నరేంద్రమోదీ ఆత్మగా వెంకయ్య | Modi spirit Venkaiah | Sakshi
Sakshi News home page

నరేంద్రమోదీ ఆత్మగా వెంకయ్య

Published Fri, May 29 2015 5:02 AM | Last Updated on Wed, Aug 15 2018 6:34 PM

Modi spirit Venkaiah

సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే నారాయణ
 
 సూళ్లూరుపేట : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మగా కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే నారాయణ ఆరోపించారు. గురువారం సాయంత్రం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రాకపోవడానికి ఈ ఇద్దరు నాయుళ్లే కారణమన్నారు. వీరిద్దరికీ చిత్తశుద్ధి ఉంటే టీడీపీ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలన్నారు. అదేవిధంగా వెంకయ్యనాయుడు తన మంత్రి పదవిని వదులుకోవాలని డిమాండ్ చేశారు.

నరేంద్రమోడీ భిక్షాందేహి అని అడుక్కుంటూ రాష్ట్ర ప్రజలను సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు.  ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో సుమారు గంటపాటు మాట్లాడిన వెంకయ్య నాయుడుకు పదవి రాగానే నోరు పడిపోయిందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అంటిపెట్టుకుని ఉన్న చంద్రబాబునాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆనాడు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎన్‌టీఆర్ కాపాడితే ఇప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారన్నారు.  అందుకే ప్రత్యేక హోదా కోసం సీపీఐ పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పారు.

వీరిద్దరిలో ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే తాము చేసే పోరాటానికి మద్దతివ్వాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మతోన్మాద పరిపాలన చేస్తున్నారని, చివరకు న్యాయవ్యవస్థను సైతం శాసిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు నుంచి బయటకు వస్తే ఆమెను ప్రధానమంత్రి అభినందించడం చూస్తుంటే ఆయన న్యాయవ్యవస్థను ఏ విధంగా శాసిస్తున్నారో అర్థమవుతుందన్నారు.  స్థానిక నాయకులు మోదుగుల పార్థసారథి, రమణయ్య, ఆనంద్, సుధాకర్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement