‘నయీం’ సినిమా షురూ | Bharath parepalli new movie on Nayeem life story | Sakshi
Sakshi News home page

‘నయీం’ సినిమా షురూ

Published Mon, Sep 19 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 2:08 PM

నయీం(ఫైల్ ఫొటో)

నయీం(ఫైల్ ఫొటో)

- అమరావతిలో క్లాప్ కొట్టిన మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు

తుళ్లూరు రూరల్‌ (గుంటూరు): గ్యాంగ్స్టర్ నయీం జీవితకథ ఆధారంగా రూపుదిద్దుకుంటున్న సినిమా పట్టాలెక్కింది. అమరావతిలోని మందడం గ్రామంలోగల శ్రీవేణుగోపాలస్వామి ఆలయంలో ఏపీ మంత్రి ప్రతిపాటి పుల్లారావు క్లాప్ కొట్టి సినిమా షూటింగ్ ను ప్రారంభించారు. గుంటూరు కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ స్విచాన్‌ చేశారు. ప్రముఖ దర్శకుడు భరత్ పారేపల్లి రూపొందిస్తున్న ఈ సినిమాకు 'ఖయీం భాయ్' అనే టైటిల్ ను ఖరారుచేశారు. పి. వెంకట్ రెడ్డి, ఎ. ప్రభాకర్‌రెడ్డిలు ఈ సినిమా నిర్మాతలు.

మందడం గ్రామానికి చెందిన కట్టా రాంబాబు అనే నటుడు 'ఖయీం భాయ్' టైటిల్ రోల్ ను పోషిస్తున్నారు. ఈ సినిమాలో నయీం పేరును రాంబోగా పిలుస్తారు. ముహుర్తం షాట్ గా.. గణేష్‌ విగ్రహం ఎదుట నయీం కేరక్టర్‌ అయిన రాంబాబు కొబ్బరికాయ కొట్టి నృత్యం చేసే దృశ్యాలను చిత్రీకరించారు. బెంగళూరుకు చెందిన మౌని ఈ సినిమాలో హీరోయిన్. ముమైత్ ఖాన్, తనికెళ్ల భరిణి, ఎల్బీ శ్రీరాం, బెనర్జీ, రాం జగన్, ఫిష్‌ వెంకట్, శివ సత్యనారాయణ, హేమ, ప్రగతి, జ్యోతి తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

'ఖయీం భాయ్'కి మాటలు గోపి మోహన్, సంగీతం శేఖర్‌ చంద్ర అందిస్తుండగా కెమెరామెన్ గా శ్రీధర్‌నార్ల, మేకప్‌ సూర్యచంద్ర, కాస్ట్యూమ్‌ వలి, కో–డైరెక్టర్‌ పీవీ రమేష్‌రెడ్డి, ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్స్‌ క్రిష్ణారెడ్డి, జేవీ నారాయణరావులు వ్యవహరిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలియజేశారు. కాగా, ఈ సినిమా ఎక్కువ భాగం ఏపీ రాజధాని ప్రాంతంలో, కీలకమైన కొన్ని సన్నివేశాలను హైదరాబాద్‌లోని పాతబస్తీ, విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నట్లు నిర్మాతలు తెలిపారు.

ఇదిలాఉంటే, దిగ్గజ దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం నయీం కథ ఆధారంగా మూడు సినిమాలను తీస్తానని గతంలో ప్రకటించారు. అయితే షూటింగ్ ప్రారంభించిన వివరాలేవీ వెల్లడించలేదు. ఇంతలోనే 'ఖయీం భాయ్' సెట్స్ పైకి రావడం, గోపీ మోహన్ లాంటి పేరున్న రచయిత మాటలు, భరత్ డైరెక్షన్ వహిస్తుండటంతో ఈ సినిమాపై అప్పుడే చర్చ మొదలైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement