‘ మాండ్ర ’ అక్రమాలకు అడ్డుకట్ట వేయండి
‘ మాండ్ర ’ అక్రమాలకు అడ్డుకట్ట వేయండి
Published Tue, Jun 13 2017 10:17 PM | Last Updated on Tue, Aug 28 2018 8:41 PM
కర్నూలు (న్యూసిటీ): నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ మాండ్ర శివానందరెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నియోజవకర్గ ప్రజలు డిమాండ్ చేశారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు, ప్రజలు మంగళవారం కర్నూలు తరలివచ్చి నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాలో గ్యాంగ్‌స్టర్ నయూమ్ బినామీ శివానందరెడ్డి అంటు ఫ్లెక్సీలు, ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ ధర్నాకు నియోజకవర్గానికి చెందిన తువ్వా మల్లారెడ్డి, స్వామిరెడ్డి, చట్టా మురళీ, షరీఫ్, రమేష్‌నాయుడు తదితరులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక మాఫియాలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా, శివానందరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీస్ అధికారులను బెదిరించి ఇద్దరు వ్యక్తులను విడిపించుకున్నారన్నారు.
నిరుపేదలకు పింఛన్లు మంజూరు చేయించేందుకు కూడా రూ.10 వేలు లంచాలు తీసుకుంటున్నారని విమర్శించారు. గృహాలు, ఇతరత్రా సంక్షేమ పథకాలన్ని తన కనుసన్నల్లోనే నడవాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. మాండ్ర అక్రమాలను నిలువరించి నిజాయితీగా పని చేస్తున్న అధికారులకు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాల నాయకులు కళ్యాణ్, కే వెంకటరమణ, బన్నూరు చంద్రారెడ్డి, బీ రామాంజనేయులు, బాల వెంకటరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రమేష్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్–2 ఎస్ రామస్వామిని కలిసి వారు వినతి పత్రాన్ని అందించారు. ఆతర్వాత ఎస్పీ ఆకే రవికృష్ణను కలసి వినతి పత్రం అందజేశారు.
Advertisement