వరంగల్ ఇక స్మార్ట్
తొలిదశలో అమలు కష్టమే..
గ్రేటర్‌అధికారులపైనే భారం
రూ.500 కోట్లతో అభివృద్ధి
స్మార్ట్‌సిటీల జాబితాను వెల్లడించిన కేంద్ర మంత్రి
హన్మకొండ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన స్మార్ట్‌సిటీ జాబితాలో వరంగల్ చోటు సాధించింది. దేశవ్యాప్తంగా 98 నగరాలు స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకోగా.. తెలంగాణ రాష్ట్రం నుంచి హైదరాబాద్, వరంగల్ నగరాలు చోటు సంపాదించాయి. ఇక ప్రయోజనాలు చాలా ఉన్నారుు. పట్టణ, నగర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం స్మార్ట్‌సిటీ పథకాన్ని ప్రవేశపెట్టింది. ముఖ్యంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తూ నగర జీవనంలో నిత్యం తలెత్తే క్లిష్లమైన సమస్యలను సులభతరం చేయడం ఈ పథకం ప్రధాన లక్ష్యం. నగర పరిపాలనను క్రమంగా ఈ గవర్నెన్స్ విధానంలోకి మార్చుతారు. నగరాల్లో 24 గంటలు నాణ్యమైన విద్యుత్, మంచినీటి సరఫరా అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు. నగరంలో నిత్యం పోగయ్యే చెత్తతో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఘనపదార్థాల నిర్వహణ (సాలీడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్) పద్ధతిని తప్పనిసరి చేస్తారు. ప్రజలు, నగరపాలక సంస్థలకు మధ్య వారధిగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. కార్పొరేషన్‌లో ఉన్న భూమి రికార్డులు, మ్యాపులు, లే అవుట్లు, పన్నుల వసూళ్లు, బకాయిలు అన్ని వివరాలు డిజిటలైజేషన్ చేస్తే ప్రక్రియ వేగం పుంజుకుంటుంది. నగరంలో పర్యావరణ కాలుష్యం తగ్గించే దిశగా ప్రజా, వ్యక్తిగత రవాణాలో మార్పులు తీసుకొస్తారు. ఏకో ఫ్రెండ్లీ భవన నిర్మాణాలను ప్రోత్సహిస్తారు.
రూ.500 కోట్లు
స్మార్ట్‌సిటీగా ఎంపికైన నగరాలకు రూ.500 కోట్లు మంజూరవుతాయి. ఈ ఆర్థిక సంవత్సరం అంతానికి తొలిదశలో ఏకమొత్తంలో రూ.200 కోట్లు, ఆ తర్వాత ఏడాదికి రూ.100 కోట్ల వంతున రాబోయే మూడేళ్లలో నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. దేశం 98 నగరాలను స్మార్ట్‌సిటీలుగా అభివృద్ధి చేయాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో తొలిదశంలో కనిష్టంగా 5.. గరిష్టంగా 20 నగరాలలో స్మార్ట్ పథకాన్ని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. కేంద్రం విధించిన నిబంధనలు పాటించే నగరాలకు స్కోర్‌ను కేటాయిస్తారు. ఈ స్కోరు ఆధారంగానే తర్వాత రెండో, మూడో దశలలో స్మార్ట్‌సిటీ పథకాన్ని అమలు చేస్తారు. సాలిడ్ వేస్ట్‌మేనేజ్‌మెంట్, లోపాలు లేకుండా అకౌంట్స్ నిర్వాహణ, సమాచార సాంకేతికను ఉపయోగిస్తూ కార్పొరేషన్ ద్వారా అందుతున్న పౌర సేవలు సులభతరం చేయడం, ఈ లెటర్స్, కార్పొరేషన్‌తో సంబంధం ఉండే వివిధ ప్రభుత్వ శాఖలను సమన్వయం చేస్తూ మెరుగైన సేవలు అందించేందుకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేయడం తదితర అంశాల అమలును బట్టి స్కోరును కేటాయిస్తారు.
తొలిదశలో కష్టమే..
స్మార్ట్‌సిటీ జాబితాలో మొదటి, రెండో దశ అమలులో స్థానం దక్కించుకునే నగరాలకే ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. అయితే తొలి రెండు దశల్లో చోటు దక్కించుకోవడం కోసం భారీ కసరత్తే చేయాలి. స్మార్ట్‌సిటీ నిబంధనలకు అనుగుణంగా చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి సమగ్ర నివేదికను అందివాలి. కార్పొరేషన్ పరిధిలో ఉన్న స్థలాలు, ఇళ్లు, పన్నులు, మ్యాపులు, లేఅవుట్లు తదితర సమాచారాన్ని డిజిటలైజేషన్ చేయాలి. పద్దులను పారదర్శకంగా నిర్వహించాల్సి ఉంటుంది. వరంగల్ నగరం విషయానికి వస్తే గడిచిన నాలుగేళ్లుగా అకౌంట్ ప్రక్రియ పూర్తి కాకపోవడం మొదటి అవరోధంగా మారనుంది. చాలా ఏళ్లుగా పెండింగ్‌లో డబుల్ అకౌంటింగ్ పూర్తయ్యేందుకు మరో మూడు నెలల సమయం పట్టనున్నట్లు తెలుస్తుంది. తొలిదశ నగరాల జాబితాను ప్రకటించేందుకు మరో నాలుగు నెలల సమయం ఉంది. ఈలోగా కార్పొరేష న్ పాలన వ్యవస్థలో గణనీయమైన మార్పులు తీసుకురావాల్సి ఉంది.