14న శంకుస్థాపన చేయనున్న కేంద్ర మంత్రి జె.పి.నడ్డా
వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు
శానిటోరియంలో ఏర్పాట్ల పరిశీలన
మంగళగిరి : ప్రతిష్టాత్మక ఆల్ ఇండియా మెడికల్ సెన్సైస్(ఎయిమ్స్) ఆస్పత్రి నిర్మాణం మరో రెండేళ్లలో పూర్తవుతుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు చెప్పారు. ఈ నెల 14వ తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి జె.పి.నడ్డా ఆస్పత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. ఎయిమ్స్ నిర్మించనున్న శానిటోరియంలో శంకుస్థాపన కోసం చేపట్టిన ఏర్పాట్లను మంత్రి ప్రత్తిపాటి ఆదివారం పరిశీలించారు.
అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో పాటు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అశోక్ గజపతిరాజు, సుజనాచౌదరి హాజరవుతారని పేర్కొన్నారు. వారి రాకకోసం హెలిప్యాడ్, బహిరంగ సభాస్థలం, పార్కింగ్ సౌకర్యాలకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఎయిమ్స్ నిర్మాణాన్ని యుద్ధప్రాతిపాదికన పూర్తి చేసి రెండు సంవత్సరాల్లో అందుబాటులోకి తెస్తామని చెప్పారు.
ఎయిమ్స్ వంటి సంస్థ ఏర్పాటుతో రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు, వైద్య విద్య అందుబాటులోకి వస్తాయని వివరించారు. ఎయిమ్స్‌కు కేంద్ర ప్రభుత్వం అడిగిన మేరకు 193 ఎకరాల భూమిని అందజేస్తామని, అందుకు శానిటోరియంలో కొనసాగుతున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ను తరలించాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఎన్డీఆర్‌ఎఫ్‌ను రాజధాని ప్రాంతంలోనే ఏర్పాటు చేసేవిధంగా చర్యలు తీసుకుంటామని వివరించారు.
అన్ని సంస్థలు రాజధాని ప్రాంతంలోనే ఉండాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు అభిమతమని, అందుకు అనుగుణంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, ఎయిమ్స్ వంటి మరిన్ని ప్రతిష్టాత్మక సంస్థలను ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీకాంత్, కలెక్టర్ కాంతిలాల్‌దండే, జేసీ శ్రీధర్,ఆర్డీవో భాస్కరనాయుడు, అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్టత్రిపాఠి, ఏపీఎంఎస్‌ఐడీసీ ఈఈ అశోక్‌కుమార్, డీఎంహెచ్‌వో పద్మజారాణి, విద్యుత్ శాఖ ఎస్‌ఈ సంతోషరావు, ఆర్ అండ్ బీ డీఈ మహేష్‌రెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మిలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు, ఆప్కో చైర్మన్ మురుగుడు హనుమంతరావు తదితరులు పాల్గొన్నారు.
ఎయిమ్స్ 2 ఏళ్ళల్లో పూర్తి
Published Mon, May 11 2015 4:48 AM | Last Updated on Sun, Sep 3 2017 1:48 AM
Advertisement