సాక్షి, చెన్నై: అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత (అమ్మ) ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించిందని ఆమె నెచ్చెలి శశికళ ఓ అఫిడవిట్‌లో తెలిపారు. జయ మరణానికి దారితీసిన పరిస్థితులను విచారిస్తున్న ఆరుముగసామి కమిషన్‌కు శశికళ తరఫు లాయర్ సమర్పించిన ఆ అఫిడవిట్ వివరాలు బుధవారం వెలుగులోకి వచ్చాయి. అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లి, బెయిల్ మీద బయటకు వచ్చాక జయలలిత తీవ్ర మనోవేదనకు గురయ్యారని శశికళ అఫిడవిట్‌లో పేర్కొన్నారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణించిందనీ, 2016 సెప్టెంబరు 22న రాత్రి బాత్‌రూంలో పడిపోవడంతో డాక్టర్ శివకుమార్‌ను పిలిపించానని తెలిపారు.
అపోలో ఆస్పత్రికి వెళ్లే దారిలోనే జయ స్పృహలోకి వచ్చి, ఆస్పత్రికి వద్దే వద్దని కోప్పడ్డారని పేర్కొన్నారు. జయలలిత ఆరోగ్య పరిస్థితి, చికిత్స జరిపిన వైద్యులు, డిసెంబరు ఐదు వరకు ఆమెను ఎవరెవరు పరామర్శించారు తదితర వివరాలను ప్రమాణ పత్రంలో పొందుపరిచారు. గవర్నర్ విద్యాసాగర్ రావు, భద్రత అధికారులు వీర పెరుమాళ్ స్వామి, పెరుమాళ్ స్వామి, అప్పుడు ఆర్థిక మంత్రిగా ఉన్న పన్నీరు సెల్వం, ఆరోగ్య మంత్రి విజయ భాస్కర్, కార్మిక మంత్రి నిలోఫర్ కబిల్, పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ తంబిదురై తదితరులు జయలలితను పరామర్శించిన వారిలో ఉన్నట్లు వివరించారు. డిసెంబరు నాలుగో తేదీన ‘జై హనుమాన్’ సీరియల్ చూసిన కాసేపటికే ఆమెలో వణుకుడును పుట్టిందనీ ఆ మరుసటి రోజే చనిపోయారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment