ఆదివారం చెన్నైలో వరద బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న కేంద్ర మంత్రి వెంకయ్య
- అప్రమత్తం కాకుంటే అన్ని సిటీలకూ చెన్నై తరహా ప్రమదం
- కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు హెచ్చరికలు
- చెన్నైలోని ముంపు ప్రాంతాల సందర్శన, బాధితులకు పరామర్శ
చెన్నై: పట్టణ ప్రాంతాల్లో మురుగు, వరద నీరు పారే నాలాలు ఆక్రమణలకు గురవుతున్నాయని, అలాంటి ఆక్రమణల తొలగింపుపై అన్ని రాష్ట్రాలు దృష్టిసారించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ విషయంలో అలసత్వం వహిస్తే అన్ని పట్టణాలకు ఇటీవలి చెన్నై విపత్తు తరహా ముప్పు తప్పదని హెచ్చరించారు.
ఆదివారం చెన్నైలోని వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. స్వర్ణభారత్ ట్రస్ట్ తరపున బాధితులకు బియ్యం తదితర వస్తువులను పంపిణీ చేశారు. వరద ప్రాంతాల సందర్శన అనంతరం వెంకయ్య.. తమిళనాడు సీఎం జయలలితతో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఆక్రమణ వల్ల ఎంతటి అరిష్టం వాటిల్లుతుందో ప్రభుత్వానికి, ప్రజలకు తెలిసి వచ్చిందన్నారు. ఈ దారుణ విపత్తు నుంచి ప్రతి ఒక్కరూ గుణపాఠం నేర్చుకోవాలని కోరారు. దేశంలోని అనేక రాష్ట్రాల్లో భారీ వరదలు సంభవించే అవకాశం ఉన్నట్లు ఇటీవలే ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని, ఈ మేరకు జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.