Lalitmodi
-
మా విజయాలను కాంగ్రెస్ ఓర్వలేకపోతోంది
అందుకే పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటోంది: వెంకయ్య సాక్షి, బెంగళూరు: కేంద్రంలోని తమ ప్రభుత్వం సాధిస్తున్న విజయాలను చూసి ఓర్వలేకే కాంగ్రెస్ నేతలు పార్లమెంటు సమావేశాలను అడ్డుకుంటున్నారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు దుయ్యబట్టారు. ప్రతిపక్షాలు అడిగే అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నా పార్లమెంటు కార్యకలాపాలను జరగనివ్వకూడదనే ఆలోచనతోనే కాంగ్రెస్ నేతలు సమావేశాలను అడ్డుకుంటున్నారని శనివారమిక్కడ విలేకర్లతో అన్నారు. లలిత్‌మోదీ అంశంతోపాటు వ్యాపం తదితర అంశాలపై చర్చకు కాంగ్రెస్ నోటీస్ కూడా ఇచ్చిందని, అయితే సమావేశాలు ప్రారంభమైన తర్వాత మాత్రం చర్చ జరగనివ్వలేదని అన్నారు. కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్‌ను కాంగ్రెస్ నేతలు ‘క్రిమినల్’గా పేర్కొనడంపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి ఒక సెంటు భూమినీ ప్రభుత్వం సేకరించకుండా అడ్డుపడతానన్న కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీపై వెంకయ్య మండిపడ్డారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో రైతులకు కనీస పరిహారం ఇవ్వకుండా 10 లక్షల ఎకరాలు సేకరించారన్నారు. అనంతపురం జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు రాహుల్ బెంగళూరు గుండానే వెళ్లారని, కర్ణాటకలో రైతుల ఆత్మహత్యలు ఆయనకు కనిపించలేదా అని ప్రశ్నించారు. -
చర్చకు నేను సిద్ధం
లలిత్‌మోదీకి సాయం చేసిన వివాదంలో చిక్కుకున్న కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్.. ఈ అంశంపై పార్లమెంటులో చర్చకు సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నారు. ‘‘తొలి రోజునే చర్చ చేపట్టటానికి నేను సిద్ధంగా ఉన్నా. ఈ విషయాన్ని రాజ్యసభకు తెలపాలని నేను జైట్లీని కోరాను. ఆయన సభకు తెలియజేశారు. విపక్షస్పందన కోసం మేం వేచిచూస్తున్నాం’’ అని ఆమె ట్వీట్ చేశారు. -
జూలై 21 నుంచి పార్లమెంటు
-
జూలై 21 నుంచి పార్లమెంటు
ఆగస్టు 13 వరకు జరగనున్న వర్షాకాల సమావేశాలు పార్లమెంటును కుదిపేయనున్న లలిత్‌మోదీ వివాదం, భూసేకరణ బిల్లు న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జూలై 21న ప్రారంభమై ఆగస్టు 13 వరకు సమావేశాలు జరగనున్నాయి. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నేతృత్వంలోని పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీపీఏ) బుధవారం సమావేశమై ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ కమిటీలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ఇతర సీనియర్ మంత్రులు సభ్యులుగా ఉన్నారు. దాదాపు నాలుగు వారాలపాటు సాగనున్న ఈ సమావేశాలు వాడివేడిగా సాగే అవకాశముంది. కొద్దిరోజులుగా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన లలిత్ మోదీ వివాదం ఈసారి పార్లమెంటును కుదిపేయనుంది. ఇద్దరు బీజేపీ సీనియర్ నేతల పాత్ర ఉన్న ఈ అంశంపై కాంగ్రెస్ నుంచి ముప్పేట దాడి తప్పదని సర్కారు భావిస్తోంది. ఈ వివాదంపై విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజేలు రాజీనామా చేయకపోతే సభను సజావుగా సాగనీయబోమని కాంగ్రెస్ ఇప్పటికే హెచ్చరించింది. తమ డిమాండ్లను నెరవేర్చకుంటే ప్రధాని నరేంద్ర మోదీకి ఇబ్బందులు తప్పవని పేర్కొంది. అయితే ప్రభుత్వం మాత్రం కాంగ్రెస్ డిమాండ్‌ను తోసిపుచ్చింది. మరోవైపు, భూసేకరణ బిల్లు కూడా పార్లమెంటులో ప్రకంపనలు సృష్టించనుంది. ఈ బిల్లును ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీకి ప్రతిపాదించారు. తొలుత వర్షాకాల సమావేశాలను జూలై 20న ప్రారంభించాలని ప్రతిపాదించినప్పటికీ 18 లేదా 19 తేదీల్లో రంజాన్ పర్వదినం రానున్నందున సమావేశాలను 21వ తేదీ నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు. వర్షాకాల సమావేశాలు సాధారణంగా నాలుగువారాలు జరుగుతాయి. లోక్‌పాల్, లోకాయుక్త చట్టానికి సవరణలు, రైల్వే (సవరణ) బిల్లు, జలమార్గాల బిల్లు, జీఎస్టీ బిల్లు, భూసేకరణ బిల్లు, అటవీకరణ పరిహార నిధి బిల్లు, బినామీ లావాదేవీల (నిషేధ) సవరణ బిల్లు-2015 తదితర కీలక బిల్లులు పార్లమెంటులో పెండింగ్‌లో ఉన్నాయి. ఈ బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశముంది. గత బడ్జెట్ సమావేశాల్లో లోక్‌సభ 35సార్లు, రాజ్యసభ 32 సార్లు సిట్టింగ్‌లు జరిపాయి. గత ఐదేళ్లలో బడ్జెట్ భేటీ ఇదే అత్యధికం. -
'లలిత్‌మోదీ కేసులో ప్రధాని మౌనమేల?'
-
లలిత్‌మోదీ కేసులో ప్రధాని మౌనమేల? : జైరాం రమేశ్
సాక్షి, హైదరాబాద్: ఎన్ఫోర్సుమెంట్ డెరైక్టరేట్(ఈడీ) కేసుల్లో ఉన్న లలిత్‌మోదీని కేంద్రమంత్రులు వెనుకేసుకొస్తే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభసభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న లలిత్‌మోదీకి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే మద్దతును ఇస్తున్నారని అన్నారు. లలిత్‌మోదీతో వారికి ఆర్థిక, రాజకీయ, వ్యాపార లావాదేవీలు ఉన్నాయని జైరాం రమేశ్ ఆరోపించారు. గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు నరేంద్రమోదీ, అమిత్‌షా అధ్యక్షులుగా పనిచేసినప్పటి నుంచి లలిత్‌మోదీతో సంబంధాలున్నాయన్నారు. లలిత్‌మోదీ విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా నరేంద్ర మోదీ అందుకే మౌనంగా ఉన్నాడని అన్నారు. ఐదారు రోజులుగా కళ్లు, చెవులు మూసుకుని లలితాసనంలోనే ప్రధాని మోదీ ఉన్నారని జైరాం ఎద్దేవా చేశారు. అవినీతిని సహించేది లేదని, సుపరిపాలన అందిస్తామని చెబుతున్న ప్రధాని మోదీ ఇంత బహిరంగంగా దొరికిన కేంద్రమంత్రిని, ముఖ్యమంత్రిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. తెలుగు రాష్ట్రాల సీఎం కేసీఆర్, చంద్రబాబు ఈ విషయంపై ఎందుకు మాట్లాడటంలేదన్నారు. లలిత్‌మోదీ విషయంలో సీనియర్ నాయుడు, జూనియర్ నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని జైరాం ప్రశ్నించారు. సీనియర్ నాయుడు ఎవరో, జూనియర్ నాయుడు ఎవరో మీరు తేల్చుకోవాలన్నారు. ఓటుకు కోట్లు కేసు విషయలో ఎక్కువగా మాట్లాడబోనన్నారు. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మాస్వరాజ్, వసుంధర రాజే రాజీనామా చేయాలని జైరాం డిమాండ్ చేశారు.