
బీజేపీని సర్వవ్యాప్తం చేయాలి
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
నరసరావుపేటవెస్ట్ : ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వంలోని బీజేపీ-ఎన్‌డీఏ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలపై విస్తృత ప్రచారం చేసి పార్టీని సర్వవ్యాప్తం చేయాలని కేంద్ర పట్టణాభివృద్ది, పార్లమెంటరీ వ్యవహారాలశాఖామంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. పట్టణంలోని జమిందారు ఫంక్షన్‌హాలులో శుక్రవారం జిల్లా అధ్యక్షుడు పోట్రు పూర్ణచంద్రరావు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ జిల్లా కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి మాట్లాడారు. గతంలో బీజేపీ ఉత్తరాదిపార్టీగా చెప్పుకునేవారని, ఇప్పుడు దక్షణాది రాష్ట్రాలకు విస్తరించిందని చెప్పారు.
కర్ణాటకలో 18 ఎంపీలు, ఏపీలో ఇద్దరు, తెలంగాణాలో ఒకరు ఉన్నారన్నారు. రాష్ట్ర ఆరోగ్యశాఖామంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ నాబార్డు సహాయంతో రాష్ట్రానికి విడుదలైన రూ.384కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.16కోట్లు కలిపి మొత్తం రూ.400కోట్లతో రాష్ట్రంలో 139 పాత, కొత్త వైద్యశాలలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. పార్టీ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్ కంభంపాటి హరిబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో 6500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటుకు కేంద్రం అనుమతి ఇచ్చిందన్నారు.
ఐఐటీ, ఏఐఎంఎంఎస్ లాంటి అత్యున్నత సంస్థలను రాష్ట్రంలో ఏర్పాటుచేస్తుందని చెప్పారు. కార్యక్రమంలో రాజమండ్రి ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రాష్ట్ర క్రమశిక్షణ సంఘ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ముల శ్యాంకిషోర్, రాష్ట్ర నాయకులు యడ్లపాటి రఘునాథబాబు, బీజేపీ జోనల్ ఇన్‌చార్జి ఆల్.లక్ష్మీపతి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వల్లెపు కృపారావు, అసెంబ్లీ నేత డాక్టర్ నలబోతు వెంకటరావు, కో ఆప్షన్ సభ్యుడు ఇత్తడి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.