అవే అక్రమాలు | Checks revealed the facts of the task force | Sakshi
Sakshi News home page

అవే అక్రమాలు

Published Tue, Jan 10 2017 2:00 AM | Last Updated on Tue, Sep 5 2017 12:49 AM

అవే అక్రమాలు

అవే అక్రమాలు

ఫలితమివ్వని  పకడ్బందీ చర్యలు
 రూ.71.76 లక్షల సర్కారు ధాన్యం  పక్కదారి  పట్టించిన మిల్లర్‌
రాష్ట్ర స్థాయి  టాస్క్‌ఫోర్స్‌ తనిఖీల్లో వెల్లడైన నిజాలు


నిజామాబాద్‌ : వర్ని మండలంలోని ఓ రైసుమిల్లుకు ఈ ఖరీఫ్‌ కొనుగోలు సీజనులో 9,468 క్వింటాళ్ల సర్కారు ధాన్యాన్ని కస్టం మిల్లింగ్‌ కోసం కేటాయించారు. ఈ మిల్లరు 2,012 క్వింటాళ్ల ధాన్యం మిల్లింగ్‌ చేసి బియ్యాన్ని సర్కారుకు అప్పగించాడు. ఇంకా ఈ  మిల్లరు వద్ద 7,456 క్వింటాళ్ల సర్కారు ధాన్యం ఉండాలి. అనుమానం వచ్చి రాష్ట్ర స్థాయి               టాస్క్‌ఫోర్స్‌ బృందం ఇటీవల ఈ మిల్లును ఆకస్మిక తనిఖీ చేయగా.. కేవలం 2,672 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే స్టాక్‌ ఉంది. మిగిలిన 4,784 క్వింటాళ్ల సర్కారు ధాన్యం ఏమైనట్లు. ఈ ధాన్యం పక్కదారి పట్టినట్లు గుర్తించిన టాస్క్‌ఫోర్స్‌ ఉన్నతాధికారులు ఈ మిల్లరుపై క్రిమినల్‌ కేసు నమోదు  చేశారు. జిల్లాలో ఒకే ఒక్క మిల్లరు పక్కదారి పట్టించిన సర్కారు ధాన్యం విలువ సుమారు రూ.71.76 లక్షలు ఉంటుంది. పైగా ఉన్న ధాన్యాన్ని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే.. సదరు మిల్లరు నిబంధనల్లోని లొసుగులను ఆధారంగా చేసుకుని అధికారుల చర్యలు సాగకుండా చేయడం గమనార్హం.

ఎన్ని చర్యలు చేపట్టినా..
కస్టం మిల్లింగ్‌లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ఎన్ని ప్రత్యేక చర్యలు చేపట్టినా.. అక్రమాల్లో ఆరితేరిన మిల్లర్లు మాత్రం తమ ‘దందా’ య«థేచ్ఛగా కొనసాగిస్తూనే ఉన్నారు. గతంలో సర్కారు ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.కోట్లు సర్కారుకు కుచ్చు టోపి పెట్టిన మిల్లర్లు.. తాజాగా ఈ ఖరీఫ్‌ కొనుగోలు సీజను కస్టం మిల్లింగ్‌లోనూ తమ నైజాన్ని ప్రదర్శించారు. పైన పేర్కొన్న ఒక్క ఉదాహరణ చాలు కస్టం మిల్లింగ్‌లో అక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పడానికి. బ్యాంకు గ్యారంటీ.. క్రిమినల్‌ కేసుల హెచ్చరికలు.. ఇవేవీ అక్రమార్కులు ఖాతరు చేయడం లేదు.

ఈసారి సీఎంఆర్‌ వేగవంతం..
ఈ ఏడాది ఖరీఫ్‌ కొనుగోలు సీజనులో ప్రభుత్వం 186 చోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. సుమారు రూ.300 కోట్లు వెచ్చించి రైతుల వద్ద 2.03 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని సేకరించింది. సేకరించిన ఈ ధాన్యాన్ని కస్టం మిల్లింగ్‌ చేసి.. బియ్యం ఇవ్వాలని జిల్లా వ్యాప్తంగా 183 మిల్లర్లకు కేటాయించింది. ఈ« ధాన్యాన్ని తీసుకున్న మిల్లరు 1.36 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యాన్ని సర్కారుకు అప్పగించాలి. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈ కస్టం మిల్లింగ్‌ ఈసారి వేగవంతమవుతోంది. ఇప్పటి వరకు సుమారు 1.09 లక్షల మెట్రిక్‌ టన్నుల బియ్యం సర్కారుకు తిరిగి వచ్చేసింది. అంటే 80 శాతం కస్టం మిల్లింగ్‌ పూర్తయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కస్టం మిల్లింగ్‌ ఈ సారి వేగవంతం కాగా, అక్రమాలు మాత్రం అలాగే కొనసాగుతుండటం విమర్శలకు దారితీస్తోంది. గతంలో సెప్టెంబర్‌ మాసాంతానికి కూడా కస్టం మిల్లింగ్‌ జరిగేది కాదు. కానీ.. ఈసారి జనవరి నెలాఖరు వరకు 95 శాతానికి పైగా ఈ కస్టం మిల్లింగ్‌ ప్రక్రియ పూర్తి చేసేందుకు జాయింట్‌ కలెక్టర్‌ రవీందర్‌రెడ్డి చర్యలు చేపట్టారు. అక్రమాలు మాత్రం య«థేచ్ఛగా కొనసాగుతుండటంతో పౌరసరఫరాల శాఖను విమర్శలు వెంటాడుతున్నాయి.

‘కస్టం’ కేటాయింపుల్లో చేతివాటం
జిల్లాలో కస్టం మిల్లింగ్‌ కేటాయింపుల తీరు తీవ్ర విమర్శలకు దారితీసింది. గతంలో ఇదే కస్టం మిల్లింగ్‌ పేరుతో సర్కారు ధాన్యాన్ని పక్కదారి పట్టించి రూ.కోట్లులో ప్రభుత్వానికి ఎగనామం పెట్టిన బడా మిల్లర్లు ఇప్పుడా బినామీ పేర్లతో కొత్త లైసెన్సులు తీసుకున్న వారికి అధికారులు తిరిగి కోట్లు విలువైన ధాన్యం కస్టం మిల్లింగ్‌ కోసం అప్పగించడం వెనుక పెద్ద మొత్తంలో చేతులు మారాయనే ఆరోపణలున్నాయి. సర్కారుకు ఎగనామం పెట్టినట్లు అధికారులకు తెలిసినప్పటికీ.. సాంకేతిక కారణాలు సాకుగా చూపి వారికే మళ్లీ ధాన్యాన్ని కట్టబెట్టడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ ఉన్నతాధికారుల చిత్తశుద్ధిపై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement