్తాన్‌బాబు అంత్యక్రియలకు సంబంధించి ముందు నుంచే సిబ్బందికి సూచనలిస్తూ, వారు స్వయంగా పర్యవేక్షిస్తూ వచ్చారు. కార్యక్రమంలో ఉప మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేటర్ నాయకులు రూప్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విష్ణువర్థన్‌రెడ్డి, కర్నాటి ఆంజనేయరెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, డీసీసీ అధ్యక్షుడు ధనుంజయరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు దేవసహాయం, ఎంపీపీ కామాక్షమ్మ, సర్పంచ్ మానికల సుజాత, కన్నబాబు, బుజిరెడ్డి, మెట్టుకూరు వాసుదేవరెడ్డి, సూరి మదన్‌మోహన్‌రెడ్డి, మల్లికార్జున్ రెడ్డి, రఘునాధ్‌రెడ్డి పాల్గొన్నారు. పర్వతారోహణను ప్రోత్సహించాలి పర్వతారోహణను ప్రోత్సహించాలని ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. మస్తాన్‌బాబుకు శ్రద్ధాంజలి ఘటించిన అనంతరం ఆయన మాట్లాడారు. పర్వతారోహణ కూడా ఒక క్రీడలాంటిదేనని, పర్వతారోహణను, పర్వతారోహకులను కూడా ప్రోత్సహించాలని ఆయన అన్నారు. ఏడు ఖండాల్లోని ఏడు ఎత్తై శిఖరాలను 172 రోజుల్లోనే అధిరోహించి గిన్నీస్‌బుక్ రికార్డు నెలకొల్పి తొలి భారతీయుడిగా నిలిచిన మల్లి మస్తాన్‌బాబు నాడు గుర్తించకపోవడం బాధాకరమన్నారు. మట్టిలో మాణిక్యం మస్తాన్‌బాబు మట్టిలో మాణిక్యం మల్లి మస్తాన్‌బాబు అని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. మస్తాన్‌బాబు అంత్యక్రియల్లో ఆయన మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మస్తాన్‌బాబుకు తగిన గుర్తింపు ఇవ్వాలన్నారు. తనది పక్కగ్రామమైన పడమటి పాళెంమని, ఎదురుగా ఉన్న గ్రామంలోని ఓ వ్యక్తి ప్రపంచస్థాయికి ఎదగడం ఆనందంగా ఉందని తెలిపారు. భావితరాలకు స్ఫూర్తి మస్తాన్‌బాబు మల్లి మస్తాన్‌బాబు జీవితం భావితరాలకు స్ఫూర్తి అని సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. ప్రచారంపైనే దృష్టి పెట్టే రోజుల్లో దేశ ఖ్యాతికోసమే పాటుపడిన వ్యక్తి మస్తాన్‌బాబు అని అన్నారు. అసామాన్య ప్రతిభను చాటి, సామాన్యుడిగా ఉన్న ప్రతిభాశాలి అన్నారు. సింహపురి ఆణిముత్యం మస్తాన్‌బాబు అన్నారు. ఖండాతరాలకు దేశ ఖ్యాతిని చాటాడు ఏడు ఖండాల్లోని ఏడు పర్వతాలను ఎక్కి భారతదేశ కీర్తిని ఖండాతరాలకు చాటిన ధీరుడు మస్తాన్‌బాబు అని నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్ యాదవ్ అన్నారు. మస్తాన్‌బాబు జీవించి ఉన్నంతవరకు ప్రభుత్వం గుర్తించకపోవడం శోచనీయమన్నారు. ఆండీస్ పర్వతారోహణతో దేశఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటాలన్న లక్ష్యంతో పర్వతారోహణ చేశాడన్నారు. ప్రకృతి అనుకూలించ మృతిచెందడం బాధాకరమన్నారు. మస్తాన్‌బాబు మృతి తీరని లోటని ఆయన తెలిపారు. -
కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
గవర్నర్‌కు అధికారాలపై నిరసనల వెల్లువ అసెంబ్లీ ఎదుట నేతల దిష్టిబొమ్మలు దహనం చేసిన లాయర్ల జేఎసీ హైదరాబాద్: సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం హైదరాబాద్‌పై గవర్నర్‌కు విశేష అధికారాలు కట్టబెడుతోందని తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ విమర్శించింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం నాంపల్లిలోని అసెంబ్లీ ఎదురుగా ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది. ఈ సందర్భంగా జేఏసీ కో కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణకూడా అంతర్భాగమని ప్రధాని గుర్తించాలన్నారు. ఆ పాలన వెనక్కి తీసుకోవాలి: సీపీఎం కేంద్రం అప్రజాస్వామిక పద్ధతుల్లో తీసుకున్న గవర్నర్ పాలన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు సలహాలతో తెలంగాణపై కేంద్రం నిర్ణయాలు చేయడం అత్యంత అప్రజాస్వామికమని ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. హక్కులను హరించడమే..: సీపీఐ గవర్నర్‌కు అధికారాలు అప్పగిస్తూ జారీచేసిన మార్గదర్శకాలు తెలంగాణ ప్రభుత్వ హక్కులను హరించేలా, అభ్యంతరకరంగా ఉందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఇది ప్రభుత్వం చేతులు,కాళ్లు కట్టివేయడమేనన్నారు. ‘నాయుడుల’ కుట్రే: కోదండరాం మెదక్: గవర్నర్‌కు హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాల అప్పగింత వెనక చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడుల కుట్ర ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. శనివారం మెదక్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బాబుది నీచ మనస్తత్వం: హరీశ్ సంగారెడ్డి (మెదక్): గవర్నర్‌కు హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాల అప్పగింత వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్ర దాగి ఉందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పక్కవారు చెడిపోవాలనే నీచ మనస్తత్వం చంద్రబాబుదని ఆరోపించారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో విలేకరులతో మాట్లాడారు. లోపాలను కప్పిపుచ్చుతున్న సీఎం: పొన్నం శాంతి,భద్రతల విషయంలో గవర్నర్‌కు అధికారాలను అప్పగించారన్న ముసుగులో.. సీఎం కేసీఆర్ తన లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌కు అధికారాల నెపంతో సీఎం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చిన్నచిన్న అంశాలపై గిల్లికజ్జాలు సరికాదన్నారు. గవర్నర్ జోక్యంతో గందరగోళం : వీహెచ్ రోజువారీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటే.. ప్రజల్లో గందరగోళం ఏర్పడి, ప్రశాంత వాతావరణం దె బ్బతింటుందని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సీఎం ఉండగా మళ్లీ శాంతిభద్రతల అంశం గవర్నర్‌కు కట్టబెడితే, సీఎం, హోంమంత్రి ఏం చేయాలని ప్రశ్నించారు. ఉద్యమిస్తాం: వేణుగోపాలాచారి బెల్లంపల్లి (అదిలాబాద్): గవర్నర్‌కు కేంద్రం అధికారాలను కట్టబెడితే ఉద్యమం చేపడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి హెచ్చరిం చారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో విలేకరులతో మాట్లాడారు. బాబు చేతిలో మోడీ కీలుబొమ్మ: ఈటెల జమ్మికుంట (కరీంనగర్): ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలుబొమ్మగా మారారని, కేంద్రం ఆధిపత్య ధోరణి కొనసాగిస్తే మరో ఉద్యమం తప్పదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది సరికాదు: జోగు రామన్న గోదావరిఖని (కరీంనగర్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీసీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారిందని, అందుకే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎంపీ కడియం వరంగల్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎంపీ కడియం శ్రీహరి విమర్శించారు. శనివారం ఆయన హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేంద్రం అడ్డంకులు సష్టిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు. కీలుబొమ్మగా మోడీ!: దేశపతి ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల చేతిలో కీలుబొమ్మగా మారారని, వారిద్దరు ఏం చెబితే మోడీ అదే చేస్తున్నారని తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడం ఇందులో భాగమేనని ఆరోపించారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం మోడీ పేరు నరేంద్రనాయుడుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు. రేపు ధర్నాలు, ర్యాలీలు.. హైదరాబాద్‌పై ఆంక్షలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాల్లో సోమవారం (ఈ నెల 11న) నిరసన ధర్నాలను, ర్యాలీలను నిర్వహించాలని టీయూడబ్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లం నారాయణ, క్రాంతి ఒక ప్రకటనలో కోరారు. హైదరాబాద్‌పై ఆంక్షలను పెడుతూ, గవర్నర్‌కు అధికారాలను అప్పగించడం ప్రజాస్వామిక హక్కులకు భంగమన్నారు. కేంద్రం పెత్తనాన్ని సహించం చందంపేట(నల్లగొండ): గవర్నర్‌కు విశేష అధికారాలను కట్టబెట్టడాన్ని హోంమంత్రినాయిని నర్సింహారెడ్డి ఖండిం చారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర సాగుతోందని, కేంద్రం పెత్తనాన్ని సహించమన్నారు. నల్లగొండ జిల్లా చందంపేటలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల సీఎంలను ఏకం చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. -
విడిపోయినా సహకరించుకోవాలి: వెంకయ్య
హైదరాబాద్: ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, కొత్త ప్రభుత్వానికి కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు. తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికీ సోదరులుగా ఒకరికొకరు సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. అన్ని విధాలా కేంద్రం నుంచి సహాయ సహకారాలు అందించడానికి మోడీ నాయకత్వంలో ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.