
మహిళలు ఆర్థిక పురోభివృద్ధి సాధించాలి
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు
విజయవాడ : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నప్పటికీ ఆర్థికంగా సుసంపన్నులు కా వాలని, అందుకు ఎన్డీఏ ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. మహాత్మాగాంధీ రోడ్డులోని హోటల్ గేట్‌వేలో శనివారం ఎమర్జింగ్ గ్లోబల్ బిజినెస్‌లో ఎంటర్ ప్రెనియర్స్‌కు ఉన్న అవకాశాలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. అసోసియేషన్ ఆఫ్ లేడీ ఎంటర్‌ప్రెనియర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (అలీప్) ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో వెంకయ్యనాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ మహిళా పారిశ్రామిక వేత్తలను కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు.
గ్రామీణ మహిళలు వృత్తి నైపుణ్యాలను పెంచుకుని అక్కడే చిన్న పరిశ్రమలను స్థాపించాలని ఆయన సూచించారు. నేడు యువత గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు ఆగాలంటే గ్రామాల్లో ఆధునిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. అమ్మాయి పుడితే చిరునవ్వుతో స్వాగతించాలని, వృద్ధాప్యంలో తల్లిదండ్రులను అబ్బాయిలకంటే అమ్మాయిలే బాగా చూసుకుంటారని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.
సదస్సులో ప్రారంభోపన్యాసం చేసిన అలీప్ అధ్యక్షురాలు రమాదేవి మాట్లాడుతూ అలీప్ ఆధ్వర్యంలో మహిళలకు చేతివృత్తుల్లో నైపుణ్యాలను పెంపొం దించే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ఒక పాలసీని రూపొందించాలని కోరారు. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గద్దే అనురాధ, అలీప్ సెక్రటరీ పద్మజాప్రభాకర్, సీఎస్ రామలక్ష్మి, డాక్టర్ హెచ్.పురుషోత్తం పాల్గొన్నారు. అనంతరం వివిధ అంశాలపై పలువురు నిపుణులు ప్రసంగించారు.