సమీక్షల షో
►కస్టమ్ మిల్లింగ్‌లో అక్రమాలపై సర్కారు తీరిది
►రూ.68 కోట్లుబకాయిపడిన 23 మంది మిల్లర్లు
►రెండేళ్లుగా చర్యలు శూన్యం
►మంత్రి మారటంతో మిల్లుల తనిఖీలు,
►కేసుల నమోదుకు ఆదేశాలు
నెల్లూరు : ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బియ్యాన్ని దొడ్డిదారిన అమ్మేసుకుని ఖజానాకు తూట్లు పొడిచిన అక్రమార్కులపై చర్యలు తీసుకునే విషయంలో సర్కారు మీనమేషాలు లెక్కిస్తోంది. సమీక్షల పేరిట హడావుడి చేస్తూ.. తెరవెనుక నుంచి అక్రమార్కులకు ఆశీస్సులు అందజేస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పర్యటన సాగింది. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నాలుగు నియోజకవర్గాలో పర్యటించిన ఆయన రెండుచోట్ల శాఖాపరమైన సమీక్షలు నిర్వహించారు. కొన్ని మిల్లులను తనిఖీ చేశారు. కస్టమ్ మిల్లింగ్ కోసం ఇచ్చిన బియ్యాన్ని (సీఎంఆర్) అమ్మేసుకున్న మిల్లర్లపై కేసులు నమోదు చేసి నెల రోజుల్లో ఆ సొమ్ము రికవరీ చేయాలని ఆదేశించారు. ఖజానాకు గండికొడితే ఉపేక్షించేది లేదని ప్రకటించి వెళ్లారు. ప్రతిసారి ఇలాగే ‘షో’ నిర్వహించటం మినహా ఎలాంటి ప్రయోజనం లేకపోతోంది.
ఏటా ఇదే తంతు
కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని (సీఎంఆర్) బహిరంగ మార్కెట్‌లో విక్రయించి సొమ్ము చేసుకున్న మిల్లర్ల విషయంలో ఏటా ఇదే తంతు నడుస్తోంది. జిల్లాలో 23 మంది మిల్లర్లు సుమారు రూ.68 కోట్ల విలువైన ధాన్యాన్ని మిల్లింగ్ చేసి.. బియ్యాన్ని అమ్మేసుకున్నారు. వారినుంచి సొమ్మును రికవరీ చేసే పేరిట ఏటా నాలుగుసార్లు సమీక్షలు నిర్వహించడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. మిల్లర్ల వెనుక అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నేతలు ఉండటంతో మంత్రి హడావుడి చేసి వెళ్లడం.. ఆనక లాబీయింగ్‌తో చర్యలు నిలుపుదల చేయించుకుని కాలం గడపటం పరిపాటిగా మారింది.
నిధుల స్వాహా సాగుతోందిలా
జిల్లాలో సుమారు 300 రైస్ మిల్లులు ఉండగా, వాటిలో 250 మిల్లులు పూర్తిస్థాయిలో నడుస్తున్నాయి. రెండేళ్ల నుంచి ధాన్యం కొనుగోళ్లలో ఆంక్షలు లేకపోవటం, జిల్లాలో ధాన్యం దిగుబడి తక్కువగా ఉండటంతో ఇక్కడి మిల్లర్లు ఒడిశా, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాలతోపాటు కృష్ణా, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇదిలావుంటే.. ప్రభుత్వం ఐకేపీ కేం ద్రాల ద్వారా రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని బియ్యం ఆడే నిమిత్తం కస్టమ్ మిల్లింగ్ పేరిట మిల్లర్లకు అప్పగిస్తోంది. బియ్యం ఆడినందుకు వారికి కమీషన్ చెల్లిస్తోంది. 2014–15 ఆర్థిక సంవత్సరంలో జిల్లాలో రూ.3.65 కోట్ల విలువైన 17.70 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ చేసిన మిల్లర్లు.. ఆ బియ్యాన్ని తిరిగి ప్రభుత్వానికి ఇవ్వకుండా బహిరంగ మార్కెట్‌లో దర్జాగా అమ్మేసుకున్నారు. 2015–16 ఆర్థిక సంవత్సరంలో రూ.40.90 కోట్ల విలువైన 18,907 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కస్టమ్ మిల్లింగ్ పేరిట తీసుకున్న మిల్లర్లు స్వాహా చేశారు. దీనికి సంబంధించి 23 మంది మిల్లర్లు వడ్డీలు, జరిమానాలతో కలిపి రూ.68 కోట్లను ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.
మంత్రులు మారినా..
గతంలో పౌర సరఫరాల శాఖ మంత్రిగా వ్యవహరించిన పరిటాల సునీత అనేక మార్లు జిల్లాలో పర్యటించి.. ప్రభుత్వ బియ్యాన్ని బొక్కిన మిల్లర్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తాజాగా గురువారం అదే శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు జిల్లాలో పర్యటించారు. రెండు మిల్లుల్ని సీజ్ చేసి, నెలలోగా రెవెన్యూ రికవరీ యాక్ట్ ద్వారా ఆస్తులను జప్తు చేయాలని ఆదేశించారు. గతంలోనూ కొందరిపై రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద కేసులు నమోదు చేసినా ఎలాంటి పురోగతి లేదు. అధికార పార్టీ నేతలు లాబీయింగ్ నిర్వహించడం వల్లే ఈ పరిస్థితి తలెత్తుతోందన్న విమర్శలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. కొందరు మిల్లర్ల నుంచి సొమ్ములు దండుకుని వారిపై చర్యలు తీసుకోకుండా నిలుపుదల చేయిస్తున్నారు. మొత్తం మీద మంత్రి పర్యటన పరోక్షంగా అధికార పార్టీ నేతలకు కాసులు కురిపించేందుకు దోహదపడుతుందనే విమర్శ వినిపిస్తోంది.