
లలిత్‌మోదీ కేసులో ప్రధాని మౌనమేల? : జైరాం రమేశ్
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఫోర్సుమెంట్ డెరైక్టరేట్(ఈడీ) కేసుల్లో ఉన్న లలిత్‌మోదీని కేంద్రమంత్రులు వెనుకేసుకొస్తే ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని కేంద్ర మాజీమంత్రి, రాజ్యసభసభ్యుడు జైరాం రమేశ్ ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈడీ కేసులను ఎదుర్కొంటున్న లలిత్‌మోదీకి కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజే మద్దతును ఇస్తున్నారని అన్నారు. లలిత్‌మోదీతో వారికి ఆర్థిక, రాజకీయ, వ్యాపార లావాదేవీలు ఉన్నాయని జైరాం రమేశ్ ఆరోపించారు.
గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌కు నరేంద్రమోదీ, అమిత్‌షా అధ్యక్షులుగా పనిచేసినప్పటి నుంచి లలిత్‌మోదీతో సంబంధాలున్నాయన్నారు. లలిత్‌మోదీ విషయంలో పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నా నరేంద్ర మోదీ అందుకే మౌనంగా ఉన్నాడని అన్నారు. ఐదారు రోజులుగా కళ్లు, చెవులు మూసుకుని లలితాసనంలోనే ప్రధాని మోదీ ఉన్నారని జైరాం ఎద్దేవా చేశారు. అవినీతిని సహించేది లేదని, సుపరిపాలన అందిస్తామని చెబుతున్న ప్రధాని మోదీ ఇంత బహిరంగంగా దొరికిన కేంద్రమంత్రిని, ముఖ్యమంత్రిపై చర్యలెందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.
తెలుగు రాష్ట్రాల సీఎం కేసీఆర్, చంద్రబాబు ఈ విషయంపై ఎందుకు మాట్లాడటంలేదన్నారు. లలిత్‌మోదీ విషయంలో సీనియర్ నాయుడు, జూనియర్ నాయుడు ఎందుకు మౌనంగా ఉన్నారని జైరాం ప్రశ్నించారు. సీనియర్ నాయుడు ఎవరో, జూనియర్ నాయుడు ఎవరో మీరు తేల్చుకోవాలన్నారు. ఓటుకు కోట్లు కేసు విషయలో ఎక్కువగా మాట్లాడబోనన్నారు. నేర ఆరోపణలు ఎదుర్కొంటున్న సుష్మాస్వరాజ్, వసుంధర రాజే రాజీనామా చేయాలని జైరాం డిమాండ్ చేశారు.