jayalalitha case
-
అమ్మ ఆరోగ్యం హఠాత్తుగా క్షీణించింది
సాక్షి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (అమ్మ) ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని ఆమె నెచ్చెలి శశికళ ఓ అఫిడవిట్లో తెలిపారు. జయ మరణానికి దారితీసిన పరిస్థితులను విచారిస్తున్న ఆరుముగసామి కమిషన్‌కు శశికళ తరఫు లాయర్ సమర్పించిన ఆ అఫిడవిట్ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటకు వచ్చాక జయలలిత తీవ్ర మనోవేదనకు గురయ్యారని శశికళ అఫిడవిట్లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందనీ, 2016 సెప్టెంబరు 22న రాత్రి బాత్రూంలో పడిపోవడంతో డాక్టర్ శివకుమార్‌ను పిలిపించానని తెలిపారు. అపోలో ఆస్పత్రికి వెళ్లే దారిలోనే జయ స్పృహలోకి వచ్చి, ఆస్పత్రికి వద్దే వద్దని కోప్పడ్డారని పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి, చికిత్స జరిపిన వైద్యులు, డిసెంబరు ఐదు వరకు ఆమెను ఎవరెవరు పరామర్శించారు తదితర వివరాలను ప్రమాణ పత్రంలో పొందుపరిచారు. గవర్నర్ విద్యాసాగర్ రావు, భద్రత అధికారులు వీర పెరుమాళ్ స్వామి, పెరుమాళ్ స్వామి, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం, ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, కార్మిక మంత్రి నిలోఫర్ కబిల్, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తదితరులు జయలలితను పరామర్శించిన వారిలో ఉన్నట్లు వివరించారు. డిసెంబరు నాలుగో తేదీన ‘జై హనుమాన్’ సీరియల్ చూసిన కాసేపటికే ఆమెలో వణుకుడును పుట్టిందనీ ఆ మరుసటి రోజే చనిపోయారని తెలిపారు. -
నరేంద్రమోదీ ఆత్మగా వెంకయ్య
సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే నారాయణ సూళ్లూరుపేట : ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆత్మగా కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు కే నారాయణ ఆరోపించారు. గురువారం సాయంత్రం స్థానిక సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా రాకపోవడానికి ఈ ఇద్దరు నాయుళ్లే కారణమన్నారు. వీరిద్దరికీ చిత్తశుద్ధి ఉంటే టీడీపీ బీజేపీతో తెగతెంపులు చేసుకోవాలన్నారు. అదేవిధంగా వెంకయ్యనాయుడు తన మంత్రి పదవిని వదులుకోవాలని డిమాండ్ చేశారు. నరేంద్రమోడీ భిక్షాందేహి అని అడుక్కుంటూ రాష్ట్ర ప్రజలను సిగ్గుతో తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్లో సుమారు గంటపాటు మాట్లాడిన వెంకయ్య నాయుడుకు పదవి రాగానే నోరు పడిపోయిందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని అంటిపెట్టుకుని ఉన్న చంద్రబాబునాయుడు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని విమర్శించారు. ఆనాడు తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ కాపాడితే ఇప్పుడు ఆయన అల్లుడు చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మాభిమానాన్ని తాకట్టు పెట్టారన్నారు. అందుకే ప్రత్యేక హోదా కోసం సీపీఐ పోరాటాలకు సిద్ధమవుతుందని చెప్పారు. వీరిద్దరిలో ఎవరికైనా చిత్తశుద్ధి ఉంటే తాము చేసే పోరాటానికి మద్దతివ్వాలన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ మతోన్మాద పరిపాలన చేస్తున్నారని, చివరకు న్యాయవ్యవస్థను సైతం శాసిస్తున్నారని ఆరోపించారు. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కేసు నుంచి బయటకు వస్తే ఆమెను ప్రధానమంత్రి అభినందించడం చూస్తుంటే ఆయన న్యాయవ్యవస్థను ఏ విధంగా శాసిస్తున్నారో అర్థమవుతుందన్నారు. స్థానిక నాయకులు మోదుగుల పార్థసారథి, రమణయ్య, ఆనంద్, సుధాకర్ పాల్గొన్నారు. -
'జయలలిత కేసుపై సుప్రీంకు వెళ్లండి'
చెన్నై: అక్రమాస్తుల కేసులో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, ఏఐడీఎంకే అధినేత్రి జయలలితను కర్ణాటక హైకోర్టు నిర్దోషిగా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని తమిళ రాజకీయ పార్టీలు కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. డీఎంకే సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వానికి విన్నవించాయి. జయలలిత కేసులో కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కోర్టులో అప్పీలు చేయాలని డీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కోరారు. హైకోర్టు తీర్పును (జయలలిత నిర్దోషిగా బయటపడటం) తాను ఊహించలేకపోయానని డీఎండీకే చీఫ్ విజయకాంత్ అన్నారు. కర్ణాటక అప్పీలు చేయాలని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎళంగోవన్ కోరారు. సీబీఐ ప్రత్యేక కోర్టు, హైకోర్టు తీర్పుల్లో చాలా వ్యత్యాసముందని ఆయన అభిప్రాయపడ్డారు. పీఎంకే అధినేత రాందాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.