వైద్యం అందుబాటులోకి తెస్తాం
వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు
మద్దిపాడు : రాష్ట్రంలో ప్రతిపేదవానికి వైద్యం అందుబాటులోకి తెస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు అన్నారు. మద్దిపాడు రిమ్స్ రూరల్ హెల్త్ సెంటర్‌ను రిమ్స్ గ్రామీణ వైద్య శిక్షణ కేంద్రంగా మార్చేందుకు భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన సందర్భంగా బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సహకారంతో తాము వైద్యశాఖకు రూ.340 కోట్లు నాబార్డ్ ద్వారా సాధించగలిగామని ఆయన తెలిపారు.
అందులో నుంచి రూ.32 కోట్లు ప్రకాశం జిల్లాకే కేటాయించామన్నారు. రాష్ట్రంలో 1400 మంది వైద్యులను ఉద్యోగాలలో తీసుకోవాలని ప్రభుత్వం సంకల్పించిందని, ప్రతి ఉద్యోగం మెరిట్ ద్వారా పారదర్శకంగా భర్తీ చేస్తామన్నారు. వైద్యశాలల పరంగా చూస్తే ప్రస్తుతం రాష్ట్రం చాలా తక్కువ స్థానంలో ఉందని అంతా ప్రక్షాళన చేయటానికి కంకణం కట్టుకున్నామని తెలిపారు. సభకు అధ్యక్షత వహించిన సంతనూతలపాడు శాసనసభ్యుడు ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ మద్దిపాడు హెల్త్‌సెంటర్‌కు 4 కోట్ల 40 లక్షల రూపాయలు కేటాయించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.
తమ నియోజకవర్గంలోని చీమకుర్తి పీహెచ్‌సీని సీహెచ్‌సీగా మార్చారు కానీ స్పెషలిస్టు వైద్యులు లేరని స్పెషలిస్టులను ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. చీమకుర్తి హాస్పటల్‌లో ఎక్స్‌రే మిషన్ కావాల్సిఉందన్నారు. నాగులుప్పలపాడు మండలం పోతవరంలో పీహెచ్‌సీ బిల్డింగ్ మంజూరైనా ఇంతవరకూ దానిని ప్రారంభించలేదన్నారు. మద్దిపాడు మండలంలో మొత్తం 9 సబ్‌సెంటర్‌లు ఉండగా రెండుమాత్రమే భవనాలు ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. అన్ని భవనాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
గత ఏడాది ఒంగోలు పరిసర ప్రాంతప్రజలు డెంగీతో బాధలు అనుభవించారని, వారందరూ ప్లేట్‌లెట్‌లు పడిపోవటంతో గుంటూరు, విజయవాడ, హైదరాబాదులకు పరుగులు తీశారని అన్నారు. ఒంగోలు రిమ్స్ ఆసుపత్రిలో ప్లేట్‌లెట్ మిషన్ ఏర్పాటు చేయాల్సిన ఆవశ్యకతను మంత్రికి వివరించారు. అదేవిధంగా వైద్యశాఖలో కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్నవారిని క్రమబద్ధీకరించాలని ఆయన మంత్రిని కోరారు.
వైద్యశాఖలో 2001 నుంచి దశలవారీగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబధ్ధీకరించాలని రాష్ట్ర పారామెడికల్ జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ రత్నాకర్ మంత్రి కామినేనికి వినతిపత్రం ఇచ్చారు. కార్యక్రమంలో రోడ్డు రవాణా శాఖా మంత్రి శిద్దా రాఘవరావు, మద్దిపాడు ఎంపీపీ నారా విజయలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యుడు మొనపాటి చినవీరాంజమ్మ, మద్దిపాడు ఎంపీటీసీ సభ్యుడు పాటిబండ్ల చినరామయ్య, మద్దిపాడు సర్పంచ్ ఉప్పుగుండూరి నాగేశ్వరరావు, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరాం, సంతనూతలపాడు మాజీ ఎమ్మెల్యే బీఎన్ విజయకుమార్, మాజీ ఎమ్మెల్యే దారా సాంబయ్య, రిమ్స్ డైరక్టర్ అంజయ్య, డీయంహెచ్‌ఓ యాస్మిన్, మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, మండల ప్రజలు పాల్గొన్నారు.