
స్మార్ట్ సిటీ జాబితాలో కర్నూలును చేర్చండి
♦ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేల భేటీ
♦ రెండోదశ జాబితాలో చేరుస్తామన్న కేంద్ర మంత్రి
సాక్షి, కర్నూలు : రాజధానిని కోల్పోయి అన్ని విధాలా నష్టపోయి.. అభివృద్ధిలో రాయలసీమలోనే అత్యంత వెనుకబడిన కర్నూలును కేంద్ర ప్రకటించిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు జాబితాలో చేర్చాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడును కర్నూలు ఎంపీ బుట్టారేణుక, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి నివాసంలో ఎంపీతోపాటు ఎమ్మెల్యేలు మంగళవారం ఆయనతో భేటి అయ్యారు. ఈ సందర్భంగా గతంలో ప్రకటించిన విధంగానే కర్నూలును స్మార్ట్‌సిటీ జాబితాలో చేర్చాలని వారు కేంద్రమంత్రి వెంకయ్యను కోరారు. అభివృద్ధిలో వెనుకబడిన కర్నూలు నగరం స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుతోనైనా అభివృద్ధికి నోచుకుంటుందని వారు వివరించారు.
► కర్నూలు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని 2013లో రూ. 659 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ప్రతిపాదించిన మంచినీటి పథకం అప్పట్లో వివిధ కారణాలతో ఆగిపోయింది. అదే పథకాన్ని ఇప్పుడు మంజూరు చేయాలని కోరారు.
► ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానికి ప్రతిపాదించిన నాలుగులేన్ల రహదారితో కర్నూలు నగరంలో ట్రాఫిక్ సమస్య తలెత్తే అవకాశం ఉందని.. ట్రాఫిక్ నియంత్రణ కోసం జాతీయ రహదారిని కలుపుతూ కర్నూలులో రూ. 90 కోట్ల అంచనాలతో 18 కిలోమీటర్ల పొడవైన ఇన్నర్ రింగ్‌రోడ్డు ప్రాజెక్టు నిర్మాణానికి సాయం చేయాలని కోరారు.
► ఆదోని, ఎమ్మిగనూరు మున్సిపాలిటీల్లో, గూడూరు నగర పంచాయతీలో నీటి సమస్యకు శాస్వత పరిష్కారం చూపడంతోపాటు భూగర్భడ్రైనేజీ పనులు చేపట్టేందుకు కృషి చేయాలని ఎంపీ కోరారు.
► ఎంపీ, ఎమ్మెల్యే వినతిపై స్పందించిన వెంకయ్యనాయుడు రెండోదశలో స్మార్ట్‌సిటీ జాబితాలో కర్నూలు పేరును చేరుస్తామని, ఇక సమ్మర్‌స్టోరేజీ, ఇన్నర్ రింగ్‌రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులు తదితర ప్రతిపాదనలను తప్పుకుండా పరిశీలిస్తామన్నారు. కేంద్ర మంత్రిని కలిసిన వారిలో వైఎస్సార్‌సీపీ కేంద్రమండలి సభ్యులు హఫీజ్‌ఖాన్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ లాలిస్వామి, బుట్టా నీలకంఠం ఉన్నారు.
ఆత్మకూరు ప్రజల తాగునీటి కష్టాలు తీర్చండి
ఆత్మకూరు పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిని శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి కోరారు. వైఎస్‌ఆర్ హయాంలో వెలుగోడు రిజర్వాయర్ మంచినీటి ప్రాజెక్టు పథకం పనులు పెండింగ్‌లో ఉన్నందున ప్రజలకు తాగునీరు పూర్తిస్థాయిలో అందడం లేదని వివరించారు. ఆ ఈ పనులకు సుమారు రూ. 1.60 కోట్ల వ్యయం అవుతుందని అందుకు సహకరించాలని కోరారు. కేంద్ర మంత్రి వెంకయ్య స్పందిస్తూ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.