
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతి రాజుకు విమానంలో ప్రయాణీకులు చుక్కలు చూపించారు. గుక్కతిప్పుకోకుండా ప్రశ్నలు సంధిస్తూ చిరాకు పెట్టించారు. ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరాల్సిన తమ విమానం గంటపాటు ఎందుకు ఆలస్యం అయిందని, ఎందుకు అంతసేపు తమను విమానంలో కూర్చొబెట్టారని నిలదీశారు. దాంతో ఆయన వెంటనే ఎయిర్ ఇండియా చైర్మన్‌కు మేనేజింగ్ డైరెక్టర్ ప్రదీప్ ఖరోలాకు ఫోన్ చేసి వెంటనే జరిగిన తప్పిదానికి వివరణ కోరారు.
వివరాల్లోకి వెళితే ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఒకటి ఢిల్లీ నుంచి విజయవాడకు బయలుదేరాల్సి ఉంది. అదే విమానంలో మంత్రి అశోక్ గజపతి రాజుతోపాటు మొత్తం 125మంది ప్రయాణీకులు కూర్చున్నారు. గంట సేపు అయినా పైలట్, ఇతర సిబ్బంది రాలేదు. దీంతో చిర్రెత్తిపోయిన ప్రయాణీకులు అందులో ఉన్న విమానయాన శాఖ మంత్రి అశోక్‌గజపతి రాజును ప్రశ్నలతో చుట్టుముట్టారు. దీనికి బదులుగా ఎయిర్ ఇండియా వెంటనే పైలట్‌తో సహా ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. ఎయిర్ లైన్ అధికారిక ప్రతినిధి జీపీ రావ్ తెలిపిన వివరాల ప్రకారం ఎయిర్ ఇండియా 459 విమానం గంటన్నరపాటు ఆలస్యం అయింది.