కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం | telangana leaders slam special powers to governor | Sakshi
Sakshi News home page

కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

Published Sun, Aug 10 2014 1:09 AM | Last Updated on Wed, May 29 2019 3:25 PM

కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం - Sakshi

కేంద్రం నిర్ణయం సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం

గవర్నర్‌కు అధికారాలపై నిరసనల వెల్లువ
అసెంబ్లీ ఎదుట నేతల దిష్టిబొమ్మలు దహనం చేసిన లాయర్ల జేఎసీ

 
 
హైదరాబాద్: సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రం హైదరాబాద్‌పై గవర్నర్‌కు విశేష అధికారాలు కట్టబెడుతోందని తెలంగాణ అడ్వొకేట్స్ జేఏసీ విమర్శించింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ శనివారం నాంపల్లిలోని అసెంబ్లీ ఎదురుగా ప్రధాని మోడీ, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దిష్టిబొమ్మలను దగ్ధం చేసింది. ఈ సందర్భంగా జేఏసీ కో కన్వీనర్ గోవర్ధన్‌రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో తెలంగాణకూడా  అంతర్భాగమని ప్రధాని గుర్తించాలన్నారు.

ఆ పాలన వెనక్కి తీసుకోవాలి: సీపీఎం

కేంద్రం అప్రజాస్వామిక పద్ధతుల్లో తీసుకున్న గవర్నర్ పాలన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి వెంకయ్యనాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు సలహాలతో తెలంగాణపై కేంద్రం నిర్ణయాలు చేయడం అత్యంత అప్రజాస్వామికమని ఆ పార్టీ తెలంగాణ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం  అన్నారు.

 హక్కులను హరించడమే..: సీపీఐ

గవర్నర్‌కు అధికారాలు అప్పగిస్తూ జారీచేసిన మార్గదర్శకాలు తెలంగాణ ప్రభుత్వ హక్కులను హరించేలా, అభ్యంతరకరంగా ఉందని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. ఇది ప్రభుత్వం చేతులు,కాళ్లు కట్టివేయడమేనన్నారు.

‘నాయుడుల’ కుట్రే: కోదండరాం

మెదక్: గవర్నర్‌కు హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాల అప్పగింత వెనక చంద్రబాబునాయుడు, వెంకయ్యనాయుడుల కుట్ర ఉందని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఆరోపించారు. శనివారం మెదక్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు.

బాబుది నీచ మనస్తత్వం: హరీశ్

సంగారెడ్డి (మెదక్): గవర్నర్‌కు హైదరాబాద్ శాంతిభద్రతల అధికారాల అప్పగింత వెనుక టీడీపీ అధినేత చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కుట్ర దాగి ఉందని నీటిపారుదల శాఖ  మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పక్కవారు చెడిపోవాలనే నీచ మనస్తత్వం చంద్రబాబుదని ఆరోపించారు. మెదక్ జిల్లా కేంద్రం సంగారెడ్డిలో విలేకరులతో  మాట్లాడారు.

లోపాలను కప్పిపుచ్చుతున్న సీఎం: పొన్నం

శాంతి,భద్రతల విషయంలో గవర్నర్‌కు అధికారాలను అప్పగించారన్న ముసుగులో.. సీఎం కేసీఆర్ తన లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ విమర్శించారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌కు అధికారాల నెపంతో సీఎం తన బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. చిన్నచిన్న అంశాలపై గిల్లికజ్జాలు సరికాదన్నారు.

గవర్నర్ జోక్యంతో గందరగోళం : వీహెచ్

 రోజువారీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకుంటే.. ప్రజల్లో  గందరగోళం ఏర్పడి, ప్రశాంత వాతావరణం దె బ్బతింటుందని కాంగ్రెస్ ఎంపీ వి.హనుమంతరావు వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి సీఎం ఉండగా మళ్లీ శాంతిభద్రతల అంశం గవర్నర్‌కు కట్టబెడితే, సీఎం, హోంమంత్రి ఏం చేయాలని ప్రశ్నించారు.

ఉద్యమిస్తాం: వేణుగోపాలాచారి

బెల్లంపల్లి (అదిలాబాద్): గవర్నర్‌కు కేంద్రం అధికారాలను కట్టబెడితే ఉద్యమం చేపడతామని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి ఎస్.వేణుగోపాలాచారి హెచ్చరిం చారు. ఆదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో విలేకరులతో మాట్లాడారు.

బాబు చేతిలో మోడీ కీలుబొమ్మ: ఈటెల

జమ్మికుంట (కరీంనగర్): ఏపీ సీఎం చంద్రబాబు చేతిలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ కీలుబొమ్మగా మారారని, కేంద్రం ఆధిపత్య ధోరణి కొనసాగిస్తే మరో ఉద్యమం తప్పదని రాష్ట్ర ఆర్థిక, పౌరసరఫరాల శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఇది సరికాదు: జోగు రామన్న

గోదావరిఖని (కరీంనగర్): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఏపీసీఎం చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా మారిందని, అందుకే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల శాంతిభద్రతలను గవర్నర్‌కు అప్పగించిందని రాష్ట్ర అటవీశాఖ మంత్రి జోగు రామన్న అన్నారు.  కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో విలేకరులతో మాట్లాడారు.

తెలంగాణపై కేంద్రం వివక్ష: ఎంపీ కడియం

వరంగల్: తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని ఎంపీ కడియం శ్రీహరి విమర్శించారు. శనివారం ఆయన హన్మకొండలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి కేంద్రం అడ్డంకులు సష్టిస్తోందని మండిపడ్డారు. రాజ్యాంగ సూత్రాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్నారు.

 కీలుబొమ్మగా మోడీ!: దేశపతి

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుల చేతిలో కీలుబొమ్మగా మారారని, వారిద్దరు ఏం చెబితే మోడీ అదే చేస్తున్నారని తెలంగాణ వికాస సమితి అధ్యక్షుడు దేశపతి శ్రీనివాస్ ధ్వజమెత్తారు.  గవర్నర్‌కు అధికారాలు కట్టబెట్టడం ఇందులో భాగమేనని ఆరోపించారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం మోడీ పేరు నరేంద్రనాయుడుగా మారిపోయిందని ఎద్దేవా చేశారు.

రేపు ధర్నాలు, ర్యాలీలు..

 హైదరాబాద్‌పై ఆంక్షలకు వ్యతిరేకంగా జిల్లా కేంద్రాల్లో సోమవారం (ఈ నెల 11న) నిరసన ధర్నాలను, ర్యాలీలను నిర్వహించాలని టీయూడబ్యూజే అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అల్లం నారాయణ, క్రాంతి ఒక ప్రకటనలో కోరారు. హైదరాబాద్‌పై ఆంక్షలను పెడుతూ, గవర్నర్‌కు అధికారాలను అప్పగించడం ప్రజాస్వామిక హక్కులకు భంగమన్నారు.

కేంద్రం పెత్తనాన్ని సహించం

 చందంపేట(నల్లగొండ):  గవర్నర్‌కు విశేష అధికారాలను కట్టబెట్టడాన్ని హోంమంత్రినాయిని నర్సింహారెడ్డి ఖండిం చారు.  రాష్ట్ర ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర సాగుతోందని, కేంద్రం పెత్తనాన్ని సహించమన్నారు. నల్లగొండ జిల్లా చందంపేటలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇతర రాష్ట్రాల సీఎంలను ఏకం చేసేందుకు సీఎం ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement