
మాటలకే పరిమితమైన హామీ
♦ మూడు నెలలు గడుస్తున్నా ఖరారు కాని స్థలసేకరణ
♦ వెద్యశాల ఏర్పాటుపై కేంద్ర మంత్రి, రాష్ర్ట మంత్రి చెరొక మాట
♦ ఉదయగిరికి 50 పడకల ఆస్పత్రి అందని ద్రాక్షేనా?
ఉదయగిరి: ‘‘ఉదయగిరి నాకు రాజకీయ జన్మనిచ్చిన ప్రాంతం.. ఇక్కడి ప్రజల రుణం తీర్చుకోవడమే నా ప్రధాన విధి. ఈ ప్రాంతానికి ఏదో చేయాలని నా తపన. మాటలు చెప్పడం నాకు చేతకాదు.. పనిచేయడానికే ప్రాధాన్యమిస్తా. ఏడాదిలోపు 50 పడకల ఆస్పత్రిని పూర్తిచేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతా’’ అంటూ కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ఫిబ్రవరి 8న ఆస్పత్రి శంకుస్థాపన సభలో హామీ ఇచ్చారు. నేడు ఈ మాటలు నీటి మూటలేనని తేటతెల్లమైంది. శంకుస్థాపన చేసి మూడు నెలలు గడుస్తున్నా స్థల సేకరణ విషయంలో స్పష్టత రాలేదు.
మొదటిగా గండిపాళెం రోడ్డులో వైద్యశాల కోసం శంకుస్థాపన చేశారు.. నెల తర్వాత ఆస్పత్రి ఇక్కడ నిర్మించడం లేదంటూ స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రంలో నిర్మిస్తున్నామని స్వయానా వైద్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రకటించారు. ‘ఉదయగిరిలో సరైన వైద్యసదుపాయాలు లేవు. ఏ చిన్న ప్రమాదం జరిగినా మెరుగైన వైద్యసదుపాయాలకు నెల్లూరు, కడపకు వెళ్లాల్సిందే. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఉదయగిరిలో వంద పడకల ఆస్పత్రిని నిర్మిస్తాం’ అని ఎమ్మెల్యే బొల్లినేని వెంకటరామారావు హామీ ఇచ్చారు.
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడితో కలిసి నాబార్డు ద్వారా ఆస్పత్రికి రూ. 6.3 కోట్లు నిధులు మంజూరు చేయించారు. కానీ అదికాస్తా 50 పడకల ఆస్పత్రిగా మారింది. ఇప్పటి వరకూ స్థల సేకరణపైనే అధికారులు సరైన నిర్ణయం తీసుకోలేదు, టెండర్లనూ ఆలస్యంగా ప్రారంభించారు.. మరి ఏడాదిలోపు ఆస్పత్రిని ఎలా నిర్మిస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం స్థల సేకరణలో స్పష్టతనిచ్చి, టెండర్ల ప్రక్రియ పూర్తిచేసి 50 పడకల ఆస్పత్రిని త్వరగా నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.