
మా విజయాలను కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది
అందుకే పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటోంది: వెంకయ్య
సాక్షి, బెంగళూరు: కేంద్రంలోని తమ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు అడిగే అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నా పార్లమెంటు కార్యకలాపాలను జరగనివ్వకూడదనే ఆలోచనతోనే కాంగ్రెస్ నేతలు సమావేశాలను అడ్డుకుంటున్నారని శనివారమిక్కడ విలేకర్లతో అన్నారు.
లలిత్‌మోదీ అంశంతోపాటు వ్యాపం తదితర అంశాలపై చర్చకు కాంగ్రెస్ నోటీస్ కూడా ఇచ్చిందని, అయితే సమావేశాలు ప్రారంభమైన తర్వాత మాత్రం చర్చ జరగనివ్వలేదని అన్నారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను కాంగ్రెస్ నేతలు ‘క్రిమినల్’గా పేర్కొనడంపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఒక సెంటు భూమినీ ప్రభుత్వం సేకరించకుండా అడ్డుపడతానన్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై వెంకయ్య మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు కనీస పరిహారం ఇవ్వకుండా 10 లక్షల ఎకరాలు సేకరించారన్నారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ బెంగళూరు గుండానే వెళ్లారని, కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు ఆయనకు కనిపించలేదా అని ప్రశ్నించారు.