సాక్షాత్తు వెంకయ్యకే ఇలా జరిగితే.. | Central Minister Venkaiah Naidu demands AI to explain on flight delay | Sakshi
Sakshi News home page

సాక్షాత్తు వెంకయ్యకే ఇలా జరిగితే..

Published Tue, Jun 28 2016 6:29 PM | Last Updated on Tue, Oct 2 2018 7:37 PM

సాక్షాత్తు వెంకయ్యకే ఇలా జరిగితే.. - Sakshi

సాక్షాత్తు వెంకయ్యకే ఇలా జరిగితే..

న్యూఢిల్లీ: ట్రబుల్ షూటర్ గా పేరుపొందిన వెంకయ్య నాయుడు కేంద్ర మంత్రివర్గంలోని సీనియర్ మంత్రుల్లో ఒకరు. ప్రధాని మోదీకి ఆప్తులు కూడా. ఎప్పుడూ బిజీగా ఉండే ఆయన సమయాన్ని తగిన రీతిలో సద్వినియోగం చేసుకుంటారు. అలాంటిది ఓ అత్యవసర పని నిమిత్తం బయలుదేరిన ఆయనను ఎయిర్ ఇండియా తిప్పలుపెట్టింది. విమానం కోసం గంటంపావు సేపు ఎయిర్ పోర్టులో ఎదురు చూసిన ఆయన.. ఎంతకీ విమానం రాకపోవడంతో ఇంటికి తిరిగి వెళ్లిపోయారు. విలువైన కాలాన్ని వృథా చేశారంటూ ఎయిర్ ఇండియా నిర్వహణా తీరుపై మండిపడ్డారు. వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు.

పలు కార్యక్రమాల్లో పాల్గొనే నిమిత్తం వెంకయ్య మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్ కు బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. ఈమేరకు ఎయిర్ ఇండియా 544 విమానంలో ఆయనకు సీటు కూడా ఖరారయింది. మధ్యాహ్నం 1:15 గంటలకు విమానం బయలుదేరాల్సి ఉండగా, వెంకయ్య 12:20కే ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్నారు. సరిగ్గా విమానం బయలుదేరాల్సిన కొద్ది నిమిషాల ముందు 'పైలట్ ఇంకా రాలేదని, మరి కొద్దిసేపు వేచిచూడాలని' అధికారులు ఆయనకు సమాచారం ఇచ్చారు.

అలా 1:45 వరకు ఎదురు చూసినా ఫలితం లేకపోవడంతో వెంకయ్యనాయుడు తిరిగి తన ఇంటికి వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఎయిర్ ఇండియా నిర్వాకాన్ని వివరిస్తూ వరుస ట్వీట్లు చేశారాయన. సర్వీసు ఎందుకు ఆలస్యమైందో చెప్పాలని ఎయిర్ ఇండియాను డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న పోటీకి అనుగుణంగా మారడంతోపాటు పారదర్శకత, జవాబుతారీతనం పెంపొందించుకోవాలని విమానయాన సంస్థకు హితవుపలికారు. విమానం ఆలస్యం కావడంవల్ల ఇంపార్టెంట్ అపాయింట్ మెంట్లు రద్దయ్యాయని చెప్పుకొచ్చారు. సాక్షాత్తు కేంద్ర మంత్రికే ఇలా జరిగితే.. విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు ఏం సమాధానం చెబుతారో చూడాలిమరి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement