
కదం తొక్కిన జనం
♦ ప్రత్యేక హోదా మన హక్కు అంటూ నినాదాలు
♦ జిల్లా వ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు
♦ వివిధ పార్టీల నేతలు, కార్యకర్తలు అరెస్ట్
♦ మద్దతు ప్రకటించిన వైఎస్సార్ సీపీ
♦ జిల్లాలో బంద్ సంపూర్ణం
సాక్షి, కడప, కడప అర్బన్ : ‘ప్రత్యేక హోదా కల్పిస్తామని రాష్ట్రం విడిపోయే ముందు నమ్మకంగా చెప్పారు. అధికారంలోకి రాగానే మాట తప్పారు. సాంకేతిక కారణాలు అడ్డు వస్తున్నాయంటూ కుంటి సాకులు చెబుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేస్తున్నా.. ముఖ్యమంత్రి చంద్రబాబు చోద్యం చూస్తున్నారు తప్పించి గట్టిగా అడిగిన పాపాన పోలేదు. ప్రత్యేక హోదా మన హక్కు. దాని కోసం పోరాటం ప్రారంభమైంది. ఆ హక్కు సాధించేదాక ఆగము’ అంటూ జిల్లా వ్యాప్తంగా ప్రజలు నినదించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా డిమాండ్‌తో మంగళవారం రాష్ట్ర బంద్‌లో భాగంగా జిల్లాలో బంద్ సంపూర్ణంగా జరిగింది.
ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థలు, పెట్రో బంకులు, సినిమా థియేటర్లు మూత పడ్డాయి. పట్టణాల్లో దుకాణాలు సైతం స్వచ్ఛందంగా మూసి వేశారు. సీపీఐ నేతలు, కార్యకర్తలు జిల్లా కేంద్రంలో, నియోజకవర్గం కేంద్రాల్లో ఉదయం నుంచే రోడ్లపైకొచ్చి బంద్‌కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. బంద్‌కు వైఎస్‌ఆర్‌సీపీ మద్దతు ప్రకటించడంతో ఎక్కడికక్కడ శ్రేణులు ఉత్సాహంతో కదంతొక్కాయి. విద్యార్థులు సైతం స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహించారు. కడప నగరంలో తెల్లవారుజాము నుంచే సీపీఐ నేతలు రోడ్లపైకి వచ్చి బంద్ నిర్వహించారు.
ఆర్టీసీ బస్టాండు వద్ద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలు, టైర్లను కాల్చారు. సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కోటిరెడ్డి సర్కిల్ వద్ద ఆందోళన చేపట్టారు. వాహనాలను అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన పోలీసులు, సీపీఐ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈశ్వరయ్య, నగర కార్యదర్శి వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్.నాగసుబ్బారెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు పత్తి రాజేశ్వరి, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షఫీ, జిల్లా అధ్యక్షుడు కరీముల్లా, కాంగ్రెస్ నేత జకరయ్య తదితరులతోపాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక పాలెంపల్లె నుంచి ఎద్దుల బండిలో ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను ఊరేగిస్తూ ఏడురోడ్ల వద్ద దగ్ధం చేశారు. ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు వన్‌టౌన్ పోలీసులు ప్రయత్నించినా దిష్టిబొమ్మను దగ్దం చేశారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం నాయకులు మనోహర్‌రెడ్డి, శంకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, డబ్ల్యు రాము, బీమరాజు తదితరులు పాల్గొన్నారు. జేకే యూత్ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు, రాష్ర్ట ముఖ్యమంత్రి చంద్రబాబుల ఫ్లెక్సీలను విచిత్ర వేషధారణలతో తయారు చేసి ర్యాలీ నిర్వహించారు.
ప్రొద్దుటూరులో డిపో ఎదుట ఆందోళన
ప్రొద్దుటూరు పట్టణంలో ఆర్టీసీ బస్సులు బయటికి వెళ్లకుండా తెల్లవారుజామున 4 గంటల నుంచే సీపీఐ నాయకులు రామయ్య, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి గొర్రె శ్రీనివాసులు తదితరుల ఆధ్వర్యంలో డిపో గేటు ఎదుట ఆందోళన చేపట్టారు. బస్సులు బయటికి రాకుండా అడ్డకున్నారు. పట్టణంలో తిరుగుతూ దుకాణాలను మూసి వేయించారు. మధ్యాహ్న సమయంలో బస్సులను అడ్డుకుంటున్న నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్ట్ అయిన వారిని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి ఈవీ సుధాకర్‌రెడ్డి పరామర్శించారు. బద్వేలులో అఖిలపక్ష నేతలు ర్యాలీ నిర్వహించినంతరం ధర్నా చేపట్టారు. కమలాపురంలో సీపీఐ ఏరియా కార్యదర్శి చంద్రశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో కడప-తాడిపత్రి ప్రధాన రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేయడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
పులివెందులలో బంద్ సంపూర్ణం
పులివెందుల పట్టణంలో ఉదయం నుంచి బంద్ సంపూర్ణంగా జరిగింది. పట్టణంలోని ప్రైవేటు విద్యా సంస్థలతోపాటు దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులు కొమ్మా శివప్రసాద్‌రెడ్డి, రసూల్‌సాహెబ్, ఎర్రిపల్లె సర్వోత్తమరెడ్డి, విశ్వనాథరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పట్టణంలో బైకులపై తిరుగుతూ బంద్‌ను పర్యవేక్షించారు. ప్రత్యేక హోదా.. ఆంధ్రా హక్కు అంటూ నినాదాలు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
రాజంపేటలో సీపీఐ, సీఐటీయూ నిరసన ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ పోలా శ్రీనివాసులురెడ్డి మద్దతు తెలిపి వారితోపాటు ఆందోళనలో పాల్గొన్నారు. జమ్మలమడుగులో సీపీఐ నాయకులు, రాయచోటిలలో ఏఐఎస్‌ఎఫ్ నాయకులు బంద్‌ను పర్యవేక్షించారు. మైదుకూరులో ఉదయమే సీపీఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించడంతో బంద్ ప్రభావం పెద్దగా కనిపించలేదు.
ఆర్టీసీకి రూ.46 లక్షలు నష్టం
బంద్ సందర్భంగా జిల్లాలోని ఎనిమిది డిపోల పరిధిలో మంగళవారం 666 బస్సులకుగాను 462 బస్సులు మాత్రమే నడిపామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఇందువల్ల జిల్లాలో రూ.46 లక్షలు నష్టం వచ్చిందన్నారు. నడిచిన బస్సుల్లో ప్రయాణీకుల సంఖ్య పెద్దగా లేదు. అద్దె బస్సులు రోడ్డెక్కలేదు. మధ్యాహ్నం నుంచి ఒకటి, అర బస్సులను నడిపారు. కడప ఆర్టీసీ బస్టాండ్ వద్ద చిత్తూరుకు వెళ్తున్న బస్సు అద్దాలు పగులగొట్టారు. కృష్ణా సర్కిల్‌లో ఆందోళనకారులు సుమో అద్దాన్ని పగులగొట్టారు. ఈ ఘటనకు కారకులైన వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ నవీన్‌గులాఠీ ఆదేశాల మేరకు డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రత్యేక హోదా సాధించే వరకు పోరాటం : ఈశ్వరయ్య
ప్రత్యేక హోదా సాధించేవరకు పోరాటం చేస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కడప నగరంలో బంద్‌ను పర్యవేక్షిస్తూ మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు రాష్ట్ర పునర్విభజన బిల్లులోని అన్ని అంశాలు అమలు చేసే సత్తా, అనుభవం తమకే ఉందని అటు నరేంద్రమోదీ, ఇటు చంద్రబాబు రాష్ట్ర ప్రజలను నమ్మించి ఓట్లు దండుకుని అందలం ఎక్కగానే ప్రత్యేక హోదా కుదరదని చెప్పడం దారుణమన్నారు.
కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ప్రత్యేక హోదా వచ్చేసిందని చంద్రబాబుతో కలిసి సన్మానాలు కూడా చేయించుకున్నారన్నారు. మరోమంత్రి సుజనాచౌదరి వచ్చే సమావేశాల్లో ప్రత్యేక హోదా సాధించి తీరుతామని పదేపదే పలికి నేడు ప్రత్యామ్నాయం ఆలోచిస్తున్నామని రాష్ట్ర ప్రజలను నిలువునా మోసం చేస్తుంటే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉంటూ తన చుట్టూ ఉన్న వ్యక్తుల వ్యాపార ప్రయోజనాల పరిరక్షణే ధ్యేయంగా పని చేస్తున్నారన్నారు.