ఢిల్లీలో కొత్త పథకాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ. స్మార్ట్ సిటీ పథకం మోడల్‌ను పరిశీలిస్తున్న మోదీ, వెంకయ్య
నగరం ఎలా పెరగాలో ప్రజలే నిర్ణయించాలి: ప్రధాని
* పన్ను వసూళ్లలోహైదరాబాద్‌లా ఇతర నగరాలూ చేయాలి
సాక్షి, న్యూఢిల్లీ: పట్ణణీకరణను ఒక అవకాశంగా గుర్తించాలని.. పట్టణ కేంద్రాలను అభివృద్ధి చోదకాలుగా పరిగణించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. నగరం ఎలా పెరగాలనేదానిని ఆ నగర నివాసులు, నగర నాయకత్వం నిర్ణయించాలని.. ప్రయివేటు స్థిరాస్తి డెవలపర్లు కాదని వ్యాఖ్యానించారు.
నగరాలను అభివృద్ధి చోదకాలుగా మలచటం లక్ష్యంగా రూపొందించిన మూడు భారీ పథకాలు.. అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్ (అమృత్), స్మార్ట్ సిటీస్ మిషన్, హౌసింగ్ ఫర్ ఆల్ (అర్బన్) కార్యక్రమాలను ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలోని విజ్ఞాన్‌భవన్‌లో ప్రారంభించారు. ఈ పథకాల అమలుకు సంబంధించి ప్రాజెక్టుల రూపకల్పన, అనుమతి, అమలు తదితరాలపై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు పూర్తి స్వేచ్ఛనిస్తూ మార్గదర్శకాలనూ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పై మూడు పథకాలూ ప్రపంచ స్థాయి పట్టణ ప్రాంతాల నిర్మాణానికి ప్రజలు కేంద్రంగా ఉండే విధానాన్ని తీసుకొస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్రాల భాగస్వామ్యంతో 100 స్మార్ట్ సిటీల నిర్మాణం, అమృత్ పథకం కింద ఐదేళ్లలో 500 నగరాల పునరభివృద్ధి, అందరికీ ఇల్లు పథకం కింద 2022 నాటికి రెండు కోట్ల మంది పట్టణ పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టటం జరుగుతుందని వివరించారు. బిల్డర్ల ప్రతిష్ట చెడ్డగా ఉందని.. ఇంటి కొనుగోలుదారులకు కేంద్రం రక్షణ కల్పిస్తుందని.. ఇందుకు సంబంధించిన బిల్లును పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో ప్రవేశపెడతామని మోదీ పేర్కొన్నారు.
హైదరాబాద్‌లా మీరూ చేయండి..
‘‘హైదరాబాద్‌లో ఆస్తి పన్ను పెంచకుండానే వసూళ్లలో వృద్ధి కనబరిచారు. అలా ఇతర మునిసిపాలిటీలు ఎందుకు చేయకూడదు? ఒక్కో మునిసిపాలిటీ ఒక్కో అంశంలో ముందంజలో ఉన్నప్పుడు.. ఆయా అంశాలన్నింటీని అన్ని మునిసిపాలిటీలు అమలు చేస్తే నగరాలన్నీ అభివృద్ధి చెందుతాయి...’’ అని మోదీ పేర్కొన్నారు. అంతకుముందు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను వసూలు వృద్ధిపై ప్రధానికి ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ‘హైదరాబాద్‌లో ఆస్తి పన్ను రేటు పెంచలేదు. కానీ ఎక్కడెక్కడ రావడం లేదో.. అవన్నీ వచ్చేలా చూశాం.
దాదాపు 270 కేసులను కోర్టు బయట పరిష్కరించాం. 2004లో ఆస్తి పన్ను మొత్తం రూ. 156 కోట్లు ఉంటే.. గత ఏడాది అది రూ. 1,125 కోట్లకు పెరిగింది’ అని తెలిపారు. కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు మాట్లాడుతూ నగర ప్రజల అవసరాలు తీరాలంటే ఆయా పురపాలక సంఘాలు సంస్కరణలు చేపట్టాలని పిలుపునిచ్చారు. మెరుగైన సేవలందిస్తే వినియోగ రుసుం చెల్లించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు.
పట్టణాలు అభివృద్ధి చోదకాలు
Published Fri, Jun 26 2015 3:26 AM | Last Updated on Fri, Aug 24 2018 2:17 PM
Advertisement