mandra shivananda reddy
-
గౌరు వర్సెస్ మాండ్ర: బావా బామ్మర్దుల మధ్య పెరిగిన దూరం
బావబామ్మర్దులైన గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య దూరం పెరిగిందా? టీడీపీ అధిష్టానం మాండ్రను పూర్తిగా పక్కన పెట్టిందా? మాండ్ర కారణంగా తాను రాజకీయంగా నష్టపోయానని గౌరు తన బావ, సోదరితో వాదనకు దిగారా? మాండ్ర జిల్లా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉండిపోయారా? ఇటీవల జరిగిన పరిణామాలను పరిశీలిస్తే ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం వస్తోంది. గౌరు వెంకటరెడ్డి, మాండ్ర శివానందరెడ్డి మధ్య మాటలు లేవని, దూరం పెరిగిందని వారి సన్నిహితులే బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, కర్నూలు విభేదాలకు ఇదీ కారణం.. టీడీపీ నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడిగా కొన్ని నెలల క్రితం గౌరు వెంకటరెడ్డిని ఆ పార్టీ నియమించింది. ఈ నియామకంపై టీడీపీ తరఫున నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన మాండ్ర శివానందరెడ్డికి అధిష్టానం మాటమాత్రం కూడా చెప్పలేదు. దీంతో పార్టీలో తనకు ప్రాధాన్యత లేదని మాండ్ర గమనించారు. గత నెల 18న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ గడివేముల మండలం పెసరవాయి గ్రామానికి రాగా.. మాండ్ర గైర్హాజరయ్యారు. పైగా గౌరు ఇంటికి కూడా వెళ్లడం మానేశారు. ఇటీవల మాండ్ర, గౌరు కుటుంబాల మధ్య వాదులాట కూడా జరిగినట్లు తెలుస్తోంది. మాండ్ర వైఖరితో తీవ్రంగా నష్టపోయామనే భావనలో గౌరు మాండ్ర శివానందరెడ్డి డీఎస్పీగా ఉంటూ 2014 ఎన్నికల సమయంలో వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వచ్చారు. 2014 ఎన్నికల వరకూ వైఎస్సార్సీపీ మద్దతుదారుడిగా కొనసాగారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరి, నందికొట్కూరు ఇన్చార్జ్గా పనిచేశారు. దీంతో బావబామ్మర్దులు అధికార, విపక్షపార్టీలో కొనసాగారు. అయితే పార్టీలు వేరైనా ఇద్దరూ సయోధ్యతో రాజకీయాలు నడిపారు. ఇదే గౌరు వెంకటరెడ్డికి మైనస్‌గా మారింది. 2017లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తనను అభ్యర్థిగా టీడీపీ ప్రకటిస్తోందని గౌరుతో మాండ్ర చెప్పారు. స్థానిక సంస్థలలో వైఎస్సార్సీపీకి మెజార్టీ సభ్యులు ఉన్నారు. దీంతో ఆ పార్టీ గౌరు వెంకటరెడ్డిని బరిలోకి దించాలని భావించింది. అయితే ఉన్న పరిస్థితుల్లో ఆర్థికంగా బలంగా లేమని, టీడీపీ ప్రలోభాలతో ఫలితం వ్యతిరేకంగా ఉండే ప్రమాదముందని వైఎస్సార్సీపీ అభ్యర్థి బరిలో లేకుండా ఉండే ప్రయత్నం గౌరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మాండ్రను కాకుండా కేఈ ప్రభాకర్‌ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా టీడీపీ అధిష్టానం ప్రకటించింది. దీంతో తాను పోటీ చేస్తానని గౌరు ముందుకొచ్చారు. అప్పటికే ఎన్నికల్లో పోటీ చేయకూడదని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. ఈ విషయంలో గౌరు రాజకీయ విలువలకు పాతరేసి బావకు సహకరించారని అప్పట్లో తీవ్ర చర్చ నడిచింది. ఇదే గౌరు రాజకీయ పతనానికి నాంది పలికింది. ఆపై వైఎస్సార్సీపీలో టిక్కెట్ దక్కకపోవడంతో మాండ్ర సూచనలతో టీడీపీలో చేరారు. పాణ్యం నుంచి గౌరు చరిత పోటీ చేసి ఓడిపోయారు. మరోవైపు నంద్యాల ఎంపీగా పోటీ చేసి మాండ్ర పరాజయం పొందారు. పరస్పరం మాటల యుద్ధం ‘మీ మాటలు విని రాజకీయంగా నష్టపోయా. పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి, ఇప్పుడు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఆ రోజు మీరు ఒత్తిడి చేయకపోయి ఉంటే నా రాజకీయ భవిష్యత్ మరోలా ఉండేది. మీరు నన్ను నాశనం చేశారు?’ అని గౌరు ఆగ్రహం వెలిబుచ్చినట్లు తెలుస్తోంది. దీనికి మాండ్ర, అలాగే గౌరు సోదరి కూడా తీవ్రంగా స్పందించినట్లు తెలుస్తోంది. ‘రాజకీయంగా నీ ఎదుగుదల కోసం అన్ని విధాలా ఎంతో సాయం చేశాం. అవి మరిచి మాపైనే నిందలు మోపుతావా?’ అని గట్టిగా నిలదీసినట్లు తెలుస్తోంది. ఇరు కుటుంబాల వాదోపవాదనల నేపథ్యంలో మాండ్ర పూర్తిగా నంద్యాల పార్లమెంట్ నియోజకవర్గానికి దూరమయ్యారు. హైదరాబాద్ నుంచి కర్నూలుకు రాని పరిస్థితి. చివరకు నారా లోకేశ్ వచ్చినా గైర్హాజరయ్యారంటే పరిస్థితి ఏంటో తెలుస్తోంది. మాండ్ర విషయాన్ని టీడీపీ తేలిగ్గా తీసుకున్నట్లు తెలుస్తోంది. పోయిన విశ్వసనీయతను తెచ్చుకోవాలంటే మాండ్రకు దూరంగా రాజకీయాలు చేయాలని, తిరిగి ఆయన ప్రలోభాలలో ఉంటే మరింత నష్టపోతాననే యోచనలో గౌరు ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా గౌరు, మాండ్ర వ్యవహారం జిల్లాలో చర్చనీయాంశమైంది. -
మృగాళ్లకు మాండ్ర శివానందరెడ్డి అండ ..
సాక్షి, కర్నూలు సిటీ : బాధితుల పక్షాన నిలవాల్సిన పాలకులు.. నిందితులకే వత్తాసు పలుకుతున్నారు. అభం శుభం తెలియని గిరిజన బాలికపై లైంగిక దాడికి పాల్పడడమే కాకుండా మృతికి కారణమైన వారిని కాపాడుతున్నారు. పోలీసులపై సైతం ఒత్తిళ్లు తెచ్చి కేసును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. చివరకు బాధితులు కోర్టును ఆశ్రయించడంతో న్యాయస్థానం ఆదేశాల మేరకు కేసు సీఐడీకి బదిలీ అయ్యింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు నగర శివారులోని లక్ష్మీగార్డెన్‌లో ఉంటున్న ఎస్.రాజు నాయక్, ఎస్.పార్వతిదేవి దంపతుల కుమార్తె సుగాలి ప్రీతి(14) దిన్నెదేవరపాడు వద్దనున్న టీడీపీ నేత వి.జనార్దన్‌రెడ్డికి చెందిన కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్లో పదో తరగతి చదివేది. 2017 ఆగస్టు 19న ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు స్కూల్ యాజమాన్యం చిత్రీకరించింది. అయితే.. తమ కుమార్తె ఉరి వేసుకుని చనిపోలేదని, స్కూల్ అధినేత కొడుకులు బలవంతంగా రేప్ చేసి చంపేశారని తల్లిదండ్రులు ఆరోపించారు. కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో పోస్టుమార్టం చేసిన డాక్టర్ శంకర్ (అసోసియేట్ ప్రొఫెసర్) 20 ఆగస్టు 2017న ఇచ్చిన ప్రాథమిక రిపోర్ట్‌లో సైతం అమ్మాయిని రేప్ చేసినట్లు నిర్ధా«రించారు. పెథాలజీ హెచ్ఓడీ డాక్టర్ జి.బాలేశ్వరి సైతం ఇదే విషయాన్ని నిర్ధారిస్తూ 21 ఆగస్టు 2017న నివేదిక ఇచ్చారు. దీంతో ప్రీతి తల్లిదండ్రులు తాలూకా పోలీసు స్టేషన్లో కట్టమంచి స్కూల్ అధినేత వి.జనార్దన్‌రెడ్డి, కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిలపై ఫిర్యాదు చేశారు. నిందితులపై పోలీసులు సెక్షన్ 302, 201, ఫోక్స్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. సంఘటనపై విచారణకు కలెక్టర్ ముందుగా త్రి సభ్య కమిటీని, ఆ తరువాత ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించారు. విద్యార్థినిపై లైంగిక దాడి చేసి..హత్య చేశారని ఈ కమిటీ కూడా నివేదిక ఇచ్చింది. మృగాళ్లకు అండగా టీడీపీ నేతలు! ప్రీతి చదువులో అందరి కంటే ముందు ఉండేది. ఐఏఎస్ కావాలని లక్ష్యంగా పెట్టుకొని చదివేది. స్కూల్లో 2017 ఆగస్టు 19న ఉదయం నిర్జీవంగా పడివుంది. మీ అమ్మాయికి ఆరోగ్యం బాగోలేదని యాజమాన్యం ముందుగా సమాచారం ఇచ్చింది. అయితే..తల్లిదండ్రులు అక్కడికి పోయేసరికి నిర్జీవంగా పడివున్న కుమార్తెను చూసి గుండెలవిసేలా విలపించారు. అమ్మాయి శరీరంపై ఉన్న గాయాలను, అక్కడి దృశ్యాన్ని చూసి వారికి అనుమానం వచ్చింది. తమ బిడ్డను రేప్ చేసి చంపారంటూ అదే రోజు కలెక్టరేట్ దగ్గర ఆందోళనకు దిగారు. పోస్టుమార్టంలో సైతం ఇదే విషయం తేలింది. అయితే.. నిందితులను ప్రస్తుతం టీడీపీ తరఫున నంద్యాల ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాండ్ర శివానందరెడ్డి అప్పట్లో తన ఇంట్లోనే పెట్టుకొని కాపాడారు. అధికార బలంతో పోలీసులపై ఒత్తిళ్లు తెచ్చి.. కేసును సైతం పక్కదోవ పట్టించారు. తద్వారా నిందితులు అరెస్టయిన 23 రోజులకే బెయిల్ వచ్చేలా చేశారు. ఈ కేసును నీరుగార్చేందుకు మాండ్రతో పాటు టీడీపీ నేత గౌరు వెంకటరెడ్డి కూడా అడుగడుగునా ప్రయత్నించారని బాలికల తల్లిదండ్రులు వాపోతున్నారు. కేసును విచారించిన పోలీసులు పోస్టుమార్టం సమయంలో సేకరించిన వాటిని హైదరాబాదులోని ఫొరెన్సిక్ సైన్స్ ల్యాబ్‌కు పంపారు. రేప్లో ఎంత మంది పాల్గొన్నారో నిర్ధారించేందుకు టెస్ట్‌లు చేయించారు. అయితే..ఈ ప్రక్రియను ఉద్దేశపూర్వకంగానే ఆలస్యం చేయించినట్లు విమర్శలున్నాయి. ఇదిలావుండగా.. కేసు విచారణకు పోస్టుమార్టం చేసిన వైద్యులు సహకరించడం లేదని డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ)కు పోలీసులు లేఖ రాశారు. దీంతో ముగ్గురు సభ్యుల నిపుణుల కమిటీని నియమించాలని డీఎంఈ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్‌కు ఆదేశాలిచ్చింది. కమిటీ ఏర్పాటయ్యేలోపు ఫొరెన్సిక్ హెచ్ఓడీ ఇందులో జోక్యం చేసుకుంటూ తనను కూడా మెంబర్‌గా తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లాకు చెందిన వైద్యులు డాక్టర్ నీరజారెడ్డి, డా.షంషాద్ బేగంను సభ్యులుగా నియమిస్తూ, ఫొరెన్సిక్ హెచ్ఓడీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అయితే, సదరు హెచ్ఓడీ మాత్రం విద్యార్థిని ఉరి వేసుకున్నట్లు, రేప్ జరిగి ఉండకపోవచ్చన్న రీతిలో నివేదిక ఇచ్చినట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో వారు జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు. వారి వినతి మేరకు కమిషన్ కేసును సీఐడీకి అప్పగించింది. మూడు రోజులు విచారణ చేసిన సీఐడీ అధికారులు పోస్టుమార్టం రిపోర్ట్‌లో ప్రీతికి సంబంధించిన కొన్ని ఫొటోలు పెట్టారనే కారణంతోనే డాక్టర్ శంకర్‌ను ఈ ఏడాది ఫిబ్రవరిలో సస్పెండ్ చేశారు. ఆ తరువాత తమకు న్యాయం చేయాలని హైకోర్టును అశ్రయించిన విద్యార్థిని తల్లిదండ్రులు సీబీఐ విచారణ కోరారు. ఫొరెన్సిక్ హెచ్ఓడీపై వైద్య, ఆరోగ్యశాఖ సెక్రటరీ, డీఎంఈలకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురు వైద్యులతో కమిటీ వేసి ఇటీవలే ఆ హెచ్ఓడీపై విచారణ కూడా పూర్తి చేశారు. హెచ్ఓడీ ప్రవర్తనపై వైద్యుల కమిటీ నివేదిక అందజేసింది. న్యాయం జరిగే వరకు పోరాటం కట్టమంచి స్కూల్లో 2017 ఆగస్టు 18వ తేదీ రాత్రి హాస్టల్ దగ్గర ఆ స్కూల్ యాజమాని కుమారులు మందు పార్టీ చేసుకున్నారు. అందులో పాల్గొన్న వారే మా కూతురును రేప్ చేశారని, ఇందులో టీడీపీ నేత వి.జనార్దన్‌రెడ్డి, ఆయన కుమారులు హర్షవర్ధన్‌రెడ్డి, దివాకర్‌రెడ్డిల పాత్ర ఉందని కేసు పెట్టాం. ఆ రోజు నుంచి కేసు వెనక్కి తీసుకోవాలని చాలా మంది బెదిరిస్తున్నారు. మాలాగా మరో ఏ ఆడ పిల్ల తల్లిదండ్రులకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో న్యాయం కోసం పోరాడుతున్నాం. నిందితులను కాపాడేందుకు నంద్యాల ఎంపీ అభ్యర్థిగా టీడీపీ తరఫున పోటీ చేస్తున్న మాండ్ర శివానందరెడ్డి, ఆయన బంధువు గౌరు వెంకటరెడ్డి ప్రయత్నిస్తున్నారు. అధికార పార్టీ అండతో అన్ని సాక్ష్యాలను తారుమారు చేస్తున్నారు. తప్పు చేసిన వారికి కచ్చితంగా శిక్ష పడాలి. అఘాయిత్యాలు చేసే వారికి ప్రజలు గుణపాఠం చెప్పాలి. – రాజునాయక్, పార్వతిదేవి (ప్రీతి తల్లిదండ్రులు) -
‘ మాండ్ర ’ అక్రమాలకు అడ్డుకట్ట వేయండి
కర్నూలు (న్యూసిటీ): నందికొట్కూరు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్ మాండ్ర శివానందరెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని నియోజవకర్గ ప్రజలు డిమాండ్ చేశారు. పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో యువకులు, విద్యార్థులు, ప్రజలు మంగళవారం కర్నూలు తరలివచ్చి నల్లబ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాలో గ్యాంగ్‌స్టర్ నయూమ్ బినామీ శివానందరెడ్డి అంటు ఫ్లెక్సీలు, ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ ధర్నాకు నియోజకవర్గానికి చెందిన తువ్వా మల్లారెడ్డి, స్వామిరెడ్డి, చట్టా మురళీ, షరీఫ్, రమేష్‌నాయుడు తదితరులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇసుక మాఫియాలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేయగా, శివానందరెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీస్ అధికారులను బెదిరించి ఇద్దరు వ్యక్తులను విడిపించుకున్నారన్నారు. నిరుపేదలకు పింఛన్లు మంజూరు చేయించేందుకు కూడా రూ.10 వేలు లంచాలు తీసుకుంటున్నారని విమర్శించారు. గృహాలు, ఇతరత్రా సంక్షేమ పథకాలన్ని తన కనుసన్నల్లోనే నడవాలని సంబంధిత అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. మాండ్ర అక్రమాలను నిలువరించి నిజాయితీగా పని చేస్తున్న అధికారులకు ఉన్నతాధికారులు రక్షణ కల్పించాలని వారు కోరారు. కార్యక్రమంలో ఆయా ప్రాంతాల నాయకులు కళ్యాణ్, కే వెంకటరమణ, బన్నూరు చంద్రారెడ్డి, బీ రామాంజనేయులు, బాల వెంకటరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, రమేష్, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్–2 ఎస్ రామస్వామిని కలిసి వారు వినతి పత్రాన్ని అందించారు. ఆతర్వాత ఎస్పీ ఆకే రవికృష్ణను కలసి వినతి పత్రం అందజేశారు.