ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఎయిర్ ఇండియా సిబ్బందితో అనుచితంగా, వికృతంగా ప్రవర్తించే ప్రయాణికులకు చెక్ పెట్టేందుకు నిర్ణయించింది. ప్రయణీకుల భద్రతే ముఖ్యమైనప్పటికీ, వేధింపులకు దిగిన ప్రయాణికులకు సంకెళ్లు వేసేందుకు సిద్ధమవుతోంది. ఇటీవల సిబ్బందిపై వేధింపుల ఉదంతాలు చోటుచేసు కోవడంతో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయానికి వచ్చింది.
ఇప్పటివరకూ అంతర్జాతీయ విమానాల్లో మాత్రమే అనుమతి ఉన్న రిస్ట్రెయినర్స్ ను ఇక మీదట జాతీయ, అంతర్జాతీయ విమానాల్లోకూడా తీసుకెళ్లనున్నట్టు నివేదికలుచెబుతున్నాయి. ఇకమీదట దురుసుగా ప్రవర్తించే ప్రయాణికులను నియంత్రించేందుకుగాను ప్లాస్టిక్ సంకెళ్లను తీసుకెళ్లనున్నట్టు ఎయిర్ ఇండియీ అధ్యక్షుడు అశ్విన్ లోహాని తెలిపారని రిపోర్ట్ చేశాయి.
విమానం, ప్రయాణీకుల భద్రత విషయంలో ఎలాంటి రాజీలేదని తెలిపారు. అదే సందర్బంగా తమ సిబ్బంది రక్షణ కూడా ముఖ్యమే అన్నారు. విమానాల్లో దుష్ప్రవర్తన ఇటీవల కాలంలో బాగా పెరుగుతోందని, తమ పైలట్లు పూర్తి అసహనంతో ఉంటున్నా, లైంగిక వేధింపులు లాంటివి చోటు చేసుకున్నాయని ఆశ్విన్ చెప్పారు.
అయితే పూర్తిగా నియంత్రణ కోల్పోయినపుడు మాత్రమే ప్లాస్టిక్ సంకెళ్ల ద్వారా వారిని నియంత్రిస్తామని తెలిపారు. అనంతరం వారిని దర్యాప్తు ఏజెన్సీలకు అప్పగిస్తామన్నారు.కాగా జనవరి 2 న మస్కట్-ఢిల్లీ విమానంలో ఎయిర్ హోస్టెస్ పై లైంగిక దాడి, డిసెంబర్ 21 న ముంబై-న్యూయార్క్ విమానంలో సహ-ప్రయాణీకుడి అనుచిత ప్రవర్తన నేపథ్యంలో ఎయిర్ ఇండియా ఈ నిర్ణయం తీసుకున్నట్టుతెలుస్తోంది.