మీవల్ల ఆలస్యమైతే.. 15 లక్షల ఫైన్!
ఎయిరిండియా విమానాల్లో ప్రయాణం చేసేటపుడు ఇకమీదట జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం గొడవలు పడినా ఇక మీదట క్రిమినల్ చర్యలను ఎదుర్కోవడంతో పాటు భారీ జరిమానాలు కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎవరైనా ప్రయాణికుల ప్రవర్తన కారణంగా విమానం గంట ఆలస్యమైతే రూ. 5 లక్షలు, రెండు గంటలలోపు అయితే రూ. 10 లక్షలు, రెండు గంటలు దాటి ఆలస్యమైతే రూ. 15 లక్షల జరిమానా విధించాలని ఎయిరిండియా భావిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన, ఎయిరిండియా ఉద్యోగుల మీద దాడులు చేయడం (వీవీఐపీలు గానీ, మామూలు ప్రయాణికులు గానీ) లాంటి ఘటనల వల్ల ఉద్యోగుల నైతిక స్థైర్యం బాగా దెబ్బతిందని, చివరకు హోటళ్లలో కూడా ఎవరు రావాలి, ఎవరు రాకూడదన్న నిబంధనలు విధించే అవకాశం ఉన్నప్పుడు ఎయిరిండియాకు కూడా ఇలాంటి అనుచిత ప్రవర్తన కలిగి ఉండే ప్రయాణికుల విషయంలో తగిన చర్యలు తీసుకునే అవకాశం ఉండాలని ఓ అధికారి చెప్పారు.
ఇటీవలి కాలంలో పలువురు నాయకులు తమ ఆధిపత్యాన్ని చూపించడం కోసం ఎయిరిండియా, ఇతర విమానయాన సంస్థల సిబ్బందితో గొడవ పడటం, వాళ్లపై శారీరకంగా దాడి చేయడం లాంటి ఘటనలు వెలుగు చూస్తున్నాయి. శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ అయితే ఏకంగా 60 ఏళ్ల ఉద్యోగి ఒకరిని పాతికసార్లు చెప్పుతో కొట్టారు. అలాగే తన తల్లి ప్రయాణం విషయంలో కేబిన్ సిబ్బందితో గొడవ పడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ విమానాన్ని బాగా ఆలస్యం చేశారు. ఈ వీవీఐపీ సంస్కృతి విమాన సిబ్బందికి చుక్కలు చూపిస్తోంది. అంత చేసినా చివరకు వాళ్లు ఏమీ లేకుండానే బయటపడిపోతున్నారు. అందుకే ఇప్పుడు భారీ జరిమానాలతో కూడిన శిక్షలు పడేలా చూడాలని ఎయిరిండియా భావిస్తోంది. జరిమానా విధించే అధికారం ఎయిరిండియా చేతుల్లోనే ఉంటుంది గానీ, క్రిమినల్ చర్యల కోసం మళ్లీ పోలీసులను ఆశ్రయించాల్సి ఉంటంఉది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉద్యోగుల ప్రయోజనాలకు పెద్దపీట వేయాలని యాజమాన్యం భావిస్తోంది.