స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కేబినెట్ ఓకే
అటల్ యోజనకూ పచ్చజెండా
రెండు ప్రాజెక్టులకు మొత్తం లక్ష కోట్ల బడ్జెట్
చక్కెర దిగుమతి సుంకం పెంపు
అవినీతి శిక్షాకాలం ఏడేళ్లకు పెంపు
న్యూఢిల్లీ: నరేంద్రమోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ఈ మేరకు ఆమోదముద్ర వేసింది. స్మార్ట్‌సిటీ ప్రాజెక్టుతో పాటు అటల్ పట్టణ నవీకరణ, పునరుద్ధరణ యోజన(అమృత్)కూడా కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. వంద స్మార్ట్ నగరాలకు రూ. 48 వేల కోట్లు, అమృత్ పథకానికి రూ. 50 వేల కోట్ల బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం లభించినట్లు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసిన వంద నగరాలలో ఒక్కో నగరానికి ఏడాదికి 100 కోట్ల చొప్పున అయిదు సంవత్సరాల పాటు కేంద్రం సహాయం చేస్తుంది.
ఈ ప్రాజెక్టు కింద కేంద్రం రూపొందించిన నిబంధనలకు అనుగుణంగా ప్రతీ రాష్ట్రం స్మార్ట్ సిటీలకు తగిన నగరాలను ఎంపిక చేసి ప్రతిపాదనలను పంపించాల్సి ఉంటుంది. వాటి నుంచి కేంద్రం తుది జాబితాను ఖరారు చేసి ఆ నగరాలకు ఆర్థిక సహకారాన్ని అందిస్తుంది. రాష్ట్రాలు, ఆయా నగర స్థానిక సంస్థలు ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో మిగతా నిధులను సమకూర్చుకోవలసి ఉంటుంది. అమృత్ పథకం కింద 500 పట్టణాలను అభివృద్ధి చేస్తారు. మౌలిక సదుపాయాల కల్పన, తాగునీటి సదుపాయం, మురుగు కాల్వల నిర్వహణ, రవాణా, మొక్కల పెంపకం, పార్కుల అభివృద్ధి వంటి వాటికి అమృత్ పథకం కింద కేంద్ర సహాయం లభిస్తుంది.
జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం రెండేళ్ల పొడిగింపు
యూపీఏ సర్కారు పదేళ్లపాటు కొనసాగించిన జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకాన్ని మరో రెండేళ్ల పాటు పొడిగించటానికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం తీసుకుంది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 3 లక్షల మంది పట్టణ పేదలకు పక్కా ఇళ్లు లభించనున్నాయి. ఇందుకోసం కేంద్రం రాష్ట్రాలకు దాదాపు 350 కోట్ల రూపాయలను విడుదల చేస్తుంది.
చక్కెర దిగుమతి సుంకం పెంపు
చక్కెర దిగుమతి సుంకాన్ని 40 శాతం పెంచటానికి కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 25 శాతంగా ఉన్న సుంకాన్ని పెంచటంతో పాటు మొలాసిస్ నుంచి తయారయ్యే ఇథనాల్‌పై ఎక్సైజ్ సుంకాన్ని పూర్తిగా రద్దు చేసింది. దీని ద్వారా చక్కెర మిల్లులు రైతులకు చెల్లించాల్సి ఉన్న 21 వేల కోట్ల రూపాయల బకాయిలు చెల్లించటం సాధ్యపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.
ఎన్డీఆర్‌ఎఫ్‌కు రెండు కొత్త బెటాలియన్లు
జాతీయ విపత్తు సహాయక దళానికి కొత్తగా రెండు బెటాలియన్లను ప్రభుత్వం మంజూరు చేసింది. సరిహద్దులో గస్తీ నిర్వహిస్తున్న సశస్త్ర సేనాబల్‌కు చెందిన రెండు బెటాలియన్లను ఎన్డీఆర్‌ఎఫ్‌ను బలోపేతం చేయటానికి బదిలీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది. దీంతో ఎన్డీఆర్‌ఎఫ్ దళంలో మరో రెండువేల మంది చేరినట్టవుతుంది.
కాటన్ కార్పొరేషన్‌కు ఆర్థిక సాయం
రైతుల నుంచి కొనుగోలు చేసిన పత్తి అమ్మకాల్లో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు వచ్చిన నష్టాలను పూడ్చటానికి సాయం అందివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. పత్తికి మద్దతు ధరను రకాలను బట్టి క్వింటల్‌కు రూ.3750, 4050గా నిర్ణయించినట్లు ప్రభుత్వం తెలిపింది.
హేయమైన నేరంగా అవినీతి
అవినీతికి పాల్పడటాన్ని హేయమైన నేరాల విభాగంలోకి చేర్చాలన్న ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ అంగీకారం తెలిపింది. దీంతో అవినీతికి పాల్పడ్డ వారికి ప్రస్తుతం అయిదేళ్లుగా ఉన్న శిక్షాకాలం ఇకపై ఏడేళ్లకు పెరుగుతుంది. అంతే కాకుండా, లంచం తీసుకున్న వారితో పాటు లంచం ఇచ్చిన వారికి శిక్షా కాలాన్ని పెంచుతూ 1988 అవినీతి నిరోధక చట్టంలో సవరణలను ప్రతిపాదించారు. .
కనీస వెయ్యి పింఛన్ కొనసాగింపు
ఉద్యోగ భవిష్యనిధి పథకం అమలుచేస్తున్న వెయ్యి రూపాయల కనీస పింఛను పథకాన్ని కొనసాగించాలని కేంద్ర మంత్రిమండలి నిర్ణయించింది. 1995 ఉద్యోగుల పింఛను పథకం కింద ఇస్తున్న పింఛన్‌ను ఈపీఎఫ్‌ఓ రిటైర్‌మెంట్ ఫండ్ బోర్డు ఎప్రిల్ 1 నుంచి నిలిపివేసిన సంగతి తెలిసిందే.