కఠిన నిర్ణయాలతోనే ‘స్మార్ట్’
* స్మార్ట్ సిటీల పథకంపై కేంద్ర మంత్రి వెంకయ్య
* పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలి
* స్మార్ట్ సిటీల జాతీయ సదస్సులో పిలుపు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం చేపట్టిన ‘వంద స్మార్ట్ సిటీల’ పథకంలో చోటు ఆశిస్తున్న నగరాలకు అభివృద్ధి కోసం కఠిన నిర్ణయాలు తీసుకోగల సంసిద్ధత ఉండాలని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ‘సౌకర్యవంతమైన జీవనం, మెరుగైన జీవన ప్రమాణాలు, సుపరిపాలన, చక్కటి ఆరోగ్య, విద్యా సేవలు, రోజూ 24 గంటల విద్యుత్, నీరు, నాణ్యమైన రవాణా, పారిశుద్ధ్యం, ఉపాధి, సైబర్ అనుసంధానం అందించడం ఈ సిటీల ఉద్దేశం’ అని పేర్కొన్నారు. శుక్రవారమిక్కడ స్మార్ట్ సీటీల పథకంపై జరిగిన జాతీయ సదస్సులో వెంకయ్య ప్రసంగించారు.
వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల పట్టణాభివృద్ధి మంత్రులు, కార్యదర్శులు పాల్గొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ రూపొందించిన స్మార్ట్ సిటీల ముసాయిదాపై చర్చించారు. వెంకయ్య మాట్లాడుతూ.. ‘ఈ సిటీలకు జాగరూకతగల, సేవలకు డబ్బు చెల్లించగల పౌరులు, సమర్థ నాయకత్వం, జవాబుదారీతనం గల సుపరిపాలన అవసరం. ఇవన్నీ సమకూరితేనే పథకం విజయవంతమవుతుంది. సమర్థవంతమైన పట్టణ పరిపాలనకు.. సేవల ధరలను పెంచగల, సంస్కరణలను అమలు చేయగల, అక్రమ కట్టడాలను నిర్మూలించి, కబ్జాలను అరిక ట్టే నాయకత్వం కావాలి’ అని అన్నారు. దేశంలో ప్రస్తుతం 37 కోట్ల మంది పట్టణాల్లో నివసిస్తున్నారని, వచ్చే 15 ఏళ్లలో వీరి జనాభా మరో 15 కోట్లకు, 2050 నాటికి మరో 50 కోట్లు పెరుగుతుందని వివరించారు. పట్టణ సంస్థల రాజకీయ నాయకత్వం సరైన వనరులు సమకూర్చకపోవడంతో జవహర్‌లాల్ నెహ్రూ పట్టణ నవీకరణ పథకం విఫలమైందని, స్మార్ట్ సిటీల పథకంలో ఇలాంటి వాటిని సహించబోమని అన్నారు. ఈ సిటీల పథకం ముసాయిదాపై రాష్ట్రాలు వారం రోజుల్లో అభిప్రాయాలను పంపాలన్నారు.
ముసాయిదా పత్రంలోని ముఖ్యాంశాలు..
- ఈ నగరాల్లో 20 ఏళ్లపాటు తలసరి పెట్టుబడి వ్యయం రూ. 43,386 గా అత్యున్నతాధికార నిపుణుల కమిటీ(హెచ్‌పీఈసీ) అంచనా వేసింది. నీటి సరఫరా, రవాణా తదితరాల పెట్టుబడులన్నీ ఇందులో ఉన్నాయి. వంద స్మార్ట్ సిటీల్లో 10 లక్షల జనాభాను సగటుగా లెక్కించి మదింపు చేశారు. అంటే 100 నగరాల్లో 20 ఏళ్ల పాటు రూ. 7లక్షల కోట్లు పెట్టుబడి పెట్టాలి.
- పారిశ్రామిక వాడలు, ఎగుమతుల జోన్లు, వాణిజ్య, సేవల కేంద్రాలు, ఫైనాన్షియల్ కేంద్రాల ద్వారా ఆర్థికవృద్ధి సాధించేందుకు ప్రణాళికలు రూపొందిస్తారు.
- పథకం విజయవంతం కావడానికి అభివృద్ధి ప్రాణాళికలు రూపొందిస్తారు. దీనికి రూ. 5 వేల కోట్లు కావాలి.
- 13 అంశాలకు ప్రాధాన్యమిచ్చారు. వీటిలో రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, వ్యర్థపదార్థాల నిర్వహణ, మురుగునీటి కాల్వలు, టెలిఫోన్ నెట్‌వర్క్, వైఫై, ఆరోగ్యం, విద్య, అగ్నిమాపక నిర్వహణ తదితరాలు వీటిలో ఉన్నాయి.